Saturday, May 4, 2024

Exclusive | విద్వేషపూరిత ప్రసంగాలపై సీరియస్​.. కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీం ఆదేశాలు!

మణిపూర్​ హింసాత్మక ఘటనలతో పాటు దేశ వ్యాప్తంగా రాజుకుంటున్న ద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు సీరియస్​ అయ్యింది. ఈ మేరకు అన్ని వర్గాల మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. విద్వేషపూరిత ప్రసంగాల కేసులను పరిశీలించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇవ్వాల (శుక్రవారం) కేంద్రాన్ని కోరింది.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ద్వేషపూరిత ప్రసంగాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని గమనించిన అత్యున్నత న్యాయస్థానం, అవసరమైన చోట తగిన పోలీసు బలగాలు లేదా పారామిలటరీ బలగాలను మోహరించాలని కేంద్రానికి సూచించింది. పోలీసులు, సహా అధికారులు అన్ని సున్నిత ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చాలని పేర్కొంది. అన్ని వర్గాల మధ్య సామరస్యం ఉండాలని గమనించిన సుప్రీంకోర్టు, విద్వేషపూరిత ప్రసంగాల కేసులను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని శుక్రవారం కోరింది.

ఈ మధ్య కాలంలో హర్యానాలో జరిగిన మత ఘర్షణలు ఆరుగురి ప్రాణాలను బలిగొన్నాయి. హర్యానాతో సహా పలు రాష్ట్రాల్లో ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన వారిని హతమార్చాలని.. వారి సామాజిక, ఆర్థిక బహిష్కరణకు పిలుపునిచ్చే “కఠినమైన ద్వేషపూరిత ప్రసంగాలు” అనే ఆరోపణపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరుపుతోంది.

- Advertisement -

జస్టిస్‌లు సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌విఎన్‌ భట్టితో కూడిన ధర్మాసనం కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కెఎం నటరాజ్‌ను ఆగస్టు 18లోగా కమిటీకి సంబంధించిన సూచనలను అందజేయాలని కోరింది. వర్గాల మధ్య సామరస్యం ఉండాలి. అన్ని సంఘాలు బాధ్యత వహించాలి. ద్వేషపూరిత ప్రసంగం మంచిది కాదు. దానిని ఎవరూ అంగీకరించలేరు అని ఈ సందర్భంగా బెంచ్ వ్యాఖ్యానించింది.

2022 అక్టోబరు 21నాటి తీర్పునకు అనుగుణంగా నియమించిన నోడల్ అధికారులకు వీడియోతో సహా అన్ని విషయాలను క్రోడీకరించి, సమర్పించాలని పిటిషనర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. జర్నలిస్ట్ షాహీన్ అబ్దుల్లా దాఖలు చేసిన దరఖాస్తులో సుప్రీం కోర్టు ఆగస్టు 2 నాటి ఉత్తర్వులను ప్రస్తావిస్తూ “ఏ కమ్యూనిటీకి వ్యతిరేకంగా, గుర్తింపుతో సంబంధం లేకుండా ద్వేషపూరిత ప్రసంగాలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు.. పోలీసులు చర్యలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము.. విశ్వసిస్తాము. భౌతిక హింస, ఆస్తులకు నష్టం కలకుండా చూడాలి” అని ధర్మాసనం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement