Sunday, April 14, 2024

పల్లె ప్రగతి పనుల్లో మందగమనం..

మంచిర్యాల : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మౌళిక వసతుల కల్పన కోసం చేపట్టిన పల్లె ప్రగతి పనులు మంద గమనంగా కొనసాగుతున్నాయి. ఉపాదిహామీ పథకాన్ని పనులకు అనుసందానించినప్పటికీ పల్లెల నుండి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ది పనులను నిర్దేశించిన గడువు లోగా పూర్తి చేయాల్సి ఉండగా ఇంకా చాలా గ్రామాల్లో పనులు పూర్తి కాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించి ప్రజలకు, కూలీలకు ఉపాది కల్పించేందుకు వీలుగా పల్లె ప్రగతిలో చేపట్టిన వైకుంఠ దామాలు, ప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డులు, ఇంకుడు గుంతలు, నర్సరీలు తదితర పనులను ఉపాదిహామీ పథకంతో అనుసందానించి పనులను చేపడుతున్నారు. వైకుంఠ దామాల నివారణ కోసం జిల్లా వ్యాప్తంగా రూ.5కోట్ల నిధులు మంజూరు కాగా వాటితో రూ.43 చోట్ల వైకుంఠ దామాల నిర్మాణం కోసం పనులను చేపట్టగా ఇప్పటికి సగం మాత్రమే పూర్తి అయ్యాయి. పల్లె ప్రకృతి వనాల కోసం జిల్లా వ్యాప్తంగా 527 రెవెన్యూ గ్రామాల్లో రూ.25.5 కోట్ల నిధులు మంజూరు కాగా ఇప్పటికి 300లకు పైగా గ్రామాల్లో పనులు కొనసాగుతూనే ఉన్నాయి. డంపింగ్‌ యార్డుల నిర్మాణాలకు సంబంధించి 185 గ్రామాల్లో రూ.3కోట్ల నిధులు మంజూరు కాగా ఇంకా 10 చోట్ల పనులు పూర్తి కాలేదు. ఇంకుడు గుంతల నిర్మాణానికి సంబంధించి 686 పనులు మంజూరు కాగా సుమారు రూ.81 లక్షల రూపాయల నిధులతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికి 50 చోట్ల పనులు పూర్తి కాలేదు. పేద రైతులకు చెందిన భూములను చదును చేసి వ్యవసాయానికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు 3900 మంది రైతులను గుర్తించి ఈ పనుల కోసం రూ.32కోట్ల నిధులను మంజూరు చేశారు. ఇంకా 400 మంది రైతులకు సంబంధించిన భూముల చదును పనులు కొనసాగుతూనే ఉన్నాయి. పల్లెల్లో నర్సరీలను ఏర్పాటు చేసి హరిత లక్ష్యం దిశగా మొక్కలను నాటేందుకు 309 నర్సరీలను మంజూరు చేయగా వాటికి రూ.4కోట్ల నిధులను కూడా కేటాయించారు. ఇంకా 200 నర్సరీల పనులు కొనసాగుతూనే ఉన్నాయి. పల్లె ప్రగతిలో చేపడుతున్న ఈ పనులకు ఉపాదిహామీ పథకాన్ని అనుసందానం చేసి ఆయా గ్రామాల్లోని ఉపాది హామీ కూలీలకు పని దినాలు కల్పిస్తూ పల్లెల్లో మౌళిక వసతుల ఏర్పాటుతో పాటు భూగర్భ జలాల పెంపు, పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పల్లెలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో ఈ పనులను చేపట్టినప్పటికీ నిధుల లేమితో పనులు నత్తనడకన సాగుతున్నట్లు సమాచారం. ఉపాదిహామీ పథకం ద్వారా రైతులకు, కూలీలకు ఉపయోగకరంగా ఉండటంతో పాటు రహదారులు, మరుగుదొడ్లు, చెక్‌డ్యామ్‌లు, సాగునీటి కాల్వల పనులు కూడా పూర్తై గ్రామాలు పురోగతి సాధించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శేషాద్రి పేర్కొన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్‌, అధనపు కలెక్టర్‌తో పాటు తాము క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వర్షాకాలం లోపే పల్లె ప్రగతి కింద చేపట్టిన అన్ని పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement