Saturday, May 18, 2024

ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమిస్తే.. వాహనబీమా వర్తించదు

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు కొత్త నిబంధన అమలులోకి రానుంది. ప్రధానంగా రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే ట్రాఫిక్‌ ఉల్లంఘనలను తగ్గించేందుకు రవాణాశాఖ, బీమా కంపెనీలు సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించేవారిపై భారీ జరిమానా విధించడమే కాకుండా కోర్టు ఆదేశాల మేరకు బీమా క్లెయిమ్‌ల నిబంధనలను కూడా మార్చారు. కొత్త నిబంధనను బీమా కంపెనీలు ఏప్రిల్‌ 1నుంచి అమలు చేస్తున్నాయి. ఇక నుంచి కొత్త నిబంధనల ప్రకారం వాహనదారులు చేసే తప్పిదాలు వారిని బీమా ప్రయోజనాలకు దూరం చేస్తాయి. ఆటో, ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించేవారి సంఖ్య నిబంధనలకు మించి ఉండటంతోపాటు ఆ వాహనానికి ప్రమాదం జరిగితే బీమా సదుపాయం వర్తించదు.

హెల్మెట్‌ లేకుండా ద్విచక్రవాహనం నడిపి ప్రమాదానికి గురైనా బీమా అందదు. రాంగ్‌రూట్లో వాహనాలు నడిపేవారికి కూడా ఎలాంటి బీమా పరిహారం చెల్లించరు. మరోవైపు సరైన మార్గంలో వాహనాలు నడుపుతూ ఎదురుగా రాంగ్‌ రూట్లో వాహనాలు నడిపేవారికి ప్రమాదం జరిగినా వారిపై ఎలాంటి కేసు నమోదు చేయరు. రాంగ్‌రూట్‌లో వెళ్లేవారి వల్ల ప్రమాదం జరిగినట్లు తేలితే రూ.20లక్షల వరకు జరిమానా చెల్లించాలి. ఒకవేళ ఉల్లంఘించిన వారి ఆస్తులు విక్రయించినా జరిమానా మొత్తం రికవరీ అవ్వకపోతే 14సంవత్సరాలు జైలు శిక్ష విధించనున్నారు.

మద్యం తాగి వాహనాలు నడిపేవారికి కూడా ప్రమాదం జరిగిన బీమా వర్తించదు. బీమా సంస్థలు అటువంటి ప్రమాదాలకు పరిహారాన్ని చెల్లించవు. మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ ప్రమాదం బారినపడేవారికి ఇవే నిబంధనలు అమలు చేయనున్నారు. వీరు హెల్మెట్‌ ధరించినా, సరైన రూట్లో డ్రైవింగ్‌ చేసినాకూడా శిక్ష వర్తిస్తుంది. కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టు ధరించకుండా వాహనం నడిపినా, స్పీడ్‌ లిమిట్‌ను అధిగమించి వేగంగా వాహనాలు నడిపినవారికి బీమా వర్తించకపోవడంతోపాటు శిక్షలు తప్పవు.

Advertisement

తాజా వార్తలు

Advertisement