Monday, May 6, 2024

Tollywood: ప‌రిష్కారం దిశ‌గా స‌మ‌స్య‌లు.. త్వరలోనే షూటింగ్‌లుంట‌య్: దిల్‌రాజు క్లారిటీ

ఇకపై ఓటీటీల్లో 55 రోజులు లేదా 8 వారాల తర్వాతే సినిమాను స్ట్రీమింగ్‌కు అనుమతించేలా నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత దిల్‌రాజు చెప్పారు. సినిమా షూటింగ్‌లకు సంబంధించి ఆయన పరిశ్రమ పెద్దలతో కలిసి గురువారం మీడియాతో మాట్లాడారు. మల్టీప్లెక్స్, థియేటర్ సమస్యలకు సంబంధించి కూడా చర్చించామన్నారు. టికెట్ రేట్లు, తినుబండారాల ధరలు కూడా ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామ‌ని దిల్‌రాజు తెలిపారు.

ఇక‌.. సింగిల్ స్క్రీన్ నిర్వాహకులతోనూ టికెట్ ధరలు, ఇతర సమస్యలకు సంబంధించి ఎగ్జిబిటర్లతో రేపు చివరి సమావేశం నిర్వహించి నిర్ణయాలు వెలువరిస్తామన్నారు. ఒక్కో సమస్యలను పరిష్కరించుకుంటూ త్వరలోనే షూటింగ్‌లు మొదలు పెడతామని నిర్మాత దిల్‌రాజు వెల్లడించారు. కాస్ట్ కటింగ్, ప్రొడక్షన్ ఖర్చులు తగ్గింపున‌కు సంబంధించి ఫిల్మ్ చాంబర్- మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌తో ఒక అగ్రిమెంట్ చేసుకున్నామని పేర్కొన్నారు. ఇది తమ వరకు ఒక పెద్ద విజయమన్నారు. మూడు , నాలుగు రోజుల్లో వరుసగా కీలక సమావేశాలు ఉన్నాయని దిల్‌రాజు చెప్పారు.

సినీ కార్మికుల వేతనాల సమస్యలపై స్పందించిన ఆయన.. ఫెడరేషన్‌తోనూ చర్చించామని, ఒకట్రెండు ఫైనల్ మీటింగ్స్ ఉన్నాయని తెలిపారు. ప్రొడ్యూసర్స్ ఇస్తామంటున్న‌ దానికి.. కార్మికులు కోరుతున్న దానికి పెద్దగా వ్యత్యాసం లేదని దిల్‌రాజు వెల్లడించారు. రేపు లేదా ఎల్లుండి షూటింగ్‌లు ప్రారంభమవుతాయ‌ని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీడియా ద్వారా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. బాలీవుడ్ కూడా తెలుగు చిత్ర పరిశ్రమను చాలా నిశితంగా గమనిస్తోందని ఆయన తెలిపారు. ప్రతిరోజూ హిందీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, అక్కడి మీడియా ఇక్కడి డెవలప్‌మెంట్స్‌పై ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement