Thursday, May 2, 2024

పరారీలోనే లంక అధ్యక్షుడు గొటబయ.. భద్రతా దళాల మధ్య సేఫ్​ అంటున్న మీడియా వర్గాలు!

శ్రీలంక సంక్షోభానికి కారణమైన అధ్యక్షుడు గొటబయ రాజపక్సేపై ఒక్కసారిగా ప్రజలనుంచి తిరుగుబాటు ఎదురయ్యింది. దీంతో అతను ఇంట్లో నుంచి పరారయ్యారు. పదివేల మంది నిరసనకారులు లంక అధ్యక్షుడిని, ప్రధానమంత్రిని తమ నివాసాలను విడిచిపెట్టి వెళ్లాలని నిరసనలకు దిగిన రెండ్రోజుల తర్వాత ఇద్దరు నాయకులు బహిరంగంగా కనిపించడం లేదు. అధ్యక్షుడు గోటబయ ఆచూకీ బహిరంగంగా తెలియనప్పటికీ, ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే ప్రస్తుత చిరునామా చాలా రహస్యంగా ఉందని అధికారులు సోమవారం చెప్పారు.

అయితే.. నిరసనకారులు శనివారం ఉదయం రాజధాని కొలంబోలోని ప్రెసిడెంట్ హౌస్, అతని కార్యాలయం వైపు దూసుకు రావడానికి కొన్ని గంటల ముందు పోలీసులు కర్ఫ్యూను ప్రకటించారు. కర్ఫ్యూ ప్రకటన తర్వాత గందరగోళం మధ్య, రాజపక్సే సురక్షితమైన ప్రదేశానికి పారిపోవడానికి అధ్యక్షుడి భద్రత సిబ్బంది ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

కాగా, జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు అయిన కుసల్ పెరెరా మీడియాతో మాట్లాడుతూ.. గోటబయ అన్నయ్య మహింద రాజపక్స అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిర్మించిన భూగర్భ బంకర్ ద్వారా నావికాదళ శిబిరానికి అతన్ని తీసుకెళ్లడానికి అధ్యక్షుడి భద్రతకు అవకాశం ఉందన్నారు. అక్కడి నుంచి 73 ఏళ్ల అధ్యక్షుడిని కొలంబో నౌకాశ్రయం నుంచి  నౌకాదళానికి తరలించి ఉండవచ్చని పొలిటికల్​ అనలిస్టులు కూడా భావిస్తున్నారు.

ఇక.. మహింద రాజపక్సే అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి గన్‌బోట్‌లు నౌకాదళ శిబిరం వద్ద సిద్ధంగా ఉన్నాయని మహిందకు సన్నిహితుడు అయిన పెరెరా చెప్పారు. కాబట్టి.. గోటబయ రాజపక్సను భూగర్భ బంకర్ ద్వారా పక్కనే ఉన్న శ్రీలంక నేవీ క్యాంపునకు తీసుకెళ్లి, అధ్యక్ష భద్రతతో పాటు నౌకాదళం ద్వారా వేరే ప్రదేశానికి తీసుకెళ్లి ఉండవచ్చని  అంచనా వేస్తున్నారు. 

కానీ, ప్రస్తుతం ఆ నౌక ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదని, ఇది ఒక అంచనా మాత్రమేనని పెరెరా చెప్పారు. రాజపక్స ప్రస్తుతం సముద్రంలోని నౌకలో ఉన్నారని సైనిక వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా నివేదికలు తెలిపాయి. అతను శ్రీలంక సరిహద్దుకు సమీపంలో ఓడలో ఉండవచ్చని, పరిస్థితి మరింత దిగజారితే దేశం విడిచి పారిపోవచ్చని అధ్యక్షుడికి సన్నిహిత వర్గాలు తెలిపాయి.

- Advertisement -

దేశంలోని భద్రతా పరిస్థితిని అంచనా వేయడానికి భద్రతా అధికారులు సోమవారం మరోసారి సమావేశమవుతారని పోలీసు ఇన్‌ఛార్జ్, పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి తిరాన్ అల్లెస్ చెప్పారు. రాజకీయ నేతల భద్రతా ఏర్పాట్లు కూడా ఎజెండాలో ఉంటాయని తెలిపారు. అధ్యక్షుడు ఎక్కడ ఉన్నారో చర్చించబోమని,ఆ విషలేవీ బయటికి చెప్పలేమని అలెస్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement