Monday, April 29, 2024

ఇదేమి ‘చైత‌న్యం’..! విద్యార్థిని కొట్టి, కాలితో తన్నిన లెక్చరర్‌పై సస్పెన్షన్‌ వేటు

ఓ స్టూడెంట్​పై చేయి చేసుకోవడంతో పాటు అతడిని కాలితో తన్నిన లెక్చరర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం ఆ లెక్చరర్‌ను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన విజయవాడ బెంజి సర్కిల్‌లోని భాస్కర్‌ భవన్‌ క్యాంపస్‌లో నిన్న జరిగింది. విద్యార్థిపై చేయి చేసుకోవడంతో పాటు కాలితో తన్నిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం ఆ లెక్చరర్‌ను విధుల నుంచి తప్పించినట్టు తెలిపింది.

తరగతిలో తోటి విద్యార్థితో మాట్లాడిన ఓ విద్యార్థిని శ్రీ చైతన్య కాలేజీ లెక్చరర్‌ అందరి ముందే చెంపపై చెల్లున వాయించడంతోపాటు కోపం తాళలేక కాలితో తన్నాడు. ఈ ఘటనను తరగతిలోని మరో విద్యార్థి వీడియో తీసి తల్లిదండ్రులకు పంపడంతో గొడవ పెద్దగా మారింది. శుక్రవారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. దీన్ని జిల్లా విద్యాశాఖ, చైల్డ్‌లైన్ అధికారులతో పాటు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇంటర్ బోర్డు స్థానిక ఇన్‌స్పెక్టర్ రవికుమార్, జిల్లా విద్యాశాఖాధికారి రేణుక కళాశాలకు వెళ్లి ఘటనపై ఆరా తీశారు.

సదరు విద్యార్థి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్నాడని, పలుమార్లు చెప్పినా వినకపోవడంతో కోపం వచ్చి కొట్టినట్లు లెక్చరర్ వివరించాడు. అయితే ఈ వార్డులో ఫోన్ తీసుకెళ్లేందుకు విద్యార్థులకు అనుమతి లేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. అలాంటప్పుడు ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని పాటలు వినే అవకాశమే ఉండదని వారు వాదిస్తున్నారు. కట్టడి పేరుతో విద్యార్థులను దండించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్ మేరకు సదరు లెక్చరర్‌ను సస్పెండ్ చేసినట్లు ఆర్‌ఐఓ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement