Thursday, May 2, 2024

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు..

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం పరిసర పశ్చిమబెంగాల్ తీరం, ఉత్తర ఒడిశా ప్రాంతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపో స్పియర్ స్థాయి వరకు వ్యాపించింది.

వచ్చే రెండు మూడు రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం ఉత్తర పశ్చిమ ద్రోణి అల్పపీడన ప్రాంతం నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తర తెలంగాణ, ఉత్తర మధ్య కర్ణాటక మీదుగా ఆరేబియా సముద్రం వరకు 4.5 నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు ఏర్పడింది. దీని ప్రభావం వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇక ఏపీలో అల్పపీడన ప్రభావంతో రాగల రెండు రోజుల్లో అక్కడక్కడ ఓ మస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్ర, యానంలో మరో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో మూడు రోజులపాటు తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

ఇక తెలంగాణలోను పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. ఈ ఉదయం హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మియాపూర్‌, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, అమీర్‌పేట, బేగంపేట, సికింద్రాబాద్‌, తార్నాక, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, వనస్థలీపురం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మసబ్ ట్యాంక్, మెహిదీపట్నం, యూసఫ్‎గూడ, క్రిష్ణానగర్, పంజాగుట్ట, కూకట్‎పల్లి, జీడిమెట్లతో పాటు పరిసర ప్రాంతాల్లో వాన కురుస్తోంది. వానలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. నైరుతి రుతుపవనాలు, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సోమవారం పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించిన విషయం తెలిసిందే. దీంతో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వర్షాలు మొదలు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో రైతులు తమ వ్యవసాయ పనులు ప్రారంభిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement