Friday, April 26, 2024

ఫ్యూచర్ అంతా విశాఖదే.. ఇప్పటికే ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు..

విశాఖపట్నం, (ప్రభన్యూస్‌ బ్యూరో): రాజధాని వికేంద్రీకరణ బిల్లులు ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో నిన్న‌ తెలుగురాష్ట్రాల్లో విస్తృత చర్చకు అవకాశం కల్పించింది. అయితే ఇదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అసెంబ్లిలో మాట్లాడుతూ మరోసారి విశాఖ గొప్పతనాన్ని, ప్రత్యేకతలను చాటిచెప్పారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్దనగరంగా విశాఖ రూపాంతరం చెందిందని, ఈ నగరంలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని, కొద్దిపాటి సుందరీకరణ, అభివృద్ధి పనులు చేపడితే రాష్ట్ర పరిపాలన రాజధానిగా మార్చుకోవచ్చునని ముఖ్యమంత్రి వివరించారు. అంతేకాకుండా ప్రస్తుతం అమరావతిని అభివృద్ధి చేయాలంటే సుమారు లక్షకోట్లు అవసరమని, పైగా అభివృద్ధి చేసేందుకు సుమారు పదేళ్లకు పైగా పడుతుందని, ఆ సమయంలో లక్షకోట్లను ఆరేడు లక్షల కోట్లుగా సంపద సృష్టించుకోవచ్చునని చెప్పారు. విశాఖలో అయితే తక్షణమే అన్ని సదుపాయాలు ఉండడంతో పాటు పెద్దగా నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదని వివరించారు. ఈ సందర్భంగా విశాఖ విశిష్టతను, పట్టణీకరణ, అభివృద్ధిని విడమరిచి చెప్పారు.

విశాఖ నుంచే పూర్తిస్థాయి పరిపాలన సాగించి అదే సమయంలో ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. త్వరలోనే న్యాయనిపుణులు, మేధావులు అందరి సలహాలు తీసుకొని ఈ వ్యవహారంలో ముందుకు అడుగులు వేయనున్నారని సమాచారం. ప్రస్తుతం పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖలో ఇప్పటికే కొన్ని అభివృద్ధి పనులు పూర్తి కావచ్చాయి. మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలన్నా, రాజధానికి సంబంధించి ఏ విధమైన నిర్మాణాలు జరపాలన్నా న్యాయపరంగా, సాంకేతికంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో అందరి సలహాలను తీసుకొని, ప్రణాళికబద్దంగా అవసరమైన అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్న తదుపరి ముఖ్యమంత్రి విశాఖ నుంచే పరిపాలన సాగిస్తారని, ఇక్కడ నుంచే అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తారని వైకాపా వర్గాల్లో చర్చ జరుగుతుంది.

ఇందు కోసం విశాఖనుకూడా ఆయా రంగాల్లో సిద్ధం చేశారు. కావాల్సిన భవనాలు , ఇతర మౌళిక సదుపాయాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. వాటికి అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేసారు. ఇక అంతర్జాతీయ స్థాయిలో విశాఖనగరం ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు పొందింది. పారిశ్రామిక ప్రాంతంగా విశాఖలో అనేక పరిశ్రమలు ఉన్నాయి. పొడవాటి సముద్రతీర ప్రాంతంతో పాటు , విశాఖ పోర్టుట్రస్టు, గంగవరం పోర్టు వంటి అనేక పోర్టులు ఇక్కడే ఉన్నాయి. పెద్దనగరాలు అయిన హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాలకు దీటుగా విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిఉంది. విద్య, వైద్యంతో పాటు ఉపాధి అవకాశాలకు విశాఖ చిరునామాగా నిలిచింది. ప్రస్తుతం విశాఖలో ఉన్న సదుపాయాలకు అదనపు హంగులు అద్దితే భవిష్యత్తులో హైదరాబాద్‌కు దీటుగా విశాఖ నిలవనుంది. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి కూడా అదే విషయాన్ని సభలో విపులంగా ప్రస్తావించారు. విశాఖలో ఉన్న సదుపాయాలు, నగరం గొప్పతనం, ప్రత్యేకత అన్నీ కూలంకశంగా వివరించారు.

ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేసిన , చేయకపోయినా రియల్‌ ఎస్టేట్‌, ఇతర నిర్మాణ రంగాలకు పెద్దగా నష్టం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే అత్యధిక అభివృద్ధి చెందిన నగరంగా విశాఖ మాత్రమే పేరుగాంచింది. క్రమేపీ విశాఖ వచ్చే పర్యాటకుల సంఖ్య లక్షలకు చేరుకుంది. దేశీయ విమానాశ్రయంతో పాటు అంతర్జాతీయ సర్వీసులను ఇక్కడ నుంచి నడిపేందుకు త్వరలో బోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. మరో వైపు మెట్రో రైలు, ట్రామ్‌ కారిడార్‌, ఆరు లైన్ల జాతీయ రహదారులు, మినీ ఫ్లైఓవర్లు దశల వారీగా అందుబాటులోకి రానున్నాయి. రాజధానిగా విశాఖకు అవసరమైన అన్ని హంగులు సిద్దంగా ఉన్నాయి. ఈ సారి ప్రత్యేక ప్రణాళికతో విశాఖ నుంచే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పరిపాలన సాగించనున్నారని వైకాపా వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అలా చేసినట్లు అయితే వెనుకబడిన ఉత్తరాంధ్ర అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని భవిష్యత్‌ లక్ష్యంగా కనిపిస్తుంది.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement