Sunday, April 28, 2024

ది వారియ‌ర్ మూవీ రివ్యూ..

హీరో రామ్.. మొద‌టిసారి డ్యూయ‌ల్ రోల్ ని పోషించిన సినిమా ది వారియ‌ర్. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి రూపొందించిన ఈ చిత్రం తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కింది. రామ్ తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించారు. మ‌రి ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం..

కథ ఏంటంటే – రామ్ హైదరాబాదులో ఎంబీబీఎస్ అయ్యాక.. హౌస్ సర్జన్ పూర్తి చేయడం కోసం తన తల్లితో కలిసి కర్నూలుకు వస్తాడు. అక్కడ ఆది పినిశెట్టి అనే రౌడీదే ఆధిపత్యం. తన తండ్రిని చంపిన వ్యక్తిని 14 ఏళ్ల వయసులో హత్య చేసి జైలుకెళ్లిన అతను.. తిరిగొచ్చాక సిటీని తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. తన కళ్ల ముందు గురు మనుషులు హత్య చేయడం చూసిన సత్య.. వాళ్ల మీద పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు. దీని వల్ల అతను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గురు చేతిలో చావు దెబ్బలు తిన్న సత్య ఆ ఊరే విడిచి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఆ స్థితిలో అతనేం నిర్ణయం తీసుకున్నాడు.. దాని పర్యవసానాలేంటి.. గురు అఘాయిత్యాలకు అతను అడ్డుకట్ట వేయగలిగాడా అన్నది మిగతా కథ.

- Advertisement -

విశ్లేషణ- చిన్న హింట్ ఇస్తే అల్లుకుపోయి.. పాత్రను.. సినిమాను తమ ఎనర్జీతో వేరే స్థాయికి తీసుకెళ్లే హీరోలు తక్కువ మంది ఉంటారు. వాళ్లకు సరైన క్యారెక్టర్ పడడం కీలకం. రామ్ కెరీర్లో తొలిసారి పోలీస్ పాత్ర చేయడం.. తమిళంలో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగి తెలుగు ప్రేక్షకులను కూడా ఆకర్షించిన లింగుస్వామి అతడిని డైరెక్ట్ చేయడంతో ‘ది వారియర్’ మీద మన ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి.. అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ ఆసక్తిని ఈ సినిమా ఎంతో సేపు నిలబెట్టకపోయింది. అంచనాలకు చాలా దూరంలో ఆగిపోయింది.

నటీనటులు- హీరో రామ్ ఎనర్జీని దర్శకుడు ఎంతమాత్రం ఉపయోగంచుకోకపోవడంతో పోలీస్ పాత్ర నిస్సారంగా తయారై రామ్ ఇందులో మిస్ ఫిట్ అయ్యాడేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందుకు రామ్ ను నిందించడానికేమీ లేదు. డాక్టర్ పాత్రలో అయితే రామ్ మరీ మామూలుగా కనిపించాడు. డ్యాన్సులు.. ఫైట్ల వరకు రామ్ ఎనర్జీ కనిపించినా.. ఓవరాల్ గా అతడి పాత్రలో ఉండాల్సినంత ఫైర్ లేకపోయింది. హీరోయిన్ కృతి శెట్టిలో నటన పరంగా ఉన్న బలహీనతలు సినిమా తర్వాత సినిమాకు బయటికి వచ్చేస్తున్నాయి. ఆమె ముఖంలో అసలు హావభావాలే పలకలేదు. తెరపై ఆమె చాలా డల్లుగా కనిపించింది. గ్లామర్ పరంగా కూడా ఆమె అంతగా ఆకట్టుకున్నది లేదు. సినిమాలో పాత్ర-నటన పరంగా కొంచెం ప్రత్యేకత చాటుకున్నది ఆది పినిశెట్టి ఒక్కడే. విలన్ పాత్రలు చేయడంలో తనకున్న నైపుణ్యాన్ని అతను మరోసారి చూపించాడు. నదియా హీరో తల్లి పాత్రలో అలవాటైన రీతిలో నటించింది. బ్రహ్మాజీ.. జయప్రకాష్.. లాల్.. శరణ్య ప్రదీప్.. వారి ప‌రిధిలో వారు న‌టించారు.

టెక్నీషియ‌న్స్ – ‘ది వారియర్’ లాంటి మాస్ సినిమాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా కీలకం. మాస్.. యాక్షన్ సన్నివేశాలను ఎలివేట్ చేయాల్సింది.. సినిమాలో ఒక హడావుడి ఉండేలా చూడాల్సింది నేపథ్య సంగీతంతోనే. ఈ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ తీవ్రంగా నిరాశ పరిచాడు. ఓవైపు తమన్.. మరోవైపు అనిరుధ్ లాంటి సంగీత దర్శకులు బీజీఎంతో మామూలు సినిమాలను కూడా నిలబెడుతుంటే.. దేవిశ్రీ ప్రసాద్ ‘ది వారియర్’లో కాస్త విషయం ఉన్న సీన్లను కూడా డల్ బీజీఎంతో నిస్సారంగా తయారు చేశాడు. పాటలు కూడా ఉండాల్సిన స్థాయిలో లేవు. బుల్లెట్ సాంగ్ ఓ మోస్తరుగా అనిపిస్తుంది తప్ప.. మిగతావి ఏవీ హుషారు తెప్పించవు. సుజీత్ వాసుదేవ్ ఛాయాగ్రహణం ఓకే. విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. సాయిమాధవ్ బుర్రా డైలాగుల్లో మెరుపులు కనిపించలేదు. ఆయన ఎగ్జైట్ అయ్యే స్క్రిప్టును లింగుస్వామి ఇవ్వలేదన్నది స్పష్టమ‌వుతోంది. ఓవ‌రాల్ గా సినిమా విజ‌యం ప్రేక్ష‌కులు చూసే తీరుపై ఆధార‌ప‌డి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement