Friday, March 29, 2024

వార్ జ‌రుగుతున్నా వెప‌న్స్ ఆగ‌లే.. రష్యా నుంచి భారత్‌కు ఎస్‌-400 సిమ్యులేటర్లు

ఒకవైపు ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఎస్‌-400 సిమ్యులేటర్లు, పరికరాలను భారత్‌కు రష్యా స‌ప్ల‌య్‌ చేసింది. భారీ ఎయిర్‌ ఢిఫెన్స్‌ క్షిపణి వ్యవస్థ రెండో స్క్వాడ్రన్‌గా ట్రైనింగ్‌ స్క్వాడ్రన్‌ ఏర్పాటుకు సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి. ఇందులో కేవలం శిక్షణకు సంబంధించిన సిమ్యులేటర్లు, పరికరాలు మాత్రమే ఉంటాయని రక్షణ వర్గాలు తెలిపాయి. క్షిపణులు లేదా లాంఛర్లు ఈ ట్రైనింగ్‌ స్క్వాడ్రన్‌లో ఉండవని పేర్కొన్నాయి. కాగా, ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో అమెరికా, ఐరోపా దేశాలు రష్యాపై పలు ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఆయుధాల సరఫరాపై ఇది ప్రభావం చూపవచ్చన్న ఆందోళన వ్యక్తమైంది.

అయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఒప్పందం మేరకు రష్యా నుంచి ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలు, పరికరాలు సరఫరా అవుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఎస్‌-400 సిమ్యులేటర్లు, పరికరాలను రష్యా నుంచి సముద్ర మార్గంలో అందుకున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ సరఫరా ఇంకా కొనసాగుతుందని, ఇప్పటి వరకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాలేదని వెల్లడించాయి. మరోవైపు బ్యాంకు వ్యవహారాలకు సంబంధించిన ఆంక్షల వల్ల రష్యాకు భారత్‌ చెల్లింపులు చేయలేకపోతున్నది. ఈ నేపథ్యంలో దీని వల్ల ఇదే విధంగా ఆయుధాల సరఫరా కొనసాగుతుందా లేదా అన్నది చెప్పలేమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఈ సమస్య పరిష్కారం కోసం ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement