Tuesday, May 21, 2024

రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి బెదిరింపులు

దిగ్గజ వ్యాపారుల్లో ఒకరైన రిలయన్స్ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీకి బెదిరింపులు వచ్చాయి. గుర్తుతెలియని వ్యక్తి రిలయన్స్ ఫౌండేషన్‌కు ఫోన్ కాల్ చేసి, తాను నెంబర్ వన్ టెర్రరిస్ట్ అని, ముకేశ్ అంబానీ అంతుచూస్తానని బెదిరించడంతో పాటు ఎన్ఐఏ, ఏటీఎస్, ముంబై పోలీసులపై దుర్భాషలాడాడు. రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి గుర్తుతెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి ముకేష్ అంబానీతో పాటు ఆయన కుటుంబాన్ని బెదిరించాడు. రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రి అధికారులు డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు.

డీబీ మార్గ్ పోలీసులు ఈ ఫోన్ కాల్స్‌ని వెరిఫై చేస్తున్నారు. ఆంటిలియా భవనం బయట భద్రతను పెంచుతామని, ప్రైవేట్ భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే పెంచామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఫోన్ చేసిన వ్యక్తి తన పేరు అఫ్జల్ అని చెప్పినట్టు తెలుస్తోంది. ముంబై పోలీసుల సమాచారం ప్రకారం బెదిరించడం, చంపేస్తానని హెచ్చరించడం, దుర్భాషలాడటం లాంటి సెక్షన్లతో కేసు పెట్టామని, ఫోన్ కాల్స్ చేసిన వ్యక్తి పదేపదే బెదిరింపులకు పాల్పడ్డాడని, తాను ముకేష్ అంబానీ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని తెలిపారు. ఫోన్ కాల్ రికార్డుల్ని పోలీసులు విన్నారు. అయితే అతను మానసిక రోగి కావచ్చని లేదా ఏదైనా ఒత్తిడితో ఇలా బెదిరించి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఫోన్ కాల్ చేసిన వ్యక్తి లొకేషన్ తెలుసుకునేందుకు చురుగ్గా దర్యాప్తు చేస్తున్నట్టు ముంబై పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement