Monday, April 29, 2024

Big Breaking: హైదరాబాద్​లో సోలార్​ రూప్ సైక్లింగ్​ ట్రాక్​.. రేపు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్​

హైద‌రాబాద్ ఔట‌ర్ రింగ్ రోడ్డును అనుస‌రిస్తూ అత్యంత ఆధునిక సౌకర్యాలతో 21 కిలొమీటర్ల మేర సోలార్ సైకిల్ ట్రాక్‌ను నిర్మించనున్నట్టు మంత్రి కేటీఆర్​ ఇవ్వాల (సోమవారం) వెల్లడించారు.. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్​లో రేపు (మంగళవారం) సైక్లింగ్​ ట్రాక్​ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడించారు. నానక్‌రామ్‌గూడ నుంచి తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీ (టీఎస్‌పీఏ) వరకు 8 కిలోమీటర్లు, నార్సింగి నుంచి కొల్లూరు వరకు 13 కిలోమీటర్ల మేర ఈ ట్రాక్ ఉండనుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) వింగ్ అయిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) ద్వారా 4.5 మీటర్ల సైకిల్ ట్రాక్‌ను చేపట్టనున్నట్టు తెలుస్తోంది.

ఈ ట్రాక్.. మూడు సైకిల్ లేన్‌లను కలిగి ఉండ‌నుంది. ఇరువైపులా ఒక మీటర్ గ్రీన్ స్పేస్ ఉంటుంది. పార్కింగ్ స్థలాలు, నిఘా కెమెరాలు, సైకిల్ డాకింగ్, ఫుడ్ కోర్టులు, తాగునీరు, విశ్రాంతి గదులు, ప్రాథమిక సైకిల్ రిపేర్ షాపులతో సహా సైక్లిస్టుల కోసం అనేక సౌకర్యాలతో ట్రాక్ లు ఉండ‌బోతున్నాయి. దక్షిణ కొరియాలోని సైక్లింగ్ ట్రాక్ ఇన్‌స్పిరేష‌న్‌తో దీన్ని నిర్మిస్తున్నారు. సైకిల్ ట్రాక్ సోలార్ రూఫింగ్ ద్వారా దాదాపు 9MW శక్తిని ఉత్పత్తి చేయవచ్చు. దానిని ORR లైటింగ్, డ్రిప్ ఇరిగేషన్, ORRతో స‌హా ఇతర విద్యుత్ అవసరాల కోసం HGCL ఉపయోగించుకుంటుంది.

ఇక‌.. సోలార్ కవర్ రూఫింగ్ కూడా ఉంటుంది. సర్వీస్ రోడ్డు, ప్రధాన క్యారేజ్‌వే మధ్య సైక్లిస్టుల కోసం ట్రాక్‌లు వేస్తారు. ఈ సదుపాయం సైక్లిస్టులకు ఎండ, వర్షం, ఇతర వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణను కల్పిస్తుంది. అంతేకాకుండా వారికి ప్రయాణ భద్రత కూడా ఉంటుంది. అనేక సౌకర్యాలతో ట్రాక్ వస్తుంది. అదనంగా, పగటిపూట, రాత్రి సమయంలో ట్రాక్‌పై మంచి వెలుతురు ఉండేలా మౌలిక సదుపాయాలు కూడా అభివృద్ధి చేస్తారు. లైటింగ్ కోసం విద్యుత్ అవసరాన్ని సోలార్-ప్యానెల్ పైకప్పు నుండి ఉత్పత్తి చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement