Saturday, October 5, 2024

Spl Story | దేశానికే వన్నెతెస్తున్న తెలంగాణ పారిశ్రామిక ప్రగతి.. -ఇండస్ట్రీయల్‌ రంగంలో మరో విప్లవం!

-హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత మంత్రి కేటీఆర్‌ చొరవతో పారిశ్రామిక, ఐటీ రంగాల్లో ఊహించని అభివృద్ధి నమోదవైంది. పరిశ్రమల స్థాపనలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి పారిశ్రామిక ప్రగతి విస్తృతమైంది. పరిశోధననుంచి ఆవిష్కరణ, ఆవిష్కరణ నుంచి పరిశ్రమ, పరిశ్రమనుంచి శ్రేయస్సు అనే లక్ష్యాలతో తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేట్‌-ఇంక్యూబేట్‌-ఇన్‌ కార్పొరేట్‌.. నినాదంతో రూపొందించిన పారిశ్రామిక పాలసీ కొత్త పుంతలు తొక్కుతోంది. వినూత్న విధానాలు ఆశించిన ఫలితాలనిస్తున్నాయి. ప్రపంచమంతా తెలంగాణ పారిశ్రామిక విధానాలను ఆశక్తితో గమనిస్తోంది. పెట్టుబడిదారులంతా తమ పెట్టుబడులను ఎందుకు తెలంగాణకు తరలిస్తున్నారో దేశమంతా చర్చిస్తోంది. అందుకు సమాధానం అన్నట్లుగా పారిశ్రామిక రంగానికి మరిన్ని సేవలను కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

ఇప్పటికే దేశంలోనే అత్యద్భుతమైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తల కోసం మరో అడుగు ముందుకు వేసింది. పారిశ్రామిక రాయితీలను వారంలోపే చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల యాజమాన్యాలు తమకు సర్కార్‌ ఇచ్చిన రాయితీలను పొందేందుకు కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన అవసరం లేకుండా నేరుగా వారి ఖాతాలకే జమ చేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను పంపితే ఖాతాకు నగదును బదిలీ చేసేలా కార్యాచరణ చేపట్టింది. ఏడాదికోసారి విడుదలవుతున్న రాయితీల కోసం పడిగాపులు పడకుండా ఎప్పటికపస్పుడు విడుదల చేసేందుకు టెక్నాలజీని వాడుతోంది. ఫలితంగా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు అనువుగా, పెట్టుబడికి మరింత సహాయకారిగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రతీఏటా సుమారుగా రూ.2000కోట్ల రాయితీలను చెల్లిస్తున్న ప్రభుత్వం వీటిని ఇక ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు అవినీతిరహితంగా అందించాలని ఆమోదం తీసుకుంది.

అనూహ్య స్పందన…

- Advertisement -

టీఎస్‌ఐపాస్‌ విధానంతో ఇప్పటికే లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభించేలా, రాష్ట్రవ్యాప్తంగా 2518 కంపెనీలకు అనుమతులను జారీ చేసింది. ఇందుకు రూ. 409 కోట్ల సబ్సిడీని భరించిన సర్కార్‌ తద్వారా రూ. 20237 కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి పారించింది. అనుమతుల జారీ సరళతరం, రాయితీల కల్పన, అవినీతిలేని సత్వర అనుమతులకు పెట్టుబడిదారులు ఆకర్శితులయ్యారు. ఇప్పటికే అమెజాన్‌, మైక్రోమాక్స్‌, ఐటీసీ వంటి అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలోకి క్యూ కట్టిన సంగతి తెలిసిందే. ఇక లెక్కకుమించిన దేశీయ సంస్థలు కూడా భారీగా టీఎప్‌ఐపాస్‌ విధానంలో దరఖాస్తులను చేసుకున్నాయి. ప్రభుత్వం కూడా అందుకు అనువైన రీతిలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోంది. ముచ్చర్లలో ఫార్మాసిటీ, వరంగల్‌లో టెక్స్‌టైల్‌ హబ్‌, ఖమ్మంలో మెగా ఫుడ్‌ పార్క్‌, ఏరోస్పేస్‌ శిక్షణా కేంద్రాలకు అన్ని వసతులను సమకూర్చుతోంది. ఇదిబట్ల, నాదర్‌గుల్‌లో ఉన్న ఏరోస్పేస్‌ పార్కులతోపాటు కొత్తగా ఎలిమినేడులో మరో పార్క్‌కు శ్రీకారం చుట్టింది.

స్పెషల్‌ ఛేజింగ్‌సెల్‌తో సత్ఫలితాలు…

ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా పనిచేస్తున్న స్పెషల్‌ ఛేజింగ్‌ సెల్‌తో సత్ఫలితాలు వస్తున్నాయి. టీఎస్‌ఐపాస్‌ విధానంలో భాగంగా రూ. 5కోట్లలోపు పెట్టుబడి పెట్టే పరిశ్రమలకు జిల్లా స్థాయిలో అనుమతులు ఇస్త్తుండగా, రూ. 5కోట్లకు మించిన పెట్టుబడి ఉన్న పరిశ్రమలకు పరిశ్రమల శాఖ కమిషనరేట్‌నుంచి అనమతులు జారీ చేస్త్తున్న సంగతి తెలిసిందే. ఈ సెల్‌ అన్ని రకాల పారిశ్రామికవేత్తలకు సమాచారం, సలహాలు, అనుమతులకు కృషి చేస్తోంది.

కొత్తగా 5 పారిశ్రామిక సమూహాలు…

రాష్ట్రానికి 5 పారిశ్రామిక క్లష్టర్‌లను కేంద్రం మంజూరీ చేసింది. జాతీయ సూక్ష్మ, చిన్న పరిశ్రమల సమూహ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు క్లష్టర్‌లను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. స్థానికంగా ఉండే వనరుల ఆధారంగా ఇవి ఉత్పాదకత, పోటీ తత్వంపెంచి చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేయనుంది. ఈ పథకంలో భాగంగా ఆయా ప్రతిపాదిత జిల్లాల్లో 150 పరిశ్రమల ఏర్పాటుకు అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కరీంనగర్‌ జిల్లా బావుపేటలో గ్రానైట్‌ క్లస్టర్‌, ఖమ్మంలో గ్రానైట్‌ శుద్ది క్లష్టర్‌, మిర్యాలగూడలో రైస్‌ మిల్లుల క్లస్టర్‌, నిజామాబాద్‌లో రైస్‌ మిల్లులు, ఆదిలాబాద్‌లో పత్తి, జిన్నింగ్‌ మిల్లుల క్లష్టర్ల ఏర్పాటుకు సర్కార్‌ ప్రాధాన్యతనిస్తోంది.

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికులకు ప్రోత్సాహకాలు…

ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలను అందించే దిశగా కార్యాచరణ చేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రీయల్‌ పార్కులకు 1059 ఎకరాలను సమీకరించాలని టీఎస్‌ఐఐసీ తీర్మానించింది. ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు మరిన్ని రాయితీలను కల్పించాలని సమావేశంలో తీర్మానించారు. పరిశ్రమలకు కేటాయించిన భూములకు ఆయా వర్గాలకు 33.1 శాతం రిబేటును వర్తింపజేస్తున్నారు. ఇకపై దీనిని 50శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఆయా వర్గాలకు లీజుపై కేటాయించే భూముల గడువును 10ఏళ్ల నుంచి 33 ఏళ్లకు పెంచాలని గత సమావేశం తీర్మానించింది. ఆయా భూములను తనఖా పెట్టి రుణం తీసుకునేలా ముందుగానే ఆయా భూములను సేల్‌ డీడ్‌ చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఆయా వర్గాలకు కేటాయించిన భూముల మొత్తం విలువను చెల్లించి లీజు డీడ్‌నుండి సేల్‌ డీడ్‌కు మార్చుకునే వెసులుబాటుకు ఆమోదం తెలిపారు.

పారిశ్రామిక వాడల ఏర్పాటుకు 1059 ఎకరాల సేకరణ…

రాష్ట్రంలో పారిశ్రామిక వాడల ఏర్పాటు, విస్తరణకు 1059.31 ఎకరాల భూములు అవసరమని టీఎస్‌ఐఐసీ గుర్తించింది. ఈ భూములను సేకరించి టీఎస్‌ఐఐసీ పేరిట అలినేషన్‌ చేసేందుకు ఆమోదిస్తూ ప్రభుత్వానికి నివేదించారు. ఈ జాబితాలో రాజేంద్రనగర్‌ బుద్వేల్‌లో 82 ఎకరాలు, హిమాయత్‌సాగర్‌లో వాలంతరికీ చెందిన 49.34 ఎకరాల్లో ఐటీ, ఎలక్ట్రానిక్‌ పార్కులు ప్రతిపాదించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండు మల్కాపురంలో ఇండస్ట్రియల్‌ పార్కుకు 608 ఎకరాలను సేకరించాలని ప్రతిపాదించారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో 53 ఎకరాలు, రామచంద్రాపురం వెల్మల గ్రామంలో 53ఎకరాలలో రైల్వే కోచ్‌ల తయారీ ఫ్యాక్టరికీ ప్రతిపాదించారు. ఖమ్మం జిల్లా ఖానాపూర్‌లో ఇండస్ట్రీయల్‌ పార్కుకు 1.9 ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో లెథర్‌ పార్కుకు 14 ఎకరాలు, సిద్దిపేట జిల్లా ములుగులో ఆటోమోటివ్‌ పార్కు విస్తరణకు 127 ఎకరాలు, వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట్‌లో ఫుడ్‌ పార్కు ఏర్పాటుకు 46 ఎకరాలు, కాకతీయ మెగా టక్స్‌టైల్‌ పార్కుకు వరంగల్‌ జిల్లా ఊకల్‌లో 25 ఎకరాల సేకరణకు ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదించింది.

ఖాయిలా పరిశ్రమల పునరుద్దరణ…

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాలు అమలు చేయనుంది. ఇందులో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించనుంది. ఆన్‌లైన్‌ ప్రక్రియలో ప్రోత్సహకాలను పొందేలా తాజాగా అనేక మార్పులను ప్రతిపాదించింది. రాష్ట్రంలో సూక్ష్మ, లఘు, మధ్యతరహా ఖాయిలా పడిన పరిశ్రమలను పునరుద్దరించేందుకు దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక హెల్త్‌ క్లినిక్‌ విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాయితీలు పెంచి సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. చిన్న తరహా పరిశ్రమల చేయూతకు ఎన్‌బీఎఫ్‌ఐను ఏర్పాటు చేసి రూ. 100కోట్ల మూలనిధితో సీఈవోను నియమించేందుకు పరిశ్రమల శాఖ కృషి చేస్తోంది. ఈ నిధిలో రూ. 50కోట్లు కేంద్రం, రూ. 50 కోట్లు రాష్ట్రం వాటాగా భరించనున్నాయి. ఈ నిధితో ఎప్‌బీఎఫ్‌ఐ స్వయం ప్రతిపత్తితో నడిపేలా ప్రత్యేక శ్రద్దను టీ సర్కార్‌ చేపట్టింది. ఈ నిధినుంచి చిన్న తరహా పరిశ్రమలకు రూ. 50వేలు నేరుగా గ్రాంట్‌గా ఇవ్వడంతోపాటు రూ. 5లక్షల వరకు 3 శాతం వడ్డీతో రుణాలు అందించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement