Thursday, May 2, 2024

రేవంత్ వెంటే కేసీఆర్ వ్యతిరేక వర్గం!

తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించన తర్వాత తన మార్క్ రాజకీయాలకు శ్రీకారం చుడుతున్నారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియమితులైన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో ఒక్కసారిగా జోష్ వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. గత ఏడేళ్లుగా తీవ్ర నిరాశతో ఉన్న కాంగ్రెస్ కేడర్ లో ఇప్పుడు రేవంత్ రాకతో కొత్త ఉత్సాహం కనబడుతోంది.

తన దూకుడు స్వభావంతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ను ఢీకొట్టగల సమర్థుడిగా రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. తెలంగాణలో దమ్మున్న నాయకుడిగా కాంగ్రెస్ అధిష్టానం గర్తించే స్థాయికి ఎదిగారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్..అందుకు పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఉన్న సీనియర్ నాయకుల మద్దుతు కూడగట్టిన రేవంత్.. ఇక తన పాత మిత్రులపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తన వైరీ వర్గాన్ని కూడా దగ్గర చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు కేసిఆర్ వ్యతిరేకులంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి వైపే నిలబడాలని నిర్ణయానికి వచ్చినట్లు రాజకీయ వర్గాల భోగట. త్వరలో కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున వలసలు మొదలు కాబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. గతంలో కాంగ్రెస్ లో కీలక నేతలుగా ఉండి.. ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలంతా తిరిగి సొంత గూటికి రాబోతున్నారని సమాచారం. ఇప్పటికే కొందరు నేతలు రేవంత్ రెడ్డితో మాట్లాడారని, త్వరలో అధికారికంగా చేరబోతున్నారని చర్చ జరుగుతోంది. గతంలో టీడీపీలో పని చేసి బీజేపీలో చేరిన నేతలంతా కూడా రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ లో పని చేసేందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.

టీఆర్ఎస్, బీజేపీలు పార్టీల మధ్య చీకటి స్నేహానికి, ప్రజాకంటక విధానాలను ప్రజలగొంతై నిలదీయానీకి వస్తున్నా అంటూనూతన పీసీసీ సారధి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్తి నేతలను సైతం తనవైపు లాగేందుకు రేవంత్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో కేసీఆర్ పదవుల హామీ ఇచ్చి విస్మరించడంతో కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు వారిపై ‘ఆపరేషన్ కాంగ్రెస్’ sను ప్రయోగించబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో ఉన్న టీఆర్ఎస్ అసంతృప్తి వర్గంపై  రేవంత్ కన్ను పడినట్లు సమాచారం.

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నకలకు మరో రెండున్నరేళ్ల సమయం ఉంది. ఇంకా టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే తన రాజకీయ భవిష్యత్తే ప్రమాదంలో పడే అవకాశం ఉందన్న భావిస్తున్న కొందరు నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి పీసీసీపై పీఠంపై ఉండడంతో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బీజేపీ తన బలాన్ని పెంచుకున్న.. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా మాత్రం ఆపార్టీకి లేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీలో బీజేపీ గెలిచినా.. దానిని కంటిన్యూ చేస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

- Advertisement -

జనంలో రేవంత్ రెడ్డికి ఉన్నంత మాస్ ఇమేజ్ కలిగిన నాయకుడు బీజేపీలో లేదు. ఒకలిద్దరు ఉన్నా వారితో ఆపార్టీ అధికారంలోకి రావడం అసాధ్యం. ఈ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ లోని అసంతృప్తి వర్గం రేవంత్ రెడ్డికే జై కొట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో స్థానిక ఇన్ ఛార్జులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఈ నేపధ్యంలో వారికి కాంగ్రెస్ పార్టీ ఆకర్షిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరుపున టికెట్లు ఇస్తుందా? లేదా? అన్నది తెలియదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో వెళితే తమకు సీటు కర్ఫార్మ్ అనే అభిప్రాయానికి ఆయా నేతలు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఇతర పార్టీల నుంచి వచ్చే వలసలతో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం మాత్రం వస్తుందనే ధీమాలో హస్తం నేతలు ఉన్నారు.   

Advertisement

తాజా వార్తలు

Advertisement