Wednesday, May 1, 2024

Story : కాంగ్రెస్ చీఫ్ ఎంపిక కోసం ఎన్నిక‌లు-అధ్య‌క్ష ప‌ద‌వికి రాహుల్ అంగీక‌రించేనా..!

కాంగ్రెస్ చీఫ్ ఎంపిక కోసం ఈ నెల 21న ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. మ‌రి ఈ సారైనా రాహుల్ గాంధీ సరేనంటారా అనే ప్రశ్న కాంగ్రెస్ శ్రేణులు సహా సామాన్యులకి క‌లుగుతోంది. ఈ ఎన్నికలపై రాహుల్ గాంధీ ఇంకా మౌనం వీడలేదని పార్టీ వర్గాలు చెప్పాయి. కాంగ్రెస్ చీఫ్‌గా గాంధీయేతర వ్యక్తిని నియమించాలనే అంశంపైనా ఈ పార్టీ గ‌త కొన్నాళ్లుగా చర్చ జ‌రుపుతోంది. కానీ దీనిపై ఏకాభిప్రాయం మాత్రం కుదరలేదట‌. కాంగ్రెస్‌లోని చాలా మంది నేతలకు గాంధీలే నాయకత్వం వహించాలనే అభిప్రాయాలు ఉన్నాయని వివరించాయి.

ఇప్పటికే వర్గ పోరులతో అతలాకుతలం అవుతున్న కాంగ్రెస్‌ను ఐక్యం చేయడానికి గాంధీలకు మాత్రమే సాధ్యం అవుతుందనే అభిప్రాయాలు వారిలో ఉన్నాయట‌. అధ్యక్ష ఎంపికకు ఎన్నికలు పూర్తయితే.. ఆ తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి, ఇతర పార్టీ పోస్టులకూ ఎన్నికలు జరుగుతాయని పార్టీ వర్గాలు వెల్ల‌డించాయి. కాగా రాహుల్ గాంధీ 2017లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. కానీ, జనరల్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. 543 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ కేవలం 52 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఈ దారుణ వైఫల్యాన్ని బాధ్యతగా తీసుకుంటూ రాహుల్ గాంధీ 2019 మే నెలలో రాజీనామా చేశారు. ఆ తర్వాత అనివార్యంగా సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టారు.

ఇప్పటికీ ఆమె మధ్యంతర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. మార్చి నెలలోనూ ఆమె ఎన్నికల వైఫల్యం తర్వాత తన రాజీనామాను ఆఫర్ చేశారు. కానీ పార్టీ నేతలు ఆమెను మరికొంత కాలం అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ తన ఫోకస్‌ను భారత్ జోడో (యునైట్ ఇండియా) కార్యక్రమంపై పెట్టారు. ఈ యాత్ర సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుకుంటూ 15 రోజుల పాటు ఈ భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. సుమారు 3,500 కిలోమీటర్ల దూరాన్ని ఈ యాత్ర కవర్ చేయనుంది. మ‌రి ఈసారి అధ్య‌క్ష ప‌ద‌విని రాహుల్ అలంక‌రించేనా అనేది తెలియాలంటే ఈ నెల 21వ‌ర‌కు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement