Monday, April 29, 2024

Big Story: రిక్రూట్​మెంట్​.. మావోయిస్టు పార్టీలోకి భారీగా చేరికలు, పొలిటికల్​​ లీడర్లే టార్గెట్

వరుస ఎదురుదెబ్బలతో చిన్నాభిన్నమైందని భావిస్తున్న మావోయిస్టు ఉద్యమం మళ్లీ బలోపేతమవుతోంది. తెలంగాణ.. ఆంధ్రా.. చత్తీస్‌గఢ్‌.. ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీలో భారీ ఎత్తున చేరికలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అసోంలో అరెస్టు అయిన మావోయిస్టు పార్టీ అగ్రనేత.. కేంద్ర కమిటీ సభ్యుడు.. వ్యూహకర్త కంచన్‌దా అలియాస్‌ అరుణ్‌ కుమార్‌ ను విచారిస్తున్న అధికారులు.. విస్తుపోయే నిజాలను వెల్లడించారు. పోడుభూముల బాధితులకు అండగా నిలుస్తున్న మావోయిస్టులు నిరుద్యోగ యువతను ఉద్యమంలో కలిసి రావాల్సిందిగా కోరుతూ పెద్దఎత్తున దళాల్లో చేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. సహజ వనరుల రక్షణ.. ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపడుతున్న వరుస కార్యక్రమాలతో యువతను చేర్చుకుంటున్నట్లు సమాచారం.

గ్రేటర్‌ హైదరాబాద్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలతో విస్తరించిన దండకారణ్యంలో మావోయిస్టులు పైచేయి సాధిస్తూ వస్తున్న విషయం విధితమే. ఏళ్ల తరబడి ఈ ప్రాంతాన్ని షెల్టర్‌ జోన్‌గా మార్చుకున్న మావోయిస్టులు పెద్ద ఎత్తున ప్రజా గెరిల్లా ఉద్యమం పేరిట సాయుధులై ముందుకు సాగుతున్నారు. ఎన్‌కౌంటర్ల రూపంలో ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ, వెనక్కి తగ్గని మావోయిస్టులు, ఎప్పటికప్పుడు బలం పుంజుకుంటూ పైచేయి సాధించడం గమనార్హం. ఈ క్రమంలోనే తెలంగాణాలో మావోయిస్టులు భారీ ఎత్తున రిక్రూట్‌మెంట్లు చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోవడంతో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య, ఆదివాసీలను ముప్పుతిప్పలు పెడుతున్న పోడుభూముల సమస్య, సహజ వనరులను మాయం చేసేందుకు సాగుతున్న వరుస కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్న మావోయిస్టు పార్టీలో యువత చేరుతున్నట్లు సమాచారం.

మావోయిస్టు అగ్రనేత అరెస్ట్‌ తో విస్తుపోయే నిజాల వెల్లడి
తెలంగాణలోని నిరుద్యోగ యువతను ఉద్యమం వైపు ఆకట్టు-కుని, భారీ ఎత్తున రిక్రూ-టె-్మంట్లకు మావోయిస్టులు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అసోం పోలీసులు వెల్లడించారు. ఇటీ-వల మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ- సభ్యుడు, వ్యూహకర్త కంచన్‌దా అలియాస్‌ అరుణ్‌కుమార్‌ను అసోం పోలీసులు అరెస్టు చేశారు. ఆయన వద్ద ఒక ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్‌, రూ.3.6 లక్షల నగదు, పలు కీలకపత్రాలను వారు సీజ్‌ చేశారు. కంచన్‌దా విచారణ సందర్భంగా నక్సల్స్‌ రిక్రూట్‌మెంట్లకు మావోయిస్టు పార్టీ తెలంగాణను లక్ష్యంగా చేసుకున్న విషయం బయటపడినట్లు తెలుస్తోంది. ఒడిశా, ఝార్ఖండ్‌, చత్తీసగఢ్‌ యువతపైన కూడా మావోలు దృష్టి సారించినట్లు- వెల్లడైంది. రిక్రూట్‌మెంట్లు అవ్వగానే.. శిక్షణనిచ్చి, వారికి ఆయుధాలను సరఫరా చేయాలని నిర్ణయించినట్లు- అసోం పోలీసుల దర్యాప్తు నిగ్గుతేల్చింది. దీంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. అధునాతనమైన ఆయుధాలను సమకూర్చుకున్నట్లు తెలుస్తుండగా, యువత ఉద్యమంలో సాయుధులైతే మరింత దాడులకు తెగబడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పోడుభూములే ప్రధాన ఎజెండా
తెలంగాణా రాష్ట్రంలో పోడుభూములే ప్రధాన సమస్యగా పరిణమిస్తోంది. అదిలాబాద్‌ మొదలుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ వరకు గిరిజనులు పోడు సమస్యను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్ర భుత్వం పోడు సమస్యకు పరిష్కారం చూపుతామని ఇప్పటికే పలుమార్లు ప్రకటించినప్పటికీ, అందుకు సంబంధించిన కార్యాచరణకు అడుగులు పడటం లేదు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల పేరిట ఫారెస్ట్‌ అధికారులు పోడుభూముల్లో విధ్వంసాలకు తెగబడుతున్నారు. పచ్చని పంట భూముల్లో కందకాలు తవ్వడం, పంట లను ధ్వంసం చేయడం, అర్ధరాత్రులు అలజడులు సృష్టి ంచడంతో గిరిజన ప్రాంతాల ఆదివాసీలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఇదే ప్రధాన ఎజెండాగా మావోయిస్టులు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు మావోయిస్టుల ఉద్యమాలకు సహకరించడమో, లేక ఉద్యమంలో భాగస్వాములు కావడమో జరుగుతుంది. దీంతో మావోయిస్టులకు గిరిజన ప్రాంతాల ప్రజలు సంపూర్ణంగా సహకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా మావోయిస్టుల అండతో అధికార పార్టీ నేతలను గిరిజన గ్రామాల్లోకి రాకుండా అడ్డుకొనే అవకాశాలు లేకపోలేదు.

అధికార పార్టీ నేతలే లక్ష్యం
వరుస ఎదురుదెబ్బలతో బలహీనపడిన మావోయిస్టు పార్టీ, యువతను చేర్చుకొని బలపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పెద్దఎత్తున యువత శిక్షణలో కొనసాగుతుండగా, వారందరికీ అత్యంత ఆధునిక ఆయుధాలను అప్పగించి, సాయుధ దళాల్లో చేర్చుకొని, వరుస దాడులతో ఉనికిని చాటాలన్నది మావోయిస్టుల వ్యూహంగా కనిపిస్తోంది. అసోం పోలీసులు వెల్లడించిన అంశాల ప్రకారం అస్సోంలోని తీవ్రవాద సంస్థ లైన ఉల్ఫా వంటి నిషేధిత సంస్థ ల నుంచి పెద్ద ఎత్తున ఆధునిక ఆయుధాలు, బాంబులు, గ్రేనేడ్లను మావోయిస్టులు సేకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఏజెన్సీ ప్రాంత బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. విధ్వంస కార్యకలాపాలతో ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేసే అవకాశాలు కనిపిస్తుండటంతో అధికార పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని, ఏజెన్సీలో పర్యటనలకు సాహసించ వద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక వి ధానాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న యువతకు, మావోయిస్టు మార్గమే శరణ్యంగా కనిపిస్తుండటంతోనే రిక్రూట్‌మెంట్లు భారీగా సాగినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement