Sunday, April 28, 2024

Special Story – ఆర్థికంపై ఫోకస్​! అన్వేషిస్తున్న రేవంత్ సర్కారు

ఆరు గ్యారెంటీల అమలుకు సుమారు ₹66వేల కోట్లు కావాలి
అనేక రెట్లు పెరిగిన సంక్షేమ పథకాల వ్యయం
పాతవాటికి అందని బిల్లులు.. అసంపూర్తిగా నిర్మాణాలు
గత ప్రభుత్వంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు భరోసా లేదు
మొత్తం 4,78,168 లక్షల దాకా పెండింగ్‌ బిల్లులే ఉన్నాయి
వాటిని చెల్లించేందుకు ₹ 40,154 కోట్లు అవసరం
ఇప్పటికిప్పుడు ఆర్థిక సుస్థిరత సాధ్యం కాదంటున్న నిపుణులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు నానాటికీ ఆందోళనకరంగా మారుతున్నాయి. లెక్కకు మించిన సంక్షేమ పథకాలు, పేరుకుపోయిన వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందు మార్గలేవీ కనిపించడం లేదు. ఆమ్దానీ తక్కువ.. ఖర్చు ఎక్కువ అన్నట్లుగా ఆర్థిక అంచనాలు మారిపోయాయి. మారిన సర్కారు సరే.. మరి బిల్లులెట్లా? అనే ప్రశ్న అటు కాంట్రాక్టర్లను, ఇటు ప్రభుత్వ వర్గాలనూ వెంటాడుతున్నాయి. భారీగా నిధులు అవసరం ఉన్నాయి. అయినా గత ప్రభుత్వంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు రేవంత్‌ సర్కారు ఫండ్స్​ సమకూర్చడంపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. కాగా, ఆలస్యమైన బిల్లులతో కాంట్రాక్టర్ల ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో అసంపూర్తి నిర్మాణాలను పూర్తిచేసే మార్గాలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అధికారిక సమాచారం మేరకు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్నిశాఖల ద్వారా పూర్తియిన వివిధ కాంట్రాక్టు పనులకు సంబంధించి మొత్తం పెండింగ్‌ బిల్లుల సంఖ్య 4,78,168 లక్షలుగా ఉంది. వాటిని చెల్లించేందుకు ప్రాథమిక అంచనాల మేరకు నిధుల అవసరం రూ.40,154 కోట్లు అవసరమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

పెరిగిన సంక్షేమ పథకాల వ్యయం..

అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలతో పాటు ఇప్పటికే అమల్లో ఉన్న అనేక సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత, అవసరం కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందు నిలిచింది. ఈ పరిస్థితుల్లో సంక్షేమ పథకాల వ్యయం అనేక రెట్లు పెరిగిపోయింది. కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటింంచిన ఆరు గ్యారెంటీల అమలుకే సుమారుగా రూ.66వేల కోట్లు అవసరమవుతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి భయటపడేందుకు నిధుల సమీకరణ దిశగా సర్కారు మార్గాలను అన్వేషిస్తోంది. అయితే.. ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడటం ఇప్పటికిప్పుడు అంత ఈజీ కాదని ఆర్థిక రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

అదనపు రుణాల కోసం ప్రయత్నాలు..

గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో పెట్టిన బిల్లులు సహా వివిధ పథకాలు, ఉద్యోగులకు సంబంధించి నిధుల సమీకరణపై రేవంత్​ ప్రభుత్వం దృష్టి సారించింది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను సడలించి అదనంగా రుణాలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ త్రైమాసికంలో అనుమతిస్తే బిల్లుల చెల్లింపులకు నిధులు సమకూరుతాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం వివిధ పథకాలు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులకు సంబంధించి నిధుల సమీకరణపై దృష్టి సారించింది. అన్నీ కలిపి మొత్తం 4 ,78,168 బిల్లులు ఖజానాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి రూ.40,154 కోట్లు చెల్లించాల్సి ఉంది. నిధులు లేకపోవడంతో వీటిలో కొన్ని ఏడాదికి పైగా పెండింగ్‌లో ఉన్నట్లు ఆర్థిక శాఖ తాజాగా నివేదించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంతో వీటన్నింటినీ ఇప్పటికిప్పుడు చెల్లించడం సాధ్యమయ్యే పని కాదు. దీంతో నిధుల సమీకరణ మార్గాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

- Advertisement -

పెండింగ్​లో ఆ బిల్లులు ఎందుకున్నాయి..

కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను సడలిస్తే అదనంగా రుణాలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తోంది. ఇదే సమయంలో అసలు 4.78 లక్షల బిల్లులు సుదీర్ఘ కాలంగా ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయన్న అంశంపైనా శాఖల వారీగా సర్కారు వివరాలు సేకరిస్తోంది. మామూలుగా ప్రతి ఆర్థిక ఏడాదిలో ప్రతి త్రైమాసికానికి బడ్జెట్‌ కేటాయింపుల ప్రకారం అన్ని శాఖలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఏప్రిల్‌ నెల నుంచి జూన్‌ నెల వరకు తొలి విడత, జులై మాసం నుంచి సెప్టెంబర్‌ వరకు రెండో విడత, అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు మూడో విడత, జనవరి నుంచి మార్చి వరకు నాలుగో విడత నిధులు విడుదల చేస్తూ.. అన్ని శాఖలకు ఆర్థిక శాఖ బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ జారీ చేస్తుంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో అసెంబ్లీ ఎన్నికల కారణంగా చాలా శాఖలకు మూడో త్రైమాసికం నిధులూ విడుదల చేయలేదు. అంతకుముందు రెండు త్రైమాసికాల్లోనూ కొన్ని ఎంపిక చేసిన శాఖలకే బడ్జెట్‌ విడుదలైనట్లు కొత్త సర్కారు లెక్కలు తేల్చింది.

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులపై పరిశీలన

గతడిచిన రెండు త్రైమాసికాల్లో ఏ ఒక్క పెండింగ్‌ బిల్లు కూడా పరిష్కారం కాకపోవడంతో, అందుకోసం ప్రభుత్వం బడ్జెట్‌ విడుదల చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో రాజకీయ వ్యవస్థతో ముడిపెట్టుకుని ఉన్న ఈ సమస్య నానాటికీ జఠిలమవుతోంది. కొన్ని శాఖలు ఖజానాకు సమర్పించిన బిల్లుల్లో ఐదారు నెలల నుంచి అసలు మొదటిదశ చెల్లింపులే జరగనివి కూడా ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ ఉద్యోగుల పర్సనల్‌ బిల్లులే రూ.1000 కోట్లకు పైగా పెండింగులో ఉన్నాయి. ఇక పలు సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వ వాటా కింద చెల్లించాల్సిన రాయితీ (సబ్సిడీ) నిధుల కోసం ప్రజలు సమర్పించిన బిల్లులు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నాయి. పలు అభివృద్ధి పనులకు సంబంధించి వివిధ కాంట్రాక్టర్లు మొత్తం 10,169 బిల్లులు పెట్టగా, వీటికి చెల్లించాల్సిన రూ.10,498 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు పనులపై కాంగ్రెస్‌ సర్కార్‌ నిశితంగా తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ బిల్లులకు ఇప్పటికిప్పుడు బడ్జెట్‌ విడుదల చేస్తారా అనేది అనుమానమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి.

లోక్​సభ కోడ్​ అడ్డంగా మారనుందా?

ఒకవేళ మార్చి నెలల్లో లోక్​సభ ఎన్నికల షెడ్యూల్‌ వస్తే మళ్లీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యే వరకు బిల్లులు పూర్తి స్థాయిలో చెల్లించడం సాధ్యమేనా అనే చర్చ సాగుతోంది. అయితే జనవరి నుంచి నాలుగో త్రైమాసికానికి సంబంధించి నిధుల విడుదల కోసం మరిన్ని రుణాలు తీసుకోవాలని సర్కార్‌ యోచిస్తోంది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను సడలించి అదనంగా రుణాలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ త్రైమాసికంలో అనుమతించే అవకాశం ఉందని, అదే జరిగితే బిల్లుల చెల్లింపులకు నిధులు సమకూరుతాయని అధికారవర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement