Monday, May 6, 2024

Spl Story | డాక్టర్​ కావాల్సిన యువతి ఎట్లా చనిపోయింది.. ముస్లిం అమ్మాయి మృతిపై వీడని మిస్టరీ!

పెద్ద చదువులు చదివి, తమకు ఆసరాగా ఉంటుందనుకున్న ఆ యువతి అర్ధంతరంగా చనిపోయింది. అయితే.. ఆమె మరణం సాధారణంగా జరగలేదని, డాక్టర్లు చెబుతున్నట్టు అనారోగ్యం కారణంగా కాదని ఆమె తండ్రి ఆరోపిస్తున్నాడు. తన కూతురు మరణం వెనక ఉన్న మిస్టరీ బయటపెట్టాలని పోరాటం చేస్తున్నాడు. ఈ విషయంలో తనకు అండగా నిలవాలని కాంగ్రెస్​ ముఖ్యనేతలైన సోనియా గాంధీ, రాహుల్​ గాంధీకి లేఖలు రాశాడు. ఇంతకీ ఎంబీబీఎస్​ చదువుతున్న ఆ ముస్లిం యువతి ఎట్లా చనిపోయింది? దీని వెనక నిజాలేమిటో పరిశీలిద్దాం!

‌‌– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఓ 24 ఏళ్ల ముస్లిం యువతి హిమాచల్​ ప్రదేశ్​లో పెద్ద చదువులు చదవడానికి వెళ్లింది. నల్గొండలోని  రెహమాన్ బాగ్‌కు చెందిన ఆ అమ్మాయిది సాధారణ మధ్య తరగతి కుటుంబం. అయితే.. తాను ఈ ఏడాది మార్చిలో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆమె తండ్రి అష్రాఫుల్లా ఖాన్ ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్నాడు. అనుమానాస్పదంగా చనిపోయిన అమ్మాయి పేరు అర్షియా అంజుమ్.  

2017లో MBBS చదివేందుకు హిమాచల్ ప్రదేశ్‌, మండిలోని మెడికల్ కాలేజీలో చేరింది అర్షియా. ఆమె ఏప్రిల్‌లో తన చదువును పూర్తి చేయాల్సి ఉంది. కానీ, ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి సడెన్​గా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్టు తన తండ్రికి ఫోన్ ద్వారా తెలిపింది. ఆ వెంటనే ఆమెను లాల్ బహదూర్ శాస్త్రి గవర్నమెంట్‌ ఆస్పత్రిలో చేర్చారు. మరుసటి రోజు ఆమె తండ్రి హిమాచల్ ప్రదేశ్ వెళ్లాలని అనుకున్నాడు. మార్చి 1న అష్రాఫుల్లా ఖాన్ ఢిల్లీకి వెళ్లి, బస్‌లో చండీగఢ్ కు చేరుకున్నాడు. అయితే.. అదే రోజు ఉదయం 11 గంటలకు తన కుమార్తె ఆరోగ్యం క్షీణించిందని, ఐసీయూలో చేర్చినట్లు వార్డెన్ నుండి అతనికి ఫోన్​ కాల్ వచ్చింది.

కాగా, అష్రఫుల్లా ఖాన్ ఫిబ్రవరి 27న సాయంత్రం 6 గంటలకు ఆసుపత్రికి చేరుకున్నాడు. అతని కుమార్తె పరిస్థితి విషమంగా ఉందని గమనించాడు. చండీగఢ్‌లోని మరో ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్ కూడా రెడీగా ఉంది. ఇక.. అష్రఫ్​ వచ్చే సరికే అర్షియా కోమాలోకి జారుకుంది. ఈ క్రమంలో అష్రాఫ్​ తన కుమార్తె కోమా వెనుక ఉన్న కారణాల గురించి ఆరా తీశాడు. అతి తీవ్రమైన విరేచనాల కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించిందని డాక్టర్లు చెప్పారు.

- Advertisement -

ఇక.. చండీగఢ్‌లోని ఆసుపత్రికి చేరుకోగా అతని కుమార్తె పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. అయితే.. ఆమె మూత్ర పరీక్ష ఫలితాలు మాత్రం పలు అనుమానాలను రేకెత్తించాయి. అర్షియా 20రోజుల పాటు ప్రాణాలతో పోరాడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే చనిపోయింది. తన కూతురిని కోల్పోవడంతో కృంగిపోయిన ఖాన్ న్యాయం కోసం పోరాటం చేస్తున్నాడు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే కేసు కూడా నమోదైంది. అయితే మెడికల్ రిపోర్టు కోసం పోలీసులు వెయిట్​ చేస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా, అష్రఫుల్లా ఖాన్ తన కుమార్తె స్నేహితుడిపై అనుమానం వ్యక్తం చేశాడు. సమగ్ర విచారణలో నిజానిజాలు వెలికితీసి తన కూతురి మృతికి కారణాలు తెలుసుకోవాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాడు. ఈ న్యాయమైన దర్యాప్తునకు సహకరించాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి లేఖలు కూడా రాశాడు. మరి, ఎన్నో ఆశలతో ఎంబీబీఎస్​ చదవడానికి వెళ్లి అర్ధంతరంగా చనిపోయిన ఆ యువతి మరణం వెనక ఉన్న మిస్టరీ ఏంటో బయటపడుతుందా? ఆ యువతి కుటుంబానికి న్యాయం జరుగుతుందా? వేచి చూడాల్సిందే!

Advertisement

తాజా వార్తలు

Advertisement