Friday, May 3, 2024

కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు చల్లారేది ఎలా?

తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ పదవి కాక రేపుతోంది. టీ.పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి నియామకంపై కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి సెగలు కక్కుతోంది. రేవంత్‌ రెడ్డి నియామకంపై కొందరు సీనియర్ నాయకులు రగిలిపోతున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్లు బాహాటంగానే విమర్శలు చేస్తుండగా.. మరికొందరు నాయకులు పదవులకు, పార్టీకి రాజీనామా చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పార్టీలో ఎప్పటి నుంచో పని చేస్తున్న వారికి కాకుండా వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి పదవి ఇవ్వడం పట్ల నాయకులు అసంతృప్తికి గురవుతున్నారు. కొందరు బహిరంగంగా చెప్పినా.. మరి కొందరు లోలోపలే రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.

దాదాపు ఆరు నెలలుగా పీసీసీ అధ్యక్షుడి పేరు ప్రకటనలో జాప్యం జరుగింది. టీ.పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ నాయకుల ఏకాభిప్రాయంతో జరగాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావించి ఆ దిశలో కసరత్తు చేసింది. దాదాపు 12 మందికిపైగా పీసీసీ అధ్యక్ష పీఠం కోసం పోటీ పడ్డారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌ సీనియర్‌ నాయకుల దగ్గర నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు అభిప్రాయాలను తీసుకున్నారు. పూర్తి వివరాలతో అధిష్టానికి నివేదించారు. అందరి పేర్లు పరిశీలించి.. ఇందులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి పేర్లను ఫైనల్ చేశారు. అయితే, మధ్యలో రేవంత్‌ కి పీసీసీ ఇవ్వొద్దని కొందరు సీనియర్‌ నేతలు అధిష్టానానికి లేఖలు సైతం రాశారు. రేవంత్‌కు పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీ నుంచి చాలా మంది నాయకులు పార్టీని వీడతారని హెచ్చరించారు. పార్టీ విధేయులకే పీసీసీ పదవి కట్టబెట్టాలని కూడా విజ్ఞప్తి చేశారు.

నిజానికి నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికకు ముందే పీసీసీ ఎంపిక ప్రక్రియ పూర్తి అయ్యింది. అయితే, ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రకటన వాయిదా వేయాలని అప్పట్లో మాజీ మంత్రి జానారెడ్డి హైకమాండ్‌కు లేఖ రాయడంతో ఈ ప్రక్రియ ఆగింది. అయితే, రాష్ట్రంలో బీజేపీ బలం పెరుగుతుడడం, ఈటల ఆపార్టీలో చేరడం, హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడి ప్రకటన ఇంకా ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుందని, పార్టీకి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని గ్రహించిన కాంగ్రెస్ ఆగ్ర నాయకత్వం రేవంత్ పేరును అధికారికంగా ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి బహిర్గతమవుతోంది. మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఏఐసీసీ సభ్యత్వానికి, కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి కూడా కమిటీ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు.

ఇక, పీసీసీ పదవి తనకే వస్తుందన్న విశ్వాసంతో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తికి గురైయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ అధిష్ఠానానికి తప్పుడు నివేదిక ఇచ్చారని.. పీసీసీ అధ్యక్ష పదవి ఓటుకు నోటులా అమ్ముకున్నారని ఆరోపించారు. గాంధీభవన్‌ టీడీపీ కార్యాలయంగా మారిపోతుందని, ఇకపై తాను గాంధీభవన్ మెట్లు ఎక్కనని తేల్చి చెప్పారు. అంతే కాదు తనను ఎవరు కలవద్దని సూచించారు. ఇక, రేవంత్ రెడ్డిని మొదటి నుంచి సీనియర్ నేతలు వీహెచ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తీవ్రం వ్యతిరేకించారు. తమకు నచ్చని వారిని అధ్యక్షుడిని చేస్తే తమ దారి తాము చూసుకుంటామని జగ్గారెడ్డి గతంలోనే స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే, ఆయన ప్రస్తుతం మెత్తబడినట్లు తెలుస్తోంది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సన్నిహితుల వద్ద చెప్పిట్లు తెలుస్తోంది.

బీజేపీలో చేరేందుకు ఎప్పడో నిర్ణయించుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కాషాయ గూటికి చేరాలని నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లూ తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పీసీసీ దక్కుతుందని భావించి పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే, రేవంత్ ని అధక్షుడిని చేయడంతో తన తాను చూసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. రేపో మాపో మంచి ముహూర్తం చూసుకుని బీజేపీ తీర్ధం పుచ్చుకోవాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదే తరహాలో పార్టీలో ఇంకా ఎంత మంది అసంతృప్తి నేతలు బయటకు వస్తారు? అనేది ఉత్కంఠగా మారింది.

- Advertisement -

మరోవైపు అసంతృప్తి నాయకులను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం ఇప్పటికే పలువురితో ఫోన్ లో మాట్లాడారు. మరి కొందరి ఇంటికి వెళ్లి మరీ కలిశారు. పార్టీ కోసం అందరం కలిసి పని చేద్దామంటూ విజ్ఞప్తి చేశారు. అంతేకాదు తమ అందరి లక్ష్యం కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడమే అనే నినాదాన్ని వ్యక్త పరుస్తున్నారు. పార్టీలో అసంతృప్తులు చెలరేగకుండా చేయాలని అధిష్ఠానం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.

ఇదీ చదవండి: రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్లు ఏంటి?

Advertisement

తాజా వార్తలు

Advertisement