Sunday, May 5, 2024

Smart Exclusive -సాగు సగమే! కరుణించని కాళేశ్వరం

తలాపున గోదావరి ప్రవహిస్తున్నా పంటపొలాలు నీటి కోసం తల్లాడుతున్నాయి. జీవనదులు ఉన్నప్పటికీ పంటలు కాపాడుకునే యత్నాలు సన్నగిల్లడంతో ఉత్తర తెలంగాణలో యాసంగి పంట విస్తీర్ణం తగ్గడంతో పాటు.. నీటిఎద్దడి ఏర్పడింది. గలగల పరుగులు తీస్తున్న గోదావరికి అడ్డుకట్టగా నిలిచిన మేడిగడ్డ బ్యారేజీ గేట్లు తెరిసి ఉండటంతో రోజుకు 3 వేల క్యూసెక్కుల నీరు దిగువకు తరలిపోతోంది. ఫలితంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో యాసంగి పంట తగ్గింది. గత ఏడాది 68.82 లక్షల ఎకరాల్లో పండిన యాసంగి పంటలు ప్రస్తుతం 40. 35లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. ఇవన్నీ అధికార గణాంకాలు మాత్రమే.

వరుణుడు కనికరించక పోవడం, జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గిపోవడం, కాళేశ్వరం మోటర్లను నిలిపివేడంతో పంటకాలువల్లో నీటి ప్రవాహం తగ్గింది. దీంతో బోర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే.. భూగర్భ జలాలు కూడా క్రమంగా అడుగంటడంతో క్రమేణ సమస్యలు తీవ్రం అవుతున్నాయి. గత సంవత్సరం అలీ సాగర్‌, గడ్డెన్న వాగు, భక్తరామదాసు, చౌటుపల్లి హన్మంతారెడ్డి, రాలివాగు నీటితో 35.11వేల ఎకరాలకు నీరు అందగా.. ఇప్పటివరకు ఈ జలాశయాలనుంచి నీటి విడుదల కాలేదు. దీంతో రైతులు బిక్కు బిక్కు మంటున్నారు.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎగువన కురిసిన వానలు, రాష్ట్రంలో కురిసిన వర్షాలతో ప్రాణహిత, ప్రవర, పూర్ణ, పెన్‌ గంగా, వార్దా, ఇంద్రవతి, శబరి, ఎగువ, దిగివ మానేరు పరిసరాల్లోని చెరువులు, కుంటలు నిండిపోయాయి. ప్రస్తుతం ఆ నీటిమట్టాలు గణనీయంగా తగ్గిపోయాయి. రోజుకు రెండు టీఎంసీల నీటిని నిల్వచేసి కాళేశ్వరం ద్వారా జలాశయాల్లో నీటిని నింపాల్సిన మోటార్లు ఆపేశారు. దీంతో జలాశయాలు నీటి కోసం నోళ్లు తెరుచుకుని ఉన్నాయి. సరస్వతీ కాలువ, కుమురంభీం, వట్టి వాగు, గడ్డెన్నవాగు ఆధారంగా యాసంగిలో వేసిన 14వేల ఎకరాలకు నీటి గోస తప్పడంలేదు. అలాగే.. నిజాంసాగర్‌ ఆధారితంగా వేసిన 2.31 లక్షల ఎకరాల్లో సగం పంట చేతికి వచ్చినా సంతోషమేనని రైతులు అంటున్నారు.

అయినా.. ఈ ప్రాంతాల్లో కరువు ఘంటికలు మొగించే సమయం ఆసన్నవుతుండటంతో వరుణి కరుణ కోసం ఆకాశాన్ని చూడటం తప్పా మరేమీ చెయడం లేదు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారం..ఉత్తర తెలంగాణలో 64 శాతం రైతులు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తుండటంతో గతంలో లేనివిధంగా నీటి గోస తప్పదనే భావన ఉంది. శ్రీరాంసాగర్‌ 7లక్షల ఎకరాలకు నీరు అందిస్తోందనే ఆశలతో పంటలు వేసినా.. కాళేశ్వరం రివర్స్‌ పంపింగ్‌ చేస్తేనే ఇది సాధ్యమవుతుంది జల నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం శ్రీరాం సాగర్‌ పరివాహక ప్రాంతాల్లోనూ సాగునీటి ఇబ్బందులు ఏర్పడటంతో రైతులు ట్రాక్టర్ల ద్వారా నీటిని తీసుకువచ్చి పంటలను కాపాడే యత్నాలు చేస్తున్నారు. ప్రాజెక్టుల్లో తగ్గిపోయిన నీటి మట్టాలు..నిజాం సాగర్, మంజీరా నదిపై ఆదారపడి వేసిన 2.31 లక్షల ఎకరాల సాగులో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దేవాదుల ఆధినీకరణ పూర్తి కాకపోవడంతో పంటల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. వర్షాకాలంలో 6.21 లక్షల ఎకరాలు సాగు అయితే ప్రస్తుతం లక్షా 50 వేలకే పరిమితం చేశారు.నక్కల గండి లో నీటి సమస్య ఏర్పడటంతో యాసంగిలో వేసిన 50 వేల ఎకరాల పంట చేతికి వస్తుందాఅనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

భక్త రామదాసు ప్రాజెక్టు పరిధిలో వేసిన పంటలకు నీరు అందుతుండటంతో రైతులు ఇక్కడ ఆనందం వ్యక్తం చేస్తున్నారు, ఈ ప్రాజెక్టు ఆధారిత 59 వేల ఎకరాల్లోని పంటల్లో కనీసం 75 శాతం చేతికి వస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.బొగ్గులవాగు, గుండ్లవాగు, రామప్ప, లక్నవరంలో క్రమేణ నీటి మట్టాలుతగ్గిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అడుగంటి పోతున్న భూగర్భ జలాలు రాష్ట్ర వ్యాప్తంగా 46 వేల 531 చెరువులు, కుంటలు ఉండగా గోదావరి తీరప్రాంతంలో 20వేల 930 చెరువులు,కుంటలు ఉన్నాయి. వీటి ఆధారంగా 130 టీఎంసీల నీటిని వ్యవసాయానికి వినియోగించుకునే అవకాశాలున్నాయి.

అయితే రెండు కరీఫ్‌, రబీ కి ఈ నీటిని ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. అయితే భారీ వర్షాల అనంతరం వర్షాలు కురవకపోవడంతో 130 టీఎంసీల్లో ప్రస్తుతం కేవలం 60 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే చెరువులు కుంటల్లోని నీరు భూగర్భంలోకి ఇంకి పోవడంతో పాటుగా సుమారు 8 టీఎంసీలు ఆవిరి నష్టాలు ఏర్పడటంతో చెరువుల పై ఆధారపడిన వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

ఇప్పటికే పంటలు వేసిన రైతులు ఈ కుంటల నుంచి ట్రాక్టర్లతో నీటిని తరలించేందుకు సిద్ధం అవుతున్నారు. ఉత్తరతెలంగాణలో జీవనదులు ఉన్నప్పటికీ ఎత్తిపోతల ద్వారా చెరువులు,కుంటలు నింపకపోవడంతో భూగర్భ జలాలు ఇంకి పోతున్నాయి.

బోరు మోటార్లే దిక్కు..డిసెంబర్‌ నాటికి 5.02 మీటర్ల లోతులోకి వెళ్లిన నీరు ప్రస్తుతం 8.2 మీటర్ల లోతుకు వెళ్లాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మార్చి మే నాటికి కనీసం 10 నుంచి 15 మీటర్ల లోతుకు నీరు వెళ్లే ప్రమాదం ఉందని జలనిపుణులు అంచనావేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే 23 లక్షల బోరు బావులున్నాప్పటికీ గోదావరి తీరప్రాంతాల్లో 10 లక్షల బోరుబావులు ఉన్నప్పటికీ భూగర్భ జలాలు అడుగంటుతుంజటంతో బోరునీరు ప్రశ్నార్తకమైంది.

అయితే కాళేశ్వరం మోటర్లు ప్రారంభించి ఎత్తిపోతలతో చెరువులు. కుంటలు నింపితే సమస్య తీవ్రత కొంతమేరకు తగ్గే అవకాశాలున్నప్పటికీ మేడిగడ్డ చిక్కుముడి వీడందే ఇది సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అప్పటివరకు వరుణి కటాక్షంకోసం కన్నులు కాయలు కాసేదాక ఎదురు చూపులు తప్పవేమో.

Advertisement

తాజా వార్తలు

Advertisement