Sunday, May 19, 2024

Big Story: బెంగాల్‌ బాటలో తెలంగాణ.. గవర్నర్‌ను తప్పించి సీఎంను చాన్స్‌ల‌ర్‌గా చేసేందుకు కసరత్తు

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలకు కులపతిగా గవర్నర్‌ స్థానంలో ముఖ్యమంత్రిని నియమిస్తూ తీసుకువచ్చిన ముసాయిదా బిల్లును తెలంగాణాలోనూ ప్రవేశపెట్టాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీష్‌ ధన్‌కడ్‌ మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు నెలకొన్న నేపథ్యంలో అక్కడి మంత్రి మండలి ఈమ‌ధ్య ఇట్లాంటి కీలక నిర్ణయం తీసుకున్న‌ది.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణలోనూ సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై మ‌ధ్య అంతరం పెరిగిపోయిన నేపథ్యంలో ఇక్క‌డ కూడా బెంగాల్‌ తరహాలో కులపతిగా గవర్నర్‌ను తప్పించి సీఎంకు బాధ్యతలను కట్టబెట్టేలా విశ్వవిద్యాలయాల చట్టాన్ని సవరిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం. బెంగాల్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ముసాయిదా బిల్లును తెప్పించిన తెలంగాణ ప్ర‌భుత్వం దీనిపై అధ్యయనం చేస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న‌ విశ్వవిద్యాలయాల చట్టాన్నే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ చట్టం ప్రకారం విశ్వవిద్యాలయాల చాన్స్‌లర్‌గా గవర్నర్‌ వ్యవహరిస్తారు. వైస్ చాన్స్‌లర్‌ (ఉప ఉపకులపతులు) నియామకంలో గవర్నర్‌దే కీలకపాత్ర. ప్రభుత్వం అన్వేషణ కమిటీలను ఏర్పాటు చేసి వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి అనుభవం, యోగ్యతలున్న విద్యావేత్తల పేర్లను ఎంపిక చేసే సంప్రదాయం ఉంది. ప్రభుత్వం ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను రాజ్‌భవన్‌కు పంపిస్తే అందులో ప్రభుత్వం ప్రతిపాదించిన పేరును ఉపకులపతిగా గవర్నర్ చాన్స్‌లర్‌ హోదాలో ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఖరారు చేసిన విద్యావేత్తకు సంబంధించి ఎటువంటి ఆరోపణలున్నా గవర్నర్‌ ఆ పేరును నిలుపుదల చేసి మరో పేరును ప్రతిపాదించే అవకాశముంది.

అయితే.. ఇక్కడే ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య విభేదాలు పొడసూపుతున్నాయి. గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం పది మంది ఉపకులపతులను ఎంపిక చేస్తూ తుది ఆమోదం కోసం గవర్నర్‌కు పంపగా తమిళిసై కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశారు. దీంతో ఉపకులపతుల నియామకం ఆలస్యమైందన్న ప్రచారం అప్పట్లో జరిగింది. రెండు, మూడు విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్లతో గవర్నర్‌ విభేదించినట్టు సమాచారం. ఈ పేర్లను ఆమోదించడం కష్టమని ముఖ్యమంత్రి కార్యాలయానికి గవర్నర్‌ కార్యదర్శి సంకేతాలు పంపారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ జోక్యం చేసుకుని నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ వ్యక్తం చేసిన అభ్యంతరాలకు వివరణ ఇవ్వడంతో ఉపకులపతుల జాబితాను ఆమోదించినట్టు అప్పట్లో ప్రచారం జ‌రిగింది.

- Advertisement -

ఇక‌.. విశ్వవిద్యాలయాలు చేపట్టే అధ్యాపకుల నియామకాల్లో గవర్నర్‌ పాత్ర కీలకం. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పది విశ్వవిద్యాలయాలకు సంబంధించిన 1500లకుపైగా నియామకాలను చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. రాతపరీక్ష జరిపి ఇంటర్వ్యూలు నిర్వహించి తద్వారా నియామకాలు చేపట్టినా గవర్నర్‌ ప్రతిపాదించిన విద్యావేత్త కీలకంగా కానున్నారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల ఎంపికకు నిర్వహించే ముఖాముఖి ఇంటర్వ్యూలలో గవర్నర్‌ నామిని ఉంటారు. ఉప కులపతితో పాటు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన పేరొందిన ప్రొఫెసర్లను ఇంటర్వ్యూ బోర్డులో నియమించి నియామక ప్రక్రియను చేపడతారు. ప్రభుత్వం పెద్దఎత్తున బోధనా సిబ్బందిని నియమిస్తుండడంతో గవర్నర్‌ కీలకం కానున్నారని పశ్చిమ బంగాల్‌ తరహాలోనే గవర్నర్‌కున్న అధికారాలకు కట్టడి వేయాలని ముఖ్యమంత్రి కులపతిగా వ్యవహరించేలా చూస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవన్న భావనతో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.

అయితే.. విశ్వవిద్యాలయాలకు నిధులను సమకూర్చే యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఇందుకు అంగీకరిస్తుందా.. లేదా అన్నది చూడాల్సి ఉంది. విశ్వవిద్యాలయాల చట్టం ప్రకారం గవర్నర్‌ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఛాన్స్‌లర్‌గా ఉంటారు. ఈ పదవి నుంచి గవర్నర్‌ను తప్పిస్తే వచ్చే న్యాయపరమైన చిక్కులపై కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సీఎం కార్యాలయం నిర్ణయించినట్టు సమాచారం. పశ్చిమ బంగాల్‌ మంత్రి మండలి ఛాన్స్‌లర్‌గా గవర్నర్‌ను తప్పిస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పత్రాలను తెప్పించే పనిలో ప్రభుత్వంలోని కొంత మంది ముఖ్యులు ఉన్నట్టు తెలుస్తోంది. అవసరమైతే విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారి బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపించి ముసాయిదా బిల్లులో ఉన్న ముఖ్యాంశాలను అక్కడి అధికారులతో చర్చించి పూర్తి సమాచారాన్ని తీసుకురావాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement