Friday, May 17, 2024

National Herald: మూడోసారి ఈడీ ముందుకు రాహుల్.. బుధవారం కొనసాగనున్న విచారణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు రెండో రోజు కూడా సుమారు 9 గంటల పాటు ప్రశ్నించారు. వరుసగా మూడోరోజు, అంటే బుధవారం కూడా మళ్లీ విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. మొత్తంగా రెండ్రోజుల్లో 19 గంటల పాటు రాహుల్ గాంధీ ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. చాలావరకు రాతపూర్వకంగానే సమాధానాలు కోరిన ఈడీ అధికారులు, కొన్ని అంశాలపై మౌఖికంగా అడిగి తెలుసుకున్నట్టు తెలిసింది.

రెండో రోజు ఉదయం గం. 11.30కు న్యాయవాదితో పాటుగా ఈడీ కార్యాలయం చేరుకున్న రాహుల్ గాంధీకి మధ్యాహ్నం గం. 3.30 సమయంలో భోజన విరామం ఇచ్చారు. ఆ కాసేపటికే మళ్లీ విచారణకు హాజరైన రాహుల్ గాంధీని రాత్రి గం. 9.30 వరకు ప్రశ్నించారు. ఈ క్రమంలో విచారణ ఎంత ఆలస్యమైనా ఫరవాలేదు, మంగళవారంతో ముగిసిపోవాలని రాహుల్ గాంధీ ఈడీ అధికారులను కోరినట్టు తెలిసింది. కానీ ఈడీ అధికారులు అందుకు అంగీకరించలేదని, బుధవారం మరోసారి ఈడీ ఎదుట హాజరుకావాల్సిందేనని తేల్చి చెప్పారని సమాచారం. సోమ, మంగళవారాల్లో జరిగిన విచారణలో రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానాల్లో సవరణల విషయంలో రాహుల్ గాంధీ ఏజెన్సీ అధికారుల క్షమాపణ కోరినట్టు తెలిసింది.

రెండోరోజూ ఆందోళనలు ఏఐసీసీ సమీపంలో ఉద్రిక్తత..
నేషనల్ హెరాల్డ్ కేసులో సమన్లు జారీ చేయడాన్నే రాజకీయ కక్షసాధింపుగా పేర్కొంటూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీని రెండో రోజు కూడా విచారణకు పిలవడంపై తీవ్రంగా మండిపడింది. నిరాధార ఆరోపణలను పరిగణలోకి తీసుకుంటూ ఎలాంటి కేసు లేకుండానే ఈడీ విచారణ జరుపుతోందని ఆరోపించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గం. 9.00కు ఢిల్లీలోని నేతలు ఏఐసీసీ వద్ద సమావేశం కావాలని, మిగతా రాష్ట్రాల్లోనూ ఆందోళనలు కొనసాగించాలని నేతలకు పిలుపునిచ్చారు.

అయితే ఢిల్లీ పోలీసులు రెండో రోజు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఏఐసీసీకి దారితీసే అన్ని మార్గాల్లోనూ బ్యారికేడ్లు, వాటర్ కెనాన్లు, వజ్ర వాహనాలు, కేంద్ర పారామిలటరీ బలగాలను రెట్టింపు సంఖ్యలో మొహరించారు. ఏఐసీసీ వద్దకు చేరుకున్న నేతలను వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా వారించారు. తమ పార్టీ కార్యాలయానికి వెళ్లనీయకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో వారిని వెంటనే అరెస్టు చేసి వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సహా కొందరు ముఖ్యనేతలను మాత్రమే ఏఐసీసీలోకి వెళ్లేందుకు అనుమతించారు.

అనంతరం రాహుల్ గాంధీ ఏఐసీసీకి చేరుకుని పార్టీ నేతలతో కాసేపు చర్చించారు. ఆ తర్వాత ఈడీ కార్యాలయానికి బయల్దేరి వెళ్లగా, ఆయన వెంట పాదయాత్ర చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని ఢిల్లీ పోలీసులు అడ్డుకుని వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈడీ కార్యాలయంలో రాహుల్ గాంధీ విచారణ ముగిసేవరకు నేతలందరినీ పోలీసు స్టేషన్లోనే నిర్బంధించి ఉంచారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పలువురు కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేవలం కక్షసాధింపు కోసమే రాహుల్ గాంధీని విచారణ పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement