Friday, April 26, 2024

సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎంపీ రఘురామ

బెయిల్‌ దరఖాస్తును హైకోర్టు డిస్మిస్ చేయడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో బెయిల్‌ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది స్పెషల్ లీవ్ పిటిషన్‌లో కోరారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రఘరామను అరెస్టు చేశారని సదరు పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ పిటిషన్‌పై విచారణ నేడు జరిగే అవకాశం ఉంది.

మరోవైపు రఘురామకృష్ణంరాజు కేసులో 6వ మెజిస్ట్రేట్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన కాలికి గాయాలు కావడంపై నివేదిక ఇవ్వాలని వైద్యులకు సూచించింది. సీఐడీ విచారణలో తనపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని పిటిషనర్ చెప్పాడని, ముసుగులు ధరించి ఐదుగురు వ్యక్తులు రబ్బర్ స్టిక్‌లతో దాడి చేసినట్లు ఆరోపించాడని, తాళ్లతో కాళ్లు కట్టేసి దాడికి పాల్పడినట్లు వివరించాడని సీఐడీ కోర్టు తెలిపింది. నిందితుడి గాయాలపై వైద్య పరీక్షలు చేయాలని, గుంటూరు ప్రభుత్వాస్పత్రితో పాటు రమేష్ ఆస్పత్రి వైద్యులతో సంప్రదింపులు జరిపి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. వై కేటగిరి నడుమ రఘురామకు వైద్య పరీక్షలు జరపాలని, ఇరు ఆస్పత్రుల వైద్యులు గాయాలపై ఇచ్చిన నివేదికను కోర్టుకు సమర్పించాలని, తమ అభిప్రాయాన్ని జోడించి రిపోర్ట్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

అటు ఎంపీ రఘురామను శనివారం రాత్రి అధికారులు జీజీహెచ్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. సీఐడీ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేయనున్నారు. అనంతరం ఆయన్ను రమేష్ ఆస్పత్రికి తీసుకువెళ్లనున్నారు. వైద్యుల కమిటీ ఆయన శరీరంపై గాయాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇవ్వనుంది. అయితే ఆయన జీజీహెచ్‌లో ఎన్ని రోజులు ఉంటారనే విషయంపై స్సష్టత లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement