Friday, April 26, 2024

Indore Fire: ఏడుగురి చావుకు వీడే కారణం.. ప్రేమ నిరాకరించిందని భవనానికి నిప్పు పెట్టిన యువకుడు!

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నిన్న తెల్లవారుజామున ఓ భవనంలో మంటలు అంటుకుని ఏడుగురు మృతి చెందిన కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. విజయ్ నగర్ ప్రాంతంలోని మూడు అంతస్తుల భవనంలో ఏడుగురి ప్రాణాలను బలిగొన్నందుకు శనివారం అర్థరాత్రి 27 ఏళ్ల యువకుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రద్దీ ప్రాంతమైన విజయ్‌నగర్‌లో మూడంతస్తుల భవనం కాలిబూడిదైంది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనం కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో 9 మంది చికిత్స పొందుతున్నారు. ఎలక్ట్రిక్  మీటర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు పార్క్ చేసిన వాహనాలకు అంటుకుని ఆపై భవనానికి పాకినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. 

అయితే, ఆ తర్వాత 50 సీసీటీవీలను పరిశీలించిన పోలీసులు ఇది ప్రమాదం కాదని, ఓ యువకుడి పని అని తేల్చారు. ఆ భవనంలో నివసిస్తున్న అమ్మాయి తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతోనే అతడు ఈ చర్యకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడిని సంజయ్ అలియాస్ శుభం దీక్షిత్‌ (27)గా గుర్తించారు. నిన్న తెల్లవారుజామున భవనం వద్దకు చేరుకున్న సంజయ్.. అక్కడ పార్క్ చేసి ఉన్న యువతి స్కూటర్‌కు నిప్పు పెట్టాడు. క్షణాల్లోనే చెలరేగిన మంటలు అక్కడ పార్క్ చేసిన ఇతర వాహనాలకు అంటుకుని ఆపై భవనానికి పాకాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తహజీబ్ ఖాజీ మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ మీటర్‌లో షార్ట్ సర్క్యూట్ సంభవించిందని, ఇది వెంటనే పార్కింగ్ ప్రాంతంలోని వాహనాలను చుట్టుముట్టిందని, అది పై అంతస్తులకు వ్యాపించిందని చెప్పారు. కాగా, ఈ ఘటన సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి ఆలస్యంగా చేరుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొంతమంది నివాసితులు తమ ఫ్లాట్‌ల బాల్కనీలు లేదా టెర్రస్ నుండి దూకి తమను తాము రక్షించుకున్నారు. ఈ క్రమంలో వారు గాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement