Thursday, October 10, 2024

మాస్క్ పెట్టుకోమంటే.. దాడి చేసింది

మ‌హారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నా.. కొందరు మాస్కుల పట్ల నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. తాజాగా మాస్కు ధరించలేదని జరిమానా విధించిన మున్సిపల్ సిబ్బందిపై దాడి చేసిందో మహిళ. ఈ ఘటన ముంబైలోని కాండివ‌లీలో చోటుచేసుకుంది. కరోనా పెరుగుదల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం మాస్కును తప్పనిసరి చేసింది. మాస్కు లేకుంటే జరిమానా వసూలు చేస్తోంది. దీనిని అమలు చేసేందుకు మార్షల్స్ ను నియమించింది.
అయితే, ముంబైలోని కాండివ‌లీ రోడ్డు మార్గంలో ఓ మహిళా మాస్క్ లేకుండా కనిపించింది. ఆటోలో ఎక్కిన ఆ మహిళను అక్కడే పని చేస్తున్న మున్సిపల్ ఉద్యోగిని అడ్డుకుంది. మాస్క్ పెట్టుకోవాలని సూచించింది. దీంతో మున్సిప‌ల్ ఉద్యోగినిపై ఆ మ‌హిళ ఆక‌స్మికంగా దాడి చేసి చెంప చెల్లుమ‌నిపించింది. ఆటోలో నుంచి మ‌హిళా మున్సిప‌ల్ వ‌ర్కర్‌ను కాలితో త‌న్నింది. “ఎంత ధైర్యం నీకు… నాపై చెయ్యి వేస్తావా… నన్ను టచ్ చేస్తావా… నీకేంటే బాధ… నా ఇష్టం… నేను మాస్క్ పెట్టుకుంటాను… పెట్టుకోను… నీకేంటి నొప్పి” అంటూ వీర లెవెల్లో రెచ్చిపోయింది. అంతటితో ఆగకుండా జుట్టు పట్టుకొని లాగుతూ… పిడిగుద్దులు గుద్దింది. కనీసం అవతల ఉన్నది బీఎంసీ మున్సిపల్ ఉద్యోగిని అన్న జ్ఞానం కూడా లేకుండా వ్యవహరించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దేశంలోనే 60 శాతం కరోనా కొత్త కేసులు రోజూ మహారాష్ట్రలో వస్తున్నాయి. ముంబైలో మరింత ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఎలా ఆపాలో తెలియక అక్కడి ప్రభుత్వం భారీ ఫైన్లు వేస్తున్నా… ఫలితం దక్కట్లేదు. ప్రస్తుతం మహారాష్ట్రలో మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాలకు వస్తే రూ.200 ఫైన్ వేస్తున్నారు. అయినా సరే… ఈ మహిళ లాంటి వారు మాస్క్ పెట్టుకోకుండా ఎదురుతిరుగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement