Friday, April 26, 2024

Vikarabad: పలువురు తహసీల్దార్ల బదిలీ.. విధుల్లో చేరిన ఆరునెలల్లోనే మరోచోటికి

(ప్రభన్యూస్‌ ప్రతినిధి, వికారాబాద్‌) : వికారాబాద్​ జిల్లాలో ఇద్దరు తహసీల్దార్ల బదిలీ చర్చనీయాంశంగా మారింది. ఈ బదిలీలపై రెవెన్యూ వర్గాలలో చర్చ మొదలైంది. జిల్లా కేంద్రం వికారాబాద్‌ తహసీల్దార్‌ షర్మిలను బదిలీ చేశారు. విధుల్లో చేరిన ఆరుమాసాల్లోనే ఆమె బదిలీ కావడం గమనార్హం. ఇక జిల్లా వ్యాప్తంగా పలువురు తహసీల్దార్ల పనితీరుపై ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఒక తహసీల్దార్‌ రెండు కీలక మండలాల్లో విధుల్లో ఉండడం గమనార్హం.

\

తహసీల్దార్ల తాజా బదిలీ వెనుక అసలు కారణాలు వెల్లడికాకపోవడంతో రెవెన్యూ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలలో గుసగుసలు ప్రారంభం అయ్యాయి. ఉన్నట్టుండి కీలక స్థానంలో ఉన్న తహసీల్దార్‌ను బదిలీ చేయడంతో అందరి దృష్టి బదిలీలపై పడింది. రాజకీయ వర్గాల వత్తిడి కారణంగా బదిలీ జరిగిందా.. విధులలో తప్పిదం కారణంగా వేటు వేశారా..ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు స్థానచలనం కలిగించారా అనేది తేలాల్సి ఉంది.

ధరణి సేవలు అందుబాటులోకి వచ్చిన తరువాత మండల తహసీల్దార్లు కీలకంగా మారారు. ధరణిలోని వ్యవసాయ భూముల రికార్డులను సరిచేసేందుకు..రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ప్రభుత్వం తహసీల్దార్లకు అధికారాలను కల్పించింది. ధరణిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై నివేదికలు సిద్దం చేసి జిల్లా కలెక్టర్‌కు మండల తహసీల్దార్లు పంపించాల్సి ఉంది. ఈ నివేదికల ఆధారంగా జిల్లా కలెక్టర్‌ నిర్ణయం తీసుకుంటారు. ధరణిలోని వ్యవసాయ భూముల రికార్డులను సరిచేయడంలో తహసీల్దార్ల నివేదిక కీలకంగా మారడంతో పలువురు తహసీల్దార్లపై రాజకీయ నేతల వత్తిడి కొనసాగుతోంది.

- Advertisement -

మరికొందరు తహసీల్దార్లు పెద్ద మొత్తంలో మాట్లాడుకొని అనుకూలంగా నివేదికలు ఇస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ల సమయంలో కూడా కొందరు తహసీల్దార్లు కొర్రీలు సృష్టించి భారీగా వసూళ్లు చేస్తున్నారు. జిల్లాలోని పలువురు తహసీల్దార్లపై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement