Saturday, May 4, 2024

నీళ్లు, నిధులు తెచ్చినం.. మరి మీరేం తెచ్చారో చెప్పాలే: బీజేపీ ఎంపీలకు టీఆర్‌ఎస్ సవాల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : నిరుద్యోగంపై కేంద్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని టీఆర్‌ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. గురువారం న్యూఢిల్లీలోని తెలంగాణా భవన్‌లో ఆ పార్టీ ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సురేష్ రెడ్డి, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాసరెడ్డి, పోతుగంటి రాములు, వెంకటేష్ నేత కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. కేసీఆర్ ఉద్యోగాలివ్వడంలేదని యువతను రెచ్చగొడుతున్న బీజేపీ ఎంపీలు మరి సీఎం తెలంగాణా తెచ్చిన అనేక పరిశ్రమల గురించి ఎందుకు చెప్పట్లేదని కొత్త ప్రభాకర్ ప్రశ్నించారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు 12 కేంద్ర ప్రభుత్వ సంస్థలను మూసి వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాము రాష్ట్రానికి నీళ్ళు, నిధులు తెచ్చాం, లక్షకు పైగా ఉద్యోగాల నియామకం చేపట్టాం, 90 వేలకు పైగా ఉద్యోగాలు భర్తి చేయబోతున్నామని ఆయన వివరించారు. మరి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎన్ని ఉద్యోగాలిచ్చారు? తెలంగాణ పర్యాటక ప్రాంతాలకు ఎన్ని నిధులిచ్చారని ప్రశ్నించారు.

బీజేపీ నాయకులను తెలంగాణా ప్రజలు తరిమికొట్టే రోజులొచ్చాయని ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. దేశంలో అనేక ప్రభుత్వ సంస్థలను మూసివేయడంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎంపీ నామా నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన మూడేళ్లలో 25 వేల పైచిలుకు నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఉద్యోగాల విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో ఈ అంశాలను కూడా పార్లమెంట్‌లో లేవననెత్తుతామన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయాలని ఎంపీ రాములు డిమాండ్ చేశారు. నిరుద్యోగులను మర్చిపోతే దేశద్రోహులుగా మిగులుతారని వ్యాఖ్యానించారు. చైనా ఏ విధంగా ఉద్యోగకల్పన చేస్తుందో చూడండంటూ హితవు పలికారు. రైతులకు గిట్టుబాటు ధర, యువతకు ఉద్యోగాలు ఇవ్వని మీకు దేశాన్ని పాలించే అర్హత ఉందా లేదా అని సమీక్షించుకోవాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలిచ్చింది, ఎన్ని ఎకరాలను కొత్తగా సాగులోకి తెచ్చామనే దానికి గణాంకాలు ఉన్నాయన్నారు.

అనంతరం ఎంపీ కేకే మాట్లాడుతూ… దేశంలో నిరుద్యోగం 8.1% పెరిగిందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరుగుతోందని, అర్బన్ ఏరియాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేయాలని కోరినట్టు గుర్తు చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉద్యోగం కోసం చేరే వారు 43% పెరిగారని చెప్పుకొచ్చారు. ఉద్యోగాల కల్పన కోసం కేటాయింపులు తగ్గిస్తున్నారని విమర్శించారు. ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, అసంఘటిత రంగంలో బడ్జెట్ కేటాయింపులు పెంచాలని కోరారు. ఉద్యోగ కల్పన కోసం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలను 75 కోట్లకి తగ్గించారని వెల్లడించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement