Saturday, April 27, 2024

MLC Election Results: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో TRS క్లీన్‌ స్వీప్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్‌ పార్టీ తన హవాను కొనసాగించింది. ఎన్నికలు జరిగిన ఆరు స్థానాలకు ఈ రోజు ఫలితాలు వెల్లడించారు. అన్ని స్థానాల్లోనూ టీఆర్ఎస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. ఉమ్మడి కరీంన‌గర్‌ జిల్లాలో రెండు స్థానా‌లను గెలిచిన టీఆర్ఎస్.. ఉమ్మడి మెదక్‌, ఆది‌లా‌బాద్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానంలో జరిగిన ఎన్నికల్లోనూ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.

మొత్తం 12 స్థానాల‌కుగాను.. ఆరు స్థానాల‌ను ఏక‌గ్రీవంగా టీఆర్ఎస్‌ గెలిచిన విష‌యం తెలిసిందే. మిగిలిన ఆరు స్థానాలకు ఈ నెల 10న ఎన్నికలు నిర్వహించారు. ఐదు ఉమ్మ‌డి జిల్లాల్లో ఓట్ల లెక్కింపు జ‌రిగింది. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎల్ రమణ, భాను ప్రసాదరావు విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 1320 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 17 ఓట్లు చెల్లనివి కాగా, 1303 చెల్లుబాటు అయ్యాయి. భానుప్రసాద్‌కు 584 ఓట్లు రాగా, రమణకు 479 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థిగా కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ పోటి చేసిన ఓడిపోయారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకోంది. టీఆర్ఎస్ అభ్యర్థి దండే విట్టల్ తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి పెందూర్ పుష్పరాణిపై 667 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పోలైన 860 ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి దండే విట్టల్ కు 742 ఓట్లు రాగా.. ఇండిపెండెంట్ అభ్యర్థి పెందూర్ పుష్పరాణికు 75 ఓట్లు వచ్చాయి. 45 ఓట్లు చెల్లకుండా పోయాయి.

- Advertisement -

ఇక, ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వంటేరు యాదవరెడ్డికి 762 ఓట్ల వచ్చాయి. సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ అభ్యర్థి నిర్మల జగ్గారెడ్డికి 238 ఓట్లే పోలయ్యాయి. మరో స్వతంత్ర అభ్యర్థికి కేవలం ఆరు ఓట్లే వచ్చాయి. మెదక్‌ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 12 ఓట్లు చెల్లనివిగా తేలాయి.

ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు విజయం సాధించారు. మొత్తం 768 ఎమ్మెల్సీ ఓట్లకు గానూ 738 ఓట్ల పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుకు 486 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుకు 239 ఓట్లు వచ్చాయి. దీంతో తొలి ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు గెలుపొందినట్లు ఈసీ అధికారులు ప్రకటించారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి 691 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఎన్నికల్లో మొత్తం 1,271 ఓట్లకు గానూ 1233 పోలయ్యాయి. ఇందులో 50 చల్లని ఓట్లు ఉన్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డికి 917 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి నగేష్ కు 226 వచ్చాయి. టీఆరెస్ కోటిరెడ్డి 691 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement