Sunday, May 19, 2024

హైదరాబాద్ సీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేతల అరెస్ట్ పై రేవంత్ ఫైర్

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి బిస్వా శర్మపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు బషీర్ బాగ్ లోని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోదండ రెడ్డి, అంజన్ కుమార్ తో పాటు పలువురిని అరెస్ట్ చేసి నారాయణ గూడ పోలీసు స్టేషన్ కు తరలించారు.

మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హౌస్ అరెస్టు చేశారు. అస్సాం సీఎం సోనియాగాంధీని ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు చేయాల్సిందిగా 700కు పైగా పోలీస్ స్టేషన్లలో రెండు రోజుల క్రితం టీ.పీసీసీ ఫిర్యాదులు చేసింది. అయితే, ఆ ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఈ రోజు వరకు డెడ్ లైన్ విధించింది. కేసులు నమోదు చేయకపోతే అన్నీ జిల్లాల్లోనూ ఎస్పీ, కమిషనర్ ఆఫీసుల ముట్టడికి పిలుపునిచ్చింది. అందులో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్ ముందు రేవంత్ రెడ్డి, రాచకొండ కమిషనరేట్ ముందు కోమటిరెడ్డి ముట్టడికి హాజరు కావాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే రేవంత్ ఇంటి వద్ద పోలీసుల హడావుడి చేశారు. రేవంత్ ఇంటికి వెళ్లే అన్నీ దారులను బారీకేడ్లతో మూసేసారు.

ప్రభుత్వం తీరుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ఇలా ఎన్నిసార్లు పునరావృతం చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోం సీఎం హిమంత బిస్వాపై తమ ఫిర్యాదులపై కేసులు పెట్టే బదులు…కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేశారు? అని ప్రశ్నించారు. అధికారాన్ని కోల్పోతామనే భయం సీఎం కేసీఆర్ కు పట్టుకుందని అర్ధం అవుతుందని రేవంత్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement