Saturday, May 4, 2024

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, సెన్సెక్స్‌ 714 పాయింట్లు పతనం

స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. దీంతో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. శుక్రవారం ఉదయం ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లు, రోజంతా అదే బాటలో పయనించాయి. అమెరికా వడ్డీ రేట్లను వేగంగా పెంచనున్నామనే ఫెడ్‌ సంకేతాలు మార్కెట్‌ సెంటిమెంటును దెబ్బతీశాయి. దీనికి తోడు గత రెండు రోజుల పాటు మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ద్రవ్యోల్బణ భయాలు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వంటి పరిణామాలతోపాటు దేశీయంగా కరోనా కేసులు పెరుగుతుండటం సూచీలకు ప్రతికూలంగా మారాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ ఉదయం 57,531 పాయింట్ల వద్ద ప్రారంభమై, ఓ సమయంలో 57,690 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది.

57,134 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు, ఆ తర్వాత అంతకంతకూ క్షీణించి సాయంత్రానికి 700 పాయింట్లకు పైగా నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 714 పాయింట్లు నష్టపోయి 57,197 పాయింట్ల వద్ద, నిప్టీ 220 పాయింట్లు క్షీణించి 17,171 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 30 సూచీలో మహీంద్రా అండ్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, మారుతీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎస్బీఐ, హిందూస్తాన్‌ యూనీలీవర్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, డాక్టర్‌ రెడ్డీస్‌, యాక్సిస్‌ బ్యాంకు, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్‌, కొటక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌ నష్టాల్లో ముగిశాయి. కాగా దిగ్గజ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్‌ గురువారం నాలుగో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. హెచ్‌సీఎల్‌ లాభం మూడింతలు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను నికర లాభం (ప్రాఫిట్‌ ఆప్టర్‌ ట్యాక్స్‌) రూ.3593 కోట్లను ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన ఇది మూడు రెట్లు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.1102 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. 2021 డిసెంబర్‌ త్రైమాసిక లాభం రూ.3442 కోట్లతో పోల్చినా 4.4 శాతం పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement