Monday, April 29, 2024

Breaking: కొత్త జిల్లాల్లో.. ఇక జిల్లా జడ్జి కోర్టులు

తెలంగాణలో కొత్త జిల్లాల్లో జిల్లా జడ్జీ కోర్టులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర హైకోర్టు త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. మంగళవారం అరణ్య భవన్ లో న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా జడ్జీ కోర్టులను సత్వరమే ఏర్పాటు చేసే చర్యలను వేగవంతం చేయాలని ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర హైకోర్టు ఇదివరకు తీసుకున్న నిర్ణయం మేరకు కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా కోర్టుల ఏర్పాటు ప్రక్రియ పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు. అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజలు, బాధితులకు సత్వరమే న్యాయం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.

కొత్త జిల్లాల్లో జిల్లా జడ్జీ కోర్టులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర హైకోర్టు త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. కొత్తగా ఏర్పడిన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మినహా మిగిలిన అన్ని కొత్త జిల్లాల్లో ఇప్పటికే అదనపు జిల్లా జడ్జీ కోర్టులు ఉన్నాయి. ఆయా కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న అదనపు జిల్లా కోర్టుల ప్రాంగణంలోనే కొత్తగా జిల్లా కోర్టులు ఏర్పడనున్నాయి. ఉమ్మడి జిల్లా కోర్టులో ఉన్న కేసులన్నింటిని ఆయా జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లా కోర్టులకు… ఆయా జిల్లాల పరిధిలోని కేసులను బదిలీ చేయనున్నారు. వివిధ అంశాలపై కోర్టులను ఆశ్రయించే వారికి సకాలంలో న్యాయం అందించేందుకు కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లా కోర్టులు దోహదం చేయనున్నాయి. కొత్త జిల్లా కోర్టుల ఏర్పాటుతో బాధితులకు తక్కువ సమయంలో న్యాయం అందించేందుకు వీలు కలుగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement