Saturday, May 4, 2024

కూలిన మూడంత‌స్తుల భ‌వ‌నం.. ఇద్ద‌రు మృతి.. 18మందికి గాయాలు

మూడంత‌స్తుల భ‌వ‌నం కుప్ప కూలింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతి చెందారు. కాగా శిథిలాల కింద 20నుండి 25మంది కూలీలు చిక్కుకున్నాని స‌మాచారం. ఈ ప్ర‌మాదం హ‌ర్యానా క‌ర్నాల్ జిల్లా తారావాడి వ‌ద్ద చోటు చేసుకుంది.భవనం కూలిన సమాచారం అందడంతో అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తం అయ్యింది. వెంటనే అధికారులు, పోలీసులు, రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. . తారావాడిలో ఉన్న శివశక్తి అనే రైస్ మిల్లు మూడు అంతస్తుల భవనంలో నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 100 మంది కూలీలు నివసించేవారు. కాగా చాలా మంది కార్మికులు అందులోనే నిద్రపోయారు. అయితే మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ భవనం ఒక్క సారిగా కుప్పకూలిపోయింది.

దీంతో 20 నుంచి 25 మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. కాగా ఇద్దరు కూలీలు మృతి చెందారని, 18 మంది కూలీలు గాయపడ్డారని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని మెడికల్ కాలేజీకి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న కూలీలను పోలీసులు, రెస్క్యూ టీం బయటకు తీసుకొస్తున్నారు. ప్రమాదాన్ని చూసిన ఇతర కూలీలు ఆందోళనకు గురవుతున్నారు. షాక్ లో వారు కూడా సరైన సమాచారం ఇవ్వలేకపోతున్నారు. కాగా.. భవనం కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియడం లేదు. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే డీసీ అనీష్ యాదవ్, ఎస్పీ శశాంక్ సావన్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement