Tuesday, May 21, 2024

కేంద్రానికి చికిత్స చేయాలి, దుష్టశక్తుల ఆటలు ఎక్కువ కాలం సాగవు.. ఇఫ్తార్‌ విందులో కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ”భారత దేశమంతటా నేడు అంధకారం అలుముకుంది. కానీ తెలంగాణ విద్యుత్‌ కాంతులతో విరాజిల్లుతోంది. కేంద్రంలో పరిస్థితులు ఏ మాత్రం బాగోలేవు.. రాష్ట్రంలో అద్భుతంగా పరిస్థితులు పురోగమనంలో ఉన్నాయి. కేంద్రంలో గడబిడ నెలకొంది. అక్కడ కొంత రోగం ఉంది. చికిత్స చేయాల్సిన అవసరం ఉంది” అని సీఎం కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. ”గత కొన్నేళ్ల క్రితం తెలంగాణ వాతావరణం అనేక ఇబ్బందులతో ఉండేది. కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి ఉండేది. వ్యవసాయానికి నీళ్లు లేకపోయేవి. కానీ మీ అందరి సహకారంతో పరిస్థితి మారిపోయిందని ఆయన పేర్కొన్నారు.

దుష్టశక్తుల ఆటలు ఎక్కువ కాలం కొనసాగవు. కొన్ని రోజుల పాటు వారిదే పైచేయి అయినట్లు కనిపిస్తుంది. కానీ చివరికి మానవత్వమే గెలుస్తుంది. మానవత్వం ఎప్పుడూ నశించదు. ఆ మానవత్వం పునాదుల మీద ఒకరినొకరు సహాయం చేసుకుంటూనే వుంటారు. సుహృద్భావ, ప్రేమపూర్వక జీవనం అందరికీ లభిస్తుంది” అని సీఎం కేసీఆర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం రంజాన్‌ పండుగ సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ముస్లింలకు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్‌ విందును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్‌ ముస్లిం సోదరులకు, దేశంలోని ముస్లింలందరికీ రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులకు సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా రంజాన్‌ తోఫా అందించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో తాగేనీరుగానీ, వ్యవసాయంగానీ, పండే పంటలలోగానీ తెలంగాణ అద్భుత ఫలితాలను సాధించిందన్నారు. మైనార్టీ పిల్లల కోసం అద్భుతంగా రెసిడెన్షియల్‌ పాఠశాలలను నిర్మించినట్లు చెప్పారు. అన్ని వసతులతో తెలంగాణ మైనార్టీ విద్యకు ప్రాధాన్యతనిచ్చిందన్నారు. తెలంగాణ తరహాలోనే దేశమంతటా ఇదే విధానం అమలు చేయాలని ఆయన ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రం అచిర కాలంలోనే అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కిందన్న సీఎం కేసీఆర్‌ ఈ అభివృద్ది సరిపోదని, ఇంకా ఎంతో అభివృద్ధి సాధించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఇంత పురోగతి సాధించినందుకు తనకు గర్వంగా ఉందన్నారు. నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు.

”ఓ నిర్మాణాత్మక అభివృద్ధి పథంలో తెలంగాణ పయనిస్తున్నందుకు ఎంతో గర్వంగా వుంది. నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నందుకు ఆనందంగా వుంది. దేశం మొత్తంలోనే 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతినొందింది. ప్రతి రంగానికీ నాణ్యమైన విద్యుత్‌నే అందిస్తున్నాం. ఇది ఏమాత్రం సరిపోదు. ఇంకా అభివృద్ధి సాధించాల్సి వుంది. ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం” అని సీఎం కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.

”తెలంగాణ కూడా దేశంలో భాగమే. దేశం, రాష్ట్రం బాగుంటేనే ప్రజలందరూ బాగుంటారు. 2014లో రాష్ట్ర తలసరి ఆదాయంతో పోలిస్తే, ఇప్పుడు పెరిగింది. మన తలసరి ఆదాయంలో సగం కూడా దేశానిది లేదు. కేంద్రం బల#హనంగా వుంటే రాష్ట్రం కూడా బల#హనంగానే వుంటుంది. ఏ పరిస్థితుల కారణంగానైనా కేంద్రంలో గడబిడ వుంటే కచ్చితంగా దానిని ఆపాలి. దానిని గాడిలో పెట్టాలి. అది మన బాధ్యత. దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు పాలుకానివ్వదు. నాకు పూర్తి విశ్వాసం వుంది. ఎక్కడైనా ఇబ్బందులు వస్తే దానిని అధిగమించే శక్తి ఆ దేవుడు ఇస్తాడు. అలాంటి విపత్కర పరిస్థితుల వరకూ తీసుకెళ్లడు” అని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.
నిర్మించడమే చాలా కష్టం…
”దేనినైనా కూల్చడం చాలా సులభం. నిర్మించడమే చాలా కష్టం. బెంగళూరులో ఎలాంటి అల్లర్లు జరుగుతున్నాయో చూస్తున్నాం” అని ఈ సందర్భంగా అక్కడి అల్లర్లను సీఎం కేసీఆర్‌ ఉదహరించారు. దేశమంతా ఇలాగే నడుస్తోంది. ఇది సరైన పద్ధతి కాదు. ప్రజలకు కూడా ఇది అర్థమవుతోంది. దీనిని బాగు చేయాల్సిన అవసరం వుంది అని ఆయన పేర్కొన్నారు.
ఈ దేశం కోసం పని చేసే అవకాశం తప్పక వస్తుంది…
”దేవుడు తెలంగాణను ఎలాగైతే అభివృద్ధి పథంలో నడిపించి, ఈ స్థాయికి తీసుకొచ్చారో.. దేశం వైపు కూడా మమ్మల్ని అలాగే నడిపిస్తారన్న నమ్మకం వుంది” అని సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తంచేశారు. అందులో అనుమానమే లేదు. మనకు కూడా ఈ దేశం కోసం పనిచేసే ఛాన్స్‌ వస్తుందన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్‌ మీ అందరికీ రంజాన్‌ పండగ శుభాకాంక్షలు అంటూ పండగ శుభాకాంక్షలు తెలిపారు. కేవలం తెలంగాణ ముస్లిం ప్రజలకే కాకుండా దేశంలోని ముస్లింలందరికీ రంజాన్‌ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement