Thursday, May 2, 2024

ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యంలో మెషిన్స్ ద్వారా ప్ర‌సాదం త‌యారీ – దేశంలోనే మొద‌టిసారి

యాద‌గిరి ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి ఆల‌య పున‌ర్మిర్మాణ ప‌నులు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. వంద‌ల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి తెలంగాణ ప్ర‌భుత్వం ఈ ఆల‌యాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చి దిద్దుతోంది. టిటిడి ఆల‌యం త‌ర‌హాలో ప్ర‌ధాన ఆల‌య విమాన గోపురానికి స్వ‌ర్ణ‌తాప‌డం చేయించాల‌ని సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌. ఈ మేర‌కు విరివిగా బంగారాన్ని విరాళంగా ఇవ్వాల‌ని ఆయ‌న తెలిపారు. కాగా దేశంలోనే మొద‌టిసారిగా మోడ్ర‌న్ మెషిన‌రీతో మానవ ప్రమేయం లేకుండా తయారు చేసే లడ్డూ, పులిహోర ప్రసాదం ఇక్క‌డ అంద‌జేయ‌నున్నారు. మార్చి 28న లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం ఇవ్వనున్న నేపథ్యంలో ప్ర‌సాదం తయారీకి అవసరమైన ఆధునిక యంత్రాల బిగింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది.

రోజుకు 70 వేలకు పైగా లడ్డూలు, నాలుగు సార్లు ఒకేసారి 1000 కిలోల పులిహోర తయారు చేసేందుకు రూ.13.08 కోట్ల వ్యయంతో ఈ ఆధునిక యంత్రాలను బిగించారు. పులిహోరను ప్యాకింగ్ చేసేందుకు సుమారు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక యంత్రాలను తీసుకువచ్చారు. కాగా ప్రసాదం కాంప్లెక్స్ లో మూడు అంతస్తుల్లో మిషన్ల ద్వారానే ప్రసాదం తయారు చేసి లిఫ్టులు, మెషిన్ ద్వారానే కౌంటర్ల దగ్గరకు తీసుకు వచ్చే విధంగా పనులు పూర్తి చేస్తున్నారు. ప్రసాదం తీసుకువచ్చే ట్రేలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా భారీ మెషిన్ ల‌ను బిగించారు. అక్కడి నుంచి ప్రసాదాన్ని ట్రేలలో వేసుకుని కౌంటర్ల వద్దకు తీసుకెళ్లేందుకు ఎస్కలేటర్ మాదిరిగా 12 మోటార్లతో బెల్ట్ ను బిగించారు. ట్రేలలో ప్రసాదం అయిపోయిన వెంటనే తిరిగి ట్రేలను శుభ్రం చేసే మెషిన్ వద్దకు తీసుకెళ్లేందుకు బెల్ట్ ను బిగించారు. భక్తులకు ప్రసాదం కొనుగోలులో ఇబ్బందులు తలెత్తకుండా పదమూడు కౌంటర్లను ఏర్పాటు చేశారు. యాదాద్రీశుడి ప్రసాదం తయారీని అధికారులు హరికృష్ణ ,మూమెంట్ ప్రతినిధులకు అప్పగించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement