Sunday, May 5, 2024

హైదరాబాద్‌లో క్వాల్కమ్‌ విస్తరణ.. అక్టోబర్‌లో ప్రారంభించనున్న ఐటీ దిగ్గజం

సాఫ్ట్‌వేర్‌, వైర్‌లెస్‌ టెక్నాలజీ, ప్రాసెసర్ల తయారీలో అంతర్జాతీయ దిగ్గజం క్వాలమ్‌ సంస్థ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. మంగళవారం రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అమెరికాలోని శాండియాగోలో క్వాలమ్‌ ప్రధాన కార్యాలయంలో సంస్థ సీఎఫ్‌వో ఆకాశ్‌ పాలీవాలా, ఉపాధ్యక్షులు జేమ్స్‌జిన్‌, లక్ష్మీ రాయపూడి, పరాగ్‌ అగాసే, డైరెక్టర్‌ దేవ్‌సింగ్‌ తదితర కంపెనీ సీనియర్‌ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.

హైదరాబాద్‌ నగరంలో వివిధ దశల్లో రూ.3,904.55 కోట్ల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నట్టు తెలిపిన క్వాలమ్‌.. మంత్రి కేటీఆర్‌తో తన పెట్టుబడి ప్రణాళికను పంచుకున్నది. వచ్చే ఐదేండ్లలో తమ సంస్థ విస్తరణతో 8,700 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు సుమారు 15 లక్షల 72 వేల చదరపు అడుగుల వైశాల్యంగల కార్యాలయం అందుబాటులోకి వస్తుందని తెలిపింది. పెట్టుబడికి ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామని, అక్టోబర్‌ నాటికి హైదరాబాద్‌లో తమ కేంద్రం సిద్ధమవుతుందని తెలిపింది.

ఇప్పటికే పలు టెక్‌ దిగ్గజాలు ప్రపంచంలోనే అతి పెద్ద రెండో క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విషయాన్ని తెలిపిన కేటీఆర్‌, ఈ వరుసలో క్వాలమ్‌ చేరడంపై హర్షం వ్యక్తంచేశారు. భవిష్యత్తులో సెమీకండక్టర్‌ చిప్‌ తయారీ రంగాల్లో తెలంగాణను మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు క్వాలమ్‌ పెట్టుబడి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. సాఫ్ట్‌వేర్‌తో పాటు వ్యవసాయ, విద్యారంగాల్లో తెలంగాణలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడమే తమ విస్తరణ ప్రణాళిక లక్ష్యమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అగ్రిటెక్‌, విద్యారంగం, కనెక్టెడ్‌ డివైజ్‌ వినియోగం, స్మార్ట్‌సిటీ కార్యక్రమాల్లో భాగం కావడానికి సిద్ధంగా ఉన్నట్టు కంపెనీల ప్రతినిధులు మంత్రికి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement