Friday, April 26, 2024

Story : కొత్త పార్ల‌మెంట్ లో రాజ‌దండం.. దీని ప్ర‌త్యేక‌త‌లు ఇవే

పార్ల‌మెంట్ కొత్త భ‌వ‌నం మ‌రో కొత్త ప్ర‌త్యేక‌త‌ని సంత‌రించుకోనుంది.ఈ భ‌వ‌నంలో రాజ‌దండం ప్ర‌త్య‌క ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. కాగా ఈ భ‌వ‌నాన్ని ఆదివారం ప్రారంభించ‌నున్నారు.ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ స్పీకర్ కుర్చీ సమీపంలో ఒక బంగారు రాజ దండాన్ని ఆవిష్కరించబోతున్నారు.ఈ విష‌యాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఆ రాజదండంకి ఉన్నా చారిత్రక ప్రాధాన్యతను కూడా అమిత్ షా తెలిపారు. భారతీయులకు, బ్రిటిష్ వారికి మధ్య జరిగిన అధికార మార్పిడికి ఆ రాజదండమే నిదర్శనమని గుర్తు చేశారు. స్వతంత్ర భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ ఈ రాజదండం అందించారని తెలిపారు. ఈ రాజదండాన్ని సెంగోల్ అని పిలుస్తారని.. ఇది తమిళ పదం అయినా సెమ్మాయ్ (ధర్మం) నుంచి వచ్చిందని వెల్లడించారు. ఈ రాజదండం ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితుల గురించి తెలుసుకుంటే… ఆంగ్లేయుల పాలన ముగిసిపోయి భారత్ కు స్వాతంత్రం ప్రకటించే ముందు మౌంట్ బాటెన్, నెహ్రూల మధ్య ఓ చర్చ జరిగింది. ఆ చర్చే ఈ రాజదండం ఏర్పాటుకు దారితీసింది.

ఆ చర్చలో మౌంట్ బాటెన్.. నెహ్రూతో మాట్లాడుతూ.. బ్రిటిషర్లనుంచి నుంచి భారతీయులకు అధికార బదిలీ జరిగిందని చెప్పడానికి గుర్తుగా ఏం చేద్దామని ప్రశ్నించారట. ఆ ప్రశ్న విన్న తర్వాత నెహ్రూ.. తనతో పాటు తన పక్కనే ఉన్న స్వతంత్ర భారతదేశపు మొదటి, చివరి భారతీయ గవర్నర్ జనరల్ రాజగోపాలాచారిని సలహా అడిగారట. దానికి రాజాజీ తమిళ సంప్రదాయంలో ఉన్న ఒక విధానాన్నినెహ్రూకు వివరించారు. ఏ దేశానికైనా కొత్త రాజుగా పదవీ బాధ్యతలు చేపట్టే సమయంలో ప్రధాన పూజారిక్ష రాజదండం ఆయనకు అందజేసే సంప్రదాయం ఉందని చెప్పుకొచ్చారు. చోళులు ఈ సంప్రదాయాన్ని అనుసరించారని తెలిపారట. దీంతో అలాంటి రాజదండం తయారు చేసే పనిని రాజాజీకి.. నెహ్రూ అప్పగించారట. ఈ మేరకు రాజగోపాలాచారి ప్రస్తుత తమిళనాడులోని ప్రఖ్యాత మఠమైన తిరువడుత్తురై అథీనంను సంప్రదించారు. రాజాజీ చెప్పినదంతా విన్న తర్వాత అక్కడి మఠాధిపతులు రాజదండం తయారీలో సహకరించేందుకు అంగీకరించారు. మద్రాస్ లోని ఓ స్వర్ణకారుడి చేత ఆ రాజదండాన్ని తయారు చేయించారు. ఈ రాజదండం పొడుగు 5 అడుగులు. పై భాగంలో నంది గుర్తును ఏర్పాటు చేశారు.

ఈ నంది గుర్తు న్యాయానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. దీని తయారీ పూర్తయిన తర్వాత ఆ మఠానికి చెందిన స్వామీజీ ఒకరు ఆ దండాన్ని మొదట లార్డ్ మౌంట్ బాటెన్ కు అందించారు. ఆ తర్వాత అతడి నుంచి దానిని వెనక్కి తిరిగి తీసుకుని.. గంగాజలంతో శుద్ధి చేశారు. ఆ తర్వాత ఆ రాజదండంను నెహ్రూ దగ్గరికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. భారతదేశానికి అర్ధరాత్రి స్వతంత్ర ప్రకటన చేయడానికి పావుగంట ముందు దానిని భారత నూతన ప్రధానికి అందజేశారు. ఈ ప్రక్రియ జరుగుతున్నంత సేపు దీని కోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఒక పాటను పాడారట. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఈ రాజదండంకు సంబంధించిన ప్రాధాన్యత కానీ.. చరిత్ర కానీ చాలామందికి తెలియదని అమిత్ షా అన్నారు. కొత్త పార్లమెంట్ లో ప్రస్తుతం ఈ రాజదండం ఏర్పాటు వల్ల.. మన సంప్రదాయాలను ఆధునికతను సంధానించే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఇలా చేయాలనడం మోడీ దూరదృష్టికి నిదర్శనమని కొనియాడారు. ఈ రాజ దండం ప్రస్తుతం అలహాబాద్ లోని మ్యూజియంలో ఉంది. ఆదివారం పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో భాగంగా దీనిని పార్లమెంట్ భవనంలో అమర్చనున్నార‌ని అమిత్ షా వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement