Monday, April 29, 2024

మే 1 నుంచి సబ్సిడీపై ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్

మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అయితే కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో అందరికీ ప్రభుత్వాస్పత్రుల్లో టీకాలు ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వ అధికారులే చెప్తున్నారు. దీంతో త్వరలో కరోనా వ్యాక్సిన్ ప్రైవేటు మార్కెట్‌లోకి రానుంది. అయితే ధర ఎంత ఉంటుందనేదానిపై ఇప్పటికి స్పష్టత లేదు. కానీ త్వరలో రాష్ట్ర ప్రభుత్వమే ధరను ఖరారు చేయనుంది. 18 ఏళ్ళ వయసు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించడం కష్టమేనని, ప్రైవేటులోకి వ్యాక్సిన్ పంపిణీ వస్తున్నందున త్వరలో ధరలు ఖరారయ్యే అవకాశం ఉందని ఓ అధికారి పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో వ్యాక్సిన్ ఉచితంగానే ఇస్తున్నప్పటికీ మే 1 నుంచి ప్రైవేటు మార్కెట్‌లోనూ అందుబాటులోకి వస్తున్నందున డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందేనని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ కోసం రూ. 150, సర్వీసు ఛార్జి పేరుతో అదనంగా రూ. 100 చొప్పున చెల్లిస్తున్న ప్రజలు ఇకపైన కూడా ఇదే తీరులో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదింపులు జరిపి ప్రైవేటు వ్యాక్సిన్ ధరను నిర్ణయిస్తాయని, ప్రజలకు ఆర్థిక భారం లేకుండా సబ్సిడీ ధరల్లో లభ్యమయ్యేలా చూసే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విధి విధానాలను ఖరారు చేస్తుందని, ప్రజల ఆర్థిక స్థాయిని దృష్టిలో పెట్టుకుని సబ్సిడీని ఖరారు చేయనున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. ఆదాయ వర్గాలకు అనుగుణంగా ఈ ధర ఖరారవుతుందని తెలిపారు. పేదలకు ఒక రకం ధర, మధ్యతరగతి వర్గాలకు మరో రకం ధర, సంపన్నులకు ఇంకో ధర.. ఇలా వేర్వేరు ధరలు ఉంటాయని, పేద ప్రజలకు సబ్సిడీ రూపంలో ఊరట కల్పిస్తుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement