Sunday, May 5, 2024

Smart Exclusive – మాల్దీవుల్లో లంగరేసిన చైనా–2 … స్వరం మార్చి ఏమార్చి….

చైనాతో స్నేహంతోనే ఇండియా అవుట్
మారిన మాల్దీవుల అద్యక్షుడి కొత్త పోకడలు
అయిదేండ్ల కిందటే కుదిరిన అగ్రిమెంట్లకు చెల్లుచీటీ
హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాలన్నీ రద్దు
ఇండియన్ ఓషన్ రిమ్పై అభ్యంతరాలు
కొత్త నినాదంతోనే ఎన్నికలకు వెళ్లిన మొయిజ్జూ
ఇబ్రహీం సోలి మాత్రం ఇండియాకి అనుకూలం
తుర్కియే నుంచి రోజువారీ సరుకుల దిగుమతి
మాలె నుంచి పెద్ద ఎత్తున ఎగుమతులకు చాన్స్
భారత్ని దెబ్బతీసేందుకు కుట్రలు?
చైనా=మాలె సాన్నిహిత్యంపై అభ్యంతరాలు

మాల్దీవులకు, భారత్కు ఉన్న సత్సంబంధాలను దెబ్బతీసే ఎత్తుగడలో చైనా సక్సెస్ అయ్యింది. సముద్ర జలాలపై ఆధిపత్యం సాధించి.. ఆ తర్వాత ఇతర దేశాలపై పెత్తనం చెలాయించాలనే ధోరణి కనిపిస్తోంది. ఇందులో భాగంగా మాల్దీవులకు నిత్యావసరాలు సప్లయ్ చేస్తున్నట్టు నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక.. మాలెలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లోనూ మొయిజ్జూకు చెందిన ప్రోగ్రెసివ్ పార్టీ ‘ఇండియా అవుట్’ నినాదాన్ని బలంగా వినిపించింది. దీంతో మొహ్మమ్మద్ మొయిజ్జూ సక్సెస్ అయ్యారు. కానీ, ఇబ్రహీం సోలి మాత్రం ఇండియా ఫస్ట్ నినాదాన్ని వినిపించారు. ఇక.. మొయిజ్జూ అధ్యక్షుడయ్యాక చైనాతో ఫ్రెండ్షిప్ మరింత బలోపేతం అయ్యింది. దీంతో భారత్తో జరిగిన ఒప్పందాలన్నీ ఒక్కొటొక్కటిగా రద్దు చేసుకోవడం మొదలయ్యింది. ఇట్లా భారత్ని దెబ్బతీసే కుట్రలకు తెరతీసినట్టు కనిపిస్తోంది.

భారత బలగాలను తమ దేశం నుంచి ఉపసంహరించుకోవాలని మాల్దీవుల ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. అయిదేండ్ల కిందట ఇండియాతో కుదుర్చుకున్న హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. 2019లో భారత ప్రధాని మోదీ మాల్దీవులను సందర్శించినప్పుడు ఈ ఒప్పందం కుదిరింది. అప్పటి మాల్దీవులు అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలి అభ్యర్థన మేరకు ఈ ఒప్పందం జరిగింది. ఈ సర్వే కింద ఇరు దేశాలు మాల్దీవులలో జలాలు, పగడపు దిబ్బలు, సముద్రపు అలలను.. వాటి స్థాయిలను సంయుక్తంగా అధ్యయనం చేయాల్సి ఉంది. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారికంగా రద్దు అయిన మొదటి ద్వైపాక్షిక ఒప్పందం ఇదే.

ఇండియా అవుట్ విధానంతో ఎన్నిక‌ల‌కు..
అంతకుముందు.. మాల్దీవుల్లో మోహరించిన భారత సైనికులను ఉపసంహరించుకోవడానికి భారత ప్రభుత్వం అంగీకరించిందని ప్రధాని ముయిజ్జు ప్రకటించారు. మొహమ్మద్ ముయిజ్జుకు చెందిన ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ పై చైనా ప్రభావం ఉందని చెబుతారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రోగ్రెసివ్ పార్టీ ‘ఇండియా అవుట్’ నినాదాన్ని ఇచ్చింది. అంతేకాకుండా మాల్దీవులలో భారత దళాల ఉనికిని తొలగిస్తామని పేర్కొంది. మాల్దీవుల డెమోక్రటిక్ పార్టీకి చెందిన మొహమ్మద్ ఇబ్రహీం సోలి మాత్రం ‘ఇండియా ఫస్ట్’ నినాదాన్ని ఇచ్చారు. కాగా, ముయిజ్జు వైఖరి మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. ముయిజ్జు అధ్యక్షుడయ్యాక.. ‘పూర్తిగా చైనా ప్రభావంతో’ ఈ అడుగులు వేస్తున్నట్లు ఆయన నిర్ణయాలను బట్టి తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని రద్దు చేస్తూ మాల్దీవులు నిర్ణయం తీసుకున్న తర్వాత, ఈ ప్రాంతంలో చైనాతో పోల్చితే భారత వ్యూహాత్మక ప్రభావం తగ్గే అవకాశాలు ఉన్నాయి.

తుర్కియే, చైనాలకు పర్యటనలు
ముయిజ్జు తన మొదటి విదేశీ పర్యటనలో తుర్కియే వెళ్లారు. ఆయనక్కడ మాల్దీవుల రాయబార కార్యాలయాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించి మాల్దీవుల ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. “మాల్దీవులు తుర్కియే నుంచి రోజువారీ వినియోగం కోసం అనేక వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. మాల్దీవుల్లో తుర్కియే పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. ఎగుమతుల్లో తుర్కియేకి కూడా ప్రాధాన్యం ఇస్తోంది. ఇటీవలి కాలంలో మాల్దీవుల నుంచి తుర్కియేకి వెళ్లే విద్యార్థులు, పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది” అని తెలిపింది.

- Advertisement -

చైనా, మాల్దీవుల మ‌ధ్య పెరిగిన రిలేషన్స్..
ముయిజ్జు తుర్కియే పర్యటన అనంతరం మాల్దీవుల ఉపాధ్యక్షుడు హుస్సేన్ మొహమ్మద్ లతీఫ్ చైనా పర్యటకు వెళ్లారు. చైనా నేతృత్వంలోని ‘చైనా-ఇండియా ఫోరమ్‌ డెవలప్‌మెంట్‌ కో ఆపరేషన్‌’ సమావేశంలో పాల్గొన్నారు. అయితే.. అలాంటి మరొక ఫోరమ్ అయిన ‘ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్’పై మాల్దీవుల వైఖరి అంత సానుకూలంగా లేదు. చైనా-ఇండియా ఫోరమ్ ఆన్ డెవలప్‌మెంట్ కో ఆపరేషన్ సమావేశంలో లతీఫ్ తమ దేశానికి చైనా పాత్ర ముఖ్యమైందని పేర్కొన్నారు. తుర్కియే, చైనాలలో మాల్దీవుల నేతల పర్యటన భారత్ ప్రయోజనాలకు సానుకూల సంకేతం కాదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే భారత భూ, సముద్ర భద్రత అవసరాలకు సంబంధించి చైనా, తుర్కియే రెండూ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నాయి. తొలుత సముద్ర జలాలపై పట్టు సాధించడం.. ఆ తర్వాత పెత్తనం చెలాయించే ధోరణిలో చైనా ఉందని ఈ విధానం ద్వారా స్పష్టం అవుతోంది. అందుకనే భారత్ మాల్దీవుల వైఖరిని వ్యతిరేకిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement