Monday, April 29, 2024

Big Breaking: పెద్దపల్లి ఎమ్మెల్యేని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. కార‌ణం ఏంటంటే..

పెద్దపల్లి జిల్లాలో ఇసుక దుమారం చెల‌రేగింది. టీఆర్ ఎస్ లీడ‌ర్ల‌కు ముడుపులు అందుతున్నాయ‌న్న ఆరోప‌ణలు వెల్లువెత్తాయి. దీంతో నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ క్ర‌మంలో స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్లు చేసుకుని ఓదెల‌టెంపుల్‌లో ప్ర‌మాణం చేయాల‌న్న ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఓదెలలో మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇసుక వ్యాపారుల నుండి టీఆర్ ఎస్‌ నాయకులు డబ్బులు తీసుకోలేదని ఓదెల మల్లన్న సాక్షిగా ఆదివారం ప్రమాణం చేయాలని మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు సవాల్ చేశారు.. దీన్ని సీరియ‌స్‌గా తీసుకున్న ఎమ్మెల్యే.. ‘‘మొనగాడివైతే డబ్బులు తీసుకున్నట్లు నిరూపించాలి, ఎవరు సాయం చేస్తారో, ఎవరు దోచుకుంటారో పెద్దపల్లి ప్రజలకు బాగా తెలుసు” అని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు.

ఆదివారం ఓదెల మల్లన్న దేవాలయానికి ముఖ్య నాయకులతో వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే సన్నద్ధం కాగా, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వేలాదిమంది పార్టీ నాయకులతో ఓదెల వెళ్లాలని సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఉండేందుకు పెద్దపెల్లి ఏసీపీ సారంగపాణి ఆధ్వర్యంలో సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రదీప్ కుమార్ తోపాటు ఎస్ఐలు బందోబస్తులో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement