Sunday, April 28, 2024

దేశంలో థర్డ్ ఫ్రంట్.. దీదీకి కేసీఆర్ మద్దుతు లేదా?

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తిరేపుతున్నాయి. ఓవైపు పెగాసస్ వ్యవహారం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తుంటే.. మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలు ఏకం అవుతున్నాయి. 2024 ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్ ను అధికారంలోకి తీసుకురావాలనే ఆలోచనలో పలు ప్రధాన పార్టీలు ఉన్నాయి. దీనికి ఎవరు నాయకత్వం వహిస్తారు? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, ఇందులో తెలంగాణ సీఎం కేసీఆర్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మోదీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలు ఏకం అవుతున్న వేళ.. కేసీఆర్ మాత్రం దేశ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ అంటూ  గతంలో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.  కాంగ్రెస్, బీజేపీలపై ఆధారపడని ఫెడరల్ ఫ్రంట్(సమాఖ్య కూటమి) ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్.. కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా రెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా పర్యటించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. సమాజ్‌ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ అధినేతలు అఖిలేశ్ యాదవ్, మాయావతి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, వైసీపీ అధినేత జగన్ సహా వివిధ పార్టీల నాయకులతో కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహించారు. 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చలు జరిపారు. అయితే, ఆ ఎన్నికల్లో విపక్ష పార్టీలకు షాక్ ఇస్తూ.. బీజేపీనే రెండోసారి అధికారంలోకి వచ్చింది. దీంతో ఫెడరల్ ఫ్రంట్ అంశం అటకెక్కింది.

అయితే, ఈసారి మాత్రం కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా దేశంలోని విపక్ష పార్టీలు పనిగా పెట్టుకున్నాయి. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యమా? కాదా? అనే అంశం మరోసారి చర్చనీయమైంది. ఇప్పుడు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. థర్డ్ ఫ్రంట్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా పలు రాజకీయ పార్టీల నేతలను కలుస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోనూ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన తాజా రాజకీయాలు, థర్డ్ ఫ్రంట్ అవకాశాలపై చర్చించారు. అయితే, ఈ విషయంలో దీదీకి కేసీఆర్ మద్దుతు ఇవ్వకపోడం చర్చనీయాంశంగా మారింది.  

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావాలన్న తపనతో సీఎం కేసీఆర్… గతంలో బెంగాల్ సీఎంతో భేటీ అయ్యారు. దేశం బాగుండాలంటే బీజేపీ కాంగ్రెస్‌యేతర ప్రభుత్వాలు కేంద్రంలో రావాలని అప్పుడే అభివృద్ధి దిశగా దేశం ముందుకు సాగుతుందని అన్నారు. అంతేకాదు కేసీఆర్ కేంద్రంలో కీలకంగా మారేందుకు పావులు కదిపారు. అలాంటి కేసీఆర్ నేడు దేశంలోని విపక్ష పార్టీలు ఏకం అవుతుంటే.. దేశ రాజకీయల వైపు కన్నెత్తి చూకపోవడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తాను దేశ రాజకీయాల్లోకి వెళ్తానని గతంలో చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు హుజురాబాద్ ఉపఎన్నికపైనే దృషి సారించడం గమనార్హం.

అయితే, సార్వత్రిక ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం ఉంది. దీంతో ఇప్పుడే తొందర పడొద్దు అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులోనూ కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఆయన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని భావించారు. అయితే, ప్రస్తుత పరిస్థితిలో ఎన్డీయేకు వ్యతిరేకంగా ఏ ఫ్రంట్ వచ్చినా.. అందులో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉండాల్సిందే. కాంగ్రెస్ లేకుండా మూడో ఫ్రంట్ సాధ్యం కాదని ఇప్పటికే చాలా పార్టీలు అభిప్రాయన్ని వ్యక్తం చేశాయి. దేశంలో మోదీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ తోపాటు కలిసి వచ్చే పార్టీలతో ముందుకు సాగాలని బెంగాల్ సీఎం మమత యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే థర్డ్ ఫ్రంట్ కు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ సమయంలో దీదీకి మద్దుతు ఇవ్వాల్సిన కేసీఆర్.. దేశ రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. మరి రాబోయే రోజుల్లో కేసీఆర్ దేశ రాజకీయాలపై స్పందిస్తారో లేదో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement