Monday, October 7, 2024

TS: తెలంగాణను ఫెయిల్యూర్​గా చూపించాలనుకున్నారు.. మోదీకి విజన్​ లేదు: కేటీఆర్​

తెలంగాణ రాష్ట్రాన్ని ఫేయిల్యూర్ స్టేట్ గా చూపించాలనుకున్న మోదీ సర్కార్ తాను తీసుకున్న గోతిలో తానే పడిందన్నారు టీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. నాలుగేండ్లకు సరిపడా గోధుమలు, బియ్యం నిల్వలు ఉన్నాయని ఆరునెలల కింద గొప్పగా చెప్పుకున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా బియ్యం ఎగుమతులను నియంత్రించి 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించడమే ఇందుకు నిదర్శనం అన్నారు. ఇప్పటికే గోధుములు, దాని ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించిన మోదీ సర్కార్, తాజాగా నూకల ఎగుమతిపైనా నిషేధం విధించిందన్నారు. ప్రస్తుతం ఎఫ్.సి.ఐ గోడౌన్లతో పాటు వివిధ కేంద్రాల దగ్గర బియ్యం, నూకలు, గోధుమల నిల్వలు భారీగా తగ్గడంతోనే మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ రైతులు, రాష్ట్రంపై  మోదీ సర్కార్ కు ఉన్న వివక్షతోనే దేశంలో ఆహార ధాన్యాల కొరత తలెత్తే ప్రమాదం ముంచుకొస్తుందన్నారు. దేశ ప్రజల ఆహార అవసరాలపై మోదీ సర్కార్ కు దీర్ఘకాలిక ప్రణాళిక కరువైందన్న సంగతి ప్రస్తుత సంక్షోభంతో తేలిపోయిందన్నారు. దేశాభివృద్ధి, ప్రజాసంక్షేమంపై కనీస అవగాహన, ఆలోచన, ప్రణాళిక లేని మందబుద్ది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండడం ప్రజల దురదృష్టమని కేటీఆర్ విమర్శించారు.

తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని కేవలం ఆరు నెలల కిందట తాము విజ్ఞప్తి చేస్తే, దేశంలో అవసరానికంటే ఎక్కువ ఆహార నిల్వలున్నాయని చెప్పి తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుత కొరతకు కారణమేంటో చెప్పాలని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను  మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశ ప్రజల అవసరాలపై కనీస అవగాహన లేకపోవడం, ఆహార ధాన్యాల సేకరణలో కేంద్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానమంటూ లేకపోవడమే ప్రస్తుత దుస్థితికి కారణమని మండిపడ్డారు.

తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించడం అలవాటు చేయాలని అవమానించిన పియూష్ గోయల్, ఇప్పుడు నూకల ఎగుమతులను నిషేధించి వాటినే తింటారెమో అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంగా ఏర్పడి 8సంవత్సరాలే అయినప్పటికీ 75 ఏళ్ల  స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రం కూడా అందుకోని విధంగా ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణకి న్యాయంగా దక్కాల్సిన చేయూత మోదీ సర్కార్ నుంచి అందడం లేదని కేటీఆర్ ఆరోపించారు. నీళ్ల విషయంలో అరిగోస పడ్డ తెలంగాణ రైతుల దశ మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంతో శ్రమకోర్చి సాగునీటి ప్రాజెక్టులను రికార్డు సమయంలో పూర్తి చేశారన్నారు. ఉచిత కరెంటు, రైతుబంధు వంటి విప్లవాత్మక పథకాలతో తెలంగాణలో లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయని చెప్పారు.

- Advertisement -

పుట్ల కొద్దీ ధాన్యం పండించి దేశానికే అన్నం పెట్టే స్థాయికి అన్నపూర్ణగా తెలంగాణ ఎదిగిందని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. అయితే యాసంగిలో బాయిల్డ్‌ రైస్‌ తీసుకోమంటు మోడీ సర్కార్ కొర్రీలు పెట్టడంతో తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. రైతులను వరి వెయ్యనియ్యకుండా ఇతర పంటల వైపు మళ్లించాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తెచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. ఫలితంగా గత వానకాలం సీజన్‌తో పోల్చితే ఈసారి సీజన్‌లో దేశవ్యాప్తంగా సుమారు 95 లక్షల ఎకరాల్లో వరిసాగు తగ్గిందన్నారు. రాబోయే రోజుల్లో ఇది కోటి ఎకరాలు దాటే అవకాశం కూడా ఉందని కేటీఆర్ చెప్పారు. దీంతో దేశ వ్యాప్తంగా 12-15 మిలియన్‌ టన్నుల బియ్యం ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. ఇందుకే బియ్యం ఎగుమతులను కేంద్రం నియంత్రించిందన్నారు.

దేశానికి ఒక సమగ్ర ఆహార ధాన్యాల సేకరణ విధానం లేకపోవడం మోడీ ప్రభుత్వ వైఫల్యమే అని కేటీఆర్ విమర్శించారు.140 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఆహార భద్రత లేని పరిస్థితిలో ఉండటం బిజెపి ప్రభుత్వ హ్రస్వ దృష్టిని సూచిస్తోందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాలు మార్చుకొని ప్రజల సంక్షేమం, ఆహార భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశ వ్యవసాయ రంగం, ఆహార అవసరాలపై ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించాలన్నారు.

ఇందుకోసం వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటినుంచో కోరుతోందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం సేకరణ విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని అమలుచేయకుండా దేశ రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుందని విమర్శించారు. పండిన ధాన్యాన్ని సేకరించకుండా కేవలం రాజకీయాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ రోజు ఆహార కొరత ముంగిట్లో దేశం నిలిచిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాజకీయాలను పక్కనపెట్టి ఎలాంటి వివక్షకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. భారీగా ధాన్యం పండిస్తున్న తెలంగాణ లాంటి రాష్ట్రాల నుంచి పూర్తిస్థాయి ధాన్యాన్ని సేకరించి దేశ ప్రజల ఆహార భద్రతను ధోకా లేకుండా చూడాలని పియూష్ గోయల్ ను కేటీఆర్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement