Thursday, May 2, 2024

Delhi | జీ20కి సర్వం సిద్ధం, కళ్లు చెదిరేలా ఏర్పాట్లు.. భారత మండపంలో కల్చర్ కారిడార్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత్ అధ్యక్షత వహిస్తున్న జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం సర్వం సిద్ధమైంది. వివిధ దేశాల నుంచి వస్తున్న ప్రధానులు, అధినేతల కోసం కళ్లు చెదిరేలా ఏర్పాట్లు చేసింది. వసుదైక కుటుంబం ఆర్యోక్తిని ఇతివృత్తంగా తీసుకుని అతిథి దేవోభవ అంటూ భారత్‌కు వచ్చే అతిథులకు రాచమర్యాదలతో మరుపురాని అనుభూతిని కల్గించేలా సకల సదుపాయాలు కల్పిస్తున్నారు. శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు జరిగే సదస్సుకు వేదికైన ప్రగతి మైదాన్‌లోని భారత మండపం (ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్) వద్ద సందర్శకులకు సరికొత్త అనుభూతి కల్గించేందుకు ఒక్కో అంశంపై ఒక్కో కారిడార్‌ను నెలకొల్పారు. సాంకేతికతను పౌర సేవల్లో వినియోగిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమాలతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళారీతులు, హస్తకళా ఉత్పత్తుల ప్రదర్శన కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సదస్సు ఏర్పాట్లను పరిశీలించేందుకు జాతీయ, అంతర్జాతీయ మీడియాను శుక్రవారం జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం నుంచి ప్రత్యేక బస్సుల్లో భారత మండపానికి తీసుకెళ్లారు.

భారత్ సాంకేతిక ప్రయాణం
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఒకప్పుడు సరికొత్త ఆవిష్కరణలు, సేవలు విదేశాల నుంచి భారత్‌కు వచ్చేసరికి కొన్నేళ్లు పట్టేది. కానీ ఇప్పుడు భారత్ ఏ విషయంలోనూ అగ్రరాజ్యాలతో తీసిపోము అంటోంది. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని పౌరసేవల్లో వినియోగించుకునే విషయంలో అగ్రరాజ్యాలు సైతం ఆశ్చర్యపోయేలా దూసుకెళ్తోంది. ‘డిజిటల్ ఇండియా’ పేరుతో భారత ప్రభుత్వం వివిధ శాఖలు, రంగాల్లో చేపట్టిన వినూత్న కార్యక్రమాల గురించి ఇంటర్నేషనల్ మీడియా సెంటర్‌లో ప్రత్యేకంగా డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ జోన్ ఏర్పాటు చేసింది. సాంకేతిక రంగంలో భారత్ సాధించిన ప్రగతిని కళ్లకు కట్టేలా ప్రదర్శనలతో స్టాళ్లను నెలకొల్పింది.

ఈ జోన్‌లోకి అడుగుపెట్టగానే ఎదురుగా ‘భాషిణి’ స్టాల్ కనిపిస్తుంది. ఒక భాష నుంచి మరొక భాషలోకి అనువదించే ‘గూగుల్ ట్రాన్స్‌లేట్’ వంటి సాఫ్ట్‌వేర్ టూల్స్ మార్కెట్లో చాలానే ఉన్నాయి. అయితే వాటి కంటే అత్యుత్తమంగా.. అనువాద లోపాలకు దాదాపు ఆస్కారం లేని రీతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తూ తయారు చేసిన సాఫ్ట్‌వేర్ భాషిణి. ఈ ఆవిష్కరణ గురించి వివరించేందుకు సంబంధిత విభాగానికి చెందిన ఉద్యోగులు కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు.

- Advertisement -

ఆ పక్కనే ఈ-సంజీవని పేరుతో మరొక స్టాల్ ఉంది. 2020 ప్రారంభంలో కోవిడ్-19 మహమ్మారి దేశంపై విరుచుకుపడక ముందే ఈ సరికొత్త వైద్య సేవల విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. టెలీమెడిసిన్ ద్వారా పూర్తి ఉచితంగా సుదూర ప్రాంతాల్లోని రోగులకు వైద్య సేవలను అందించడమే ఈ-సంజీవని లక్ష్యం. దీన్ని ప్రారంభించిన కొన్నాళ్లకే కోవిడ్-19 మహమ్మారి విరుచుకుపడడంతో.. ఈ-సంజీవని సేవల సామర్థ్యాన్ని అతితక్కువ సమయంలో వేగంగా పెంచి ప్రతి రోజూ వేల కొద్ది రోగులకు టెలీమెడిసిన్ సేవలు అందించినట్టు ఆ స్టాల్ దగ్గరున్న అధికారులు వివరించారు.

ఓవైపు ఆధార్ స్టాల్, మరోవైపు ‘డిజిలాకర్’ మీద ఏర్పాటు చేసిన స్టాల్ కనిపించాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఏ రకమైన ధృవీకరణ పత్రాన్ని పర్సులో పెట్టుకుని వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆధార్ కార్డ్ నుంచి బర్త్ సర్టిఫికెట్ వరకు, మార్కుల షీట్లు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ ఐడీ, పాన్ కార్డు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ పాలసీలు.. ఇలా ఒకటేమిటి ప్రభుత్వం అందించే అన్ని రకాల ధృవపత్రాలు, ఐడెంటిటీ కార్డులను డిజిలాకర్‌లో భద్రపర్చుకోవచ్చు. ఎక్కడైనా ఆ ధృవపత్రాలను చూపించాల్సిన పరిస్థితి వస్తే.. డిజిలాకర్ లో ఉన్నవి చూపిస్తే చాలు. ఈ తరహా సేవలు అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం చాలా చోట్ల లేవు. ఇక ఆధార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నకిలీ, డూప్లికేట్ గుర్తింపునకు ఆస్కారం లేకుండా ఆధార్ పౌరసేవల్లో ఎంతో ఉపయోగపడుతోంది. అదే సమయంలో పౌరులకు కూడా అనేక సేవలు పొందడంలో సౌలభ్యాన్ని కల్గిస్తోంది. ఈ ఆధార్ గురించి ఆకట్టుకునేలా వివరిస్తూ స్టాల్ ను ఏర్పాటు చేశారు.

డిజిటల్ ఇండియా జర్నీ – సైకిల్ పై సవారీ: డిజిటల్ జోన్‌లో అందరికీ ఆకట్టుకుంటున్న స్టాల్ డిజిటల్ ఇండియా జర్నీ. ఓ పెద్ద టీవీ స్క్రీన్ ఎదురుగా ఉన్న సైకిల్ మీద కూర్చుని తొక్కుతూ ఉంటే స్క్రీన్ మీద డిజిటల్ ఇండియా కార్యక్రమాలన్నీ వరుసగా కనిపిస్తుంటాయి. ఆ కార్యక్రమాల విశేషాలు వివరిస్తూ ప్రయాణం ముందుకు సాగుతుంది. మనం ఎంత సేపు సైకిల్ తొక్కాము, ఎన్ని కేలరీల శక్తి కరిగించామన్నది కూడా ఆ సైకిల్ మీద ఉన్న స్క్రీన్ మీద కనిపిస్తుంది.

యూపీఐ – యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ పేరుతో భారత ప్రభుత్వం అభివృద్ధి చేసిన డిజిటల్ పేమెంట్స్ విధానం దేశంలో ఎంత వేగంగా విస్తరించిందో చూస్తున్నాం. ఫుట్ పాత్ మీద వ్యాపారం చేసుకునేవారు, తోపుడు బళ్ల మీద వస్తువులు అమ్ముకునేవారు సైతం డిజిటల్ చెల్లింపులను స్వీకరించేలా ఆర్థిక రంగంలో విప్లవాత్మక చర్యగా ఇది నిలిచింది. ఈ మధ్య జర్మనీ రాయబారి ఢిల్లీలోని ఓ కూరగాయల మార్కెట్లో సరుకులు కొని మొబైల్ ఫోన్ నుంచి యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపి ఆశ్చర్యపోయారు. ప్రపంచంలో డిజిటల్ చెల్లింపులు కొత్త విషయం కానప్పటికీ.. యూపీఐ వంటి విధానం మాత్రం మరెక్కడా లేదు. డిజిటల్ చెల్లింపులను ఇంత సులభతరం చేసిన విధానం గురించి భారత ప్రభుత్వం చాలా గర్వంగా చాటుకుంటోంది.

దీంతో పాటు ఆస్క్-గీత, ఓఎన్డీసీ వంటి డిజిటల్ ఇండియా కార్యక్రమాల గురించి కూడా స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఆస్క్ గీత ద్వారా భగవద్గీతలో మానవ వికాసానికి చేసిన మార్గదర్శకత్వం, ప్రేరణ, పరివర్తనపై సూచనలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అందించేలా కియాస్క్ ఏర్పాటు చేశారు. దాంతో పాటు ఈ జోన్‌లో MyGov, CoWIN, UMANG, జన్‌ధన్, e NAM, GSTN, FastTag సహా ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఉన్నాయి.

ఆర్బీఐ ఇన్నోవేషన్ పెవిలియన్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) G20 సమ్మిట్‌లో అత్యాధునిక ఆర్థిక సాంకేతికతను ప్రదర్శిస్తుంది. ఆర్థిక రంగాన్ని విప్లవాత్మకంగా మార్చగల సామర్థ్యాన్ని చాటి చెబుతోంది. ఆర్థిక రంగంలో భారతదేశ ఆవిష్కరణల్లోని ప్రత్యేక కోణాలను ప్రదర్శించే ఉత్పత్తులను ఈ స్టాల్ ప్రదర్శిస్తోంది. వీటిలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ; డిజిటలైజ్డ్ పేపర్‌లెస్ పద్ధతిలో రుణాన్ని అందించడానికి సాంకేతికతను ఉపయోగించి ఫ్రిక్షన్‌లెస్ క్రెడిట్ కోసం పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫారమ్; యూపీఐ – వన్ వరల్డ్, రూపే ఆన్ ది గో , భారత్ బిల్లు చెల్లింపుల ద్వారా క్రాస్ బోర్డర్ బిల్లు చెల్లింపు వంటి ప్రత్యేక చెల్లింపు సిస్టమ్ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచింది.

క్రాఫ్ట్స్ బజార్
హాల్ నంబర్ 3లో భారత్ మండపం వద్ద ‘క్రాఫ్ట్స్ బజార్’ ఏర్పాటు చేశారు. వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలోని ప్రత్యేక ఉత్పత్తులను విదేశీ అతిథులకు ప్రదర్శించేలా ఈ బజార్ ఏర్పాటు చేసింది. జీఐ-ట్యాగ్ కలిగిన వస్తువులపై ప్రత్యేక దృష్టితో భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి హస్తకళా ఉత్పత్తులను ఇక్కడ నెలకొల్పింది. స్థానికంగా లభించే ఉత్పత్తులను కొనుగోలు చేసే ప్రత్యేక అవకాశాన్ని హస్తకళాకారులు, చేతివృత్తుల నిపుణులకు కల్గించింది. దాదాపు 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు ఖాదీ విలేజ్ అండ్ ఇండస్ట్రీస్ కమిషన్, ట్రైఫెడ్ మొదలైన కేంద్ర ఏజెన్సీలు క్రాఫ్ట్స్ బజార్‌లో స్టాళ్లను ఏర్పాటు చేశాయి. కళాకారుల నైపుణ్యాలు, అద్భుతమైన పనితనాన్ని ప్రదర్శించడానికి, మాస్టర్ క్రాఫ్ట్‌మెన్‌ల ద్వారా ప్రత్యేక ప్రత్యక్ష ప్రదర్శనలను ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసింది.

సాంస్కృతిక నడవా (కల్చర్ కారిడార్)
జీ-20 సమ్మిట్‌కు వేదికైన ‘భారత్ మండపం’ ప్రపంచంలోని అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్లలో ఒకటి. సామర్థ్యం, సదుపాయాల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ప్రపంచ దేశాల అధినేతలకు మరచిపోలేని అనుభూతి కల్గించేందుకు ‘కల్చర్ కారిడార్ – G20 డిజిటల్ మ్యూజియం’ని ప్రదర్శిస్తోంది. కల్చర్ కారిడార్ లో జీ20 సభ్యులు, ఆహ్వానిత దేశాల ప్రతినిధులకు ఆయా దేశాల సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలైన వస్తువులను ప్రదర్శనకు పెట్టింది. G20 సభ్య దేశాలు, 9 ఆహ్వానిత దేశాల ఐకానిక్ సాంస్కృతిక వస్తువులు ఇక్కడ కొలువుతీరాయి. ఈ కల్చర్ కారిడార్ విభిన్న సాంస్కృతిక వ్యక్తీకరణలకు, జ్ఞానాన్ని పంచుకోవడానికి, భాగస్వామ్య గుర్తింపు భావాన్ని పెంపొందించడానికి శక్తివంతమైన వేదికగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement