Monday, April 29, 2024

విజయనగరం జిల్లాతో ‘రోశయ్య’కు ప్రత్యేక అనుబంధం ..


-సిఎం హోదాలో 2011లో జిల్లా కేంద్రానికి రోశయ్య
-వైఎస్‌ఆర్‌ నగర్‌ కాలనీని ప్రారంభించిన వైనం
-తమిళనాడు గవర్నర్‌ హోదాలో కన్యకాపరమేశ్వరి కోవెల సందర్శన
-నిరాడంబరుడు, అజాత శత్రవు రోశయ్య : మంత్రి బొత్స
-ఎమ్మెల్యే కోలగట్ల నివాసంలో రోశయ్యకు ఘన నివాళి…

విజయనగరం-ప్రభ న్యూస్‌ బ్యూరో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ రాజకీయనేత కొణిజేటి రోశయ్యకు విజయనగరం జిల్లాతో ప్రత్యేక అనుబంధముంది. దీంతో రోశయ్య పరమపదించిన వార్త జిల్లా వాసుల్లో చాలా మందిని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. దివంగత వైఎస్‌ క్యాబినెట్ లో ఆర్ధిక మంత్రిగా వున్న రోశయ్య తదనంతర పరిస్థితుల్లో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన వైనం తెలిసిందే. వైఎస్‌ క్యాబినెట్‌లో రోశయ్య వున్నప్పుడు సహచర మంత్రిగా, రోశయ్య క్యాబినెట్‌లో కూడా మంత్రిగా బొత్స సత్యనారాయణకు రోశయ్యతో ప్రత్యేక అనుబంధం వుంది.అదే విధంగా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి కూడా రోశయ్యతో ప్రత్యేక అనుబంధం వుంది. రోశయ్య విజయనగరం వచ్చిన ప్రతీసారి కోలగట్ల నివాసాన్ని సందర్శించే వారు. 2004కు పూర్వం కోలగట్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి కూడా రోశయ్య హాజరయ్యారు. అదే విధంగా విజయనగరానికి చెందిన ప్రముఖ ఆర్యవైశ్యులతో రోశయ్యకు చక్కని సంబంధబాంధవ్యాలు వుండేవని చెప్పవచ్చు.

ముఖ్యమంత్రి హోదాలో 2011లో విజయనగరానికి :

2011లో విజయనగరం అర్బన్‌ హౌసింగ్‌ కాలనీ వైఎస్‌ఆర్‌ నగర్‌ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హోదాలో రోశయ్య జిల్లా కేంద్రానికి విచ్చేశారు. తమిళనాడు గవర్నర్‌గా వున్న సమయంలో కూడా రోశయ్య విజయనగరం విచ్చేశారు. స్థానిక కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు పలు ప్రైవేట్‌ కార్యక్రమాల్లో రోశయ్య పాల్గొన్నారు. తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్ట్‌ పరిధిలోని పాత కాల్వల ఆధునీకరణ పనులకు అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో రూ.100 కోట్లు మంజూరు చేసిన రోశయ్య విజయనగరం-శ్రీకాకుళం సరిహద్దుల్లో ఆమేరకు శంకుస్థాపన చేశారు.

రోశయ్య లేని లోటు పూడ్చలేనిది : మంత్రి బొత్స

- Advertisement -

నిరాడంబరుడు, అజాత శత్రువు, చక్కని ఆర్థికవేత్త, సదీర్ఘ రాజకీయ అనుభవశాలి అయిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య నిష్క్రమణ పూడ్చలేని లోటు అని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విజయనగరం కలెక్టరేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశం వేదికగా రోశయ్య సేవలను, ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని బొత్స గుర్తు చేసుకున్నారు. విలువలతో రాజకీయం చేసిన రోశయ్య వంటి వ్యక్తి లేకపోవడం రాష్ట్రానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సంతాపం వ్యక్తం చేసారు బొత్స. మరోవైపు అలాగే కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కూడా ఆ పార్టీకి చెందిన నాయకులు రోశయ్య చిత్ర పటానికి నివాళులర్పించారు.

రోశయ్యతో నాది ప్రత్యేక అనుబంధం : కోలగట్ల
దివంగత ముఖ్యమంత్రి రోశయ్యతో తనది ప్రత్యేక అనుబంధమని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. సాయంత్రం కోలగట్ల నివాసంలో రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కోలగట్ల రోశయ్య సేవలును కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement