Thursday, October 3, 2024

Exclusive | శాసనసభ వేదికగా పీఆర్సీ.. ఎన్నికల ఏడాదిలో అన్నీ శుభశకునాలే!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ రెండో పీఆర్సీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం సిద్దమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. శాసనసభా వర్షాకాల సమావేశాల తొలిరోజే సీఎం కేసీఆర్‌ అసెంబ్లిలోని తన చాంబర్‌లో టీఎన్జీవోలు, టీజీవోల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నేతలు ఉద్యోగుల పే రివిజన్‌ కమిషన్‌ ఏర్పాటు, హెల్త్‌ కార్డుల అంశాలపై చర్చించారు. అనంతరం ఉద్యోగ జేఏసీ నేతలు పీఆర్సీతోపాటు ఐఆర్ (మధ్యంతర భృతి) కూడా ప్రకటిస్తామని సీఎం కేసీఆర్‌ తమకు హామీనిచ్చినట్లు వెల్లడించారు. అదేవిధంగా ఉద్యోగులకు మెరుగైన ఆరోగ్య పథకాన్ని కూడా అమలుకు సిద్దంగా ఉన్నారని తెలిపినట్లు ప్రకటించారు. వీలైతే శాసనసభ వేదికగా ఈరోజు లేదంటే శుక్రవారంనాడు పీఆర్సీపై, ఐఆర్‌పై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేసే అవకాశం ఉంది.

సీఎం కేసీఆర్‌తో ఉద్యోగ జేఏసీ భేటీ..
తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ మామిళ్ల రాజేందర్‌, సెక్రటరీ జనరల్‌ మమత, టీజీవో ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్‌, టీఎన్జీవో అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ సత్యనారాయణగౌడ్‌లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా రెండో పీఆర్సీని ఏర్పాటు చేసి 2023 జూలై 1నుంచి అమలయ్యేలా ఐఆర్‌ను ప్రకటించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ న్యాయం చేయాలని కోరారు.

ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ఉద్యోగుల చందాతో కూడిన ట్రస్టును ఏర్పాటు చేసి ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఈహెచ్‌ఎస్‌ను ప్రకటించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీపీఎస్‌ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్‌ను పునురద్దరించాలని, గోపన్‌పల్లిలోని సర్వే నెంబర్‌ 36, 37లలో గతంలో ఉద్యోగులకు కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని భాగ్యనగర్‌ ఎన్జీవోస్‌ హౌజింగ్‌ సొసైటీకి అప్పగించాలని కోరగా, త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్‌ వారికి హామీనిచ్చారు.

- Advertisement -

కాగా ఎన్నికల ఏడాదిలో చివరి సమావేశాలు కావడంతో అన్ని వర్గాలను సంతృప్తిపరుస్తున్న సీఎం కేసీఆర్‌ ఎప్పటినుంచో ఉద్యోగుల డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీ’సుకోనున్నారనే ప్రచారం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఉద్యోగ జేఏసీ నేతలు సీఎం కేసీఆర్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది.

సీఎంకు చేరిన నివేదిక…
అనేక ఉద్యోగ సమస్యలను తొలగించే లక్ష్యంతో సర్కార్‌ ఉందని సమాచారం. ఎన్నికల్లోగా ఉత్తమ ఫిట్‌మెంట్‌తోపాటు, అనేక సమస్యలకు కారణమవుతున్న ఉద్యోగుల హెల్త్‌ స్కీంను కూడా వారికి అనుకూలంగా ప్రకటించనుంది. ఈ మేరకు జీఏడీనుంచి సీఎం కేసీఆర్‌కు ఒక నివేదిక అందినట్లుగా తెలిసింది. ఉద్యోగుల సర్వీసులు, వేతనాలు, ఇతర అంశాలు, సమస్యలు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై పరిపూర్ణ అవగాహన కల్గిన సీనియర్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారుల పేర్లను ప్రభుత్వం పీఆర్సి కమిటీ కోసం పరిశీలిస్తోంది. తాజాగా కొన్ని పేర్లతో సీఎం కేసీఆర్‌కు ప్రతిపాదనలు అందినట్లు తెలిసింది.

2018లో మొదటి పీఆర్సీ…
మొదటి పీఆర్సిని రాష్ట్రంలో 2018 మే 13న ప్రకటించారు. ఉద్యోగులకు ఉన్న అనేక సమస్యలను సానుకూలంగా పరిష్కరించడంతోపాటు, ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన హౌజింగ్‌ అంశాలను కూడా సరళతరం చేయనున్నారని సమాచారం. ఈహెచ్‌ఎస్‌ అమలుకు ఉద్యోగుల వేతనాలనుంచి కొంతమేర వారి షేర్‌గా చేర్చి నూతన ఆరోగ్య పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది. సీపీఎస్‌ నుంచి ఓపీఎస్‌ అమలు దిశగా కూడా కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

సీఎం కేసీఆర్‌ నేరుగా సమస్యలపై ఆరా…
త్వరలో సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌ లేదంటే సచివాలయంలో సమావేశమై వారితోనే చర్చించనున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది మరోసారి ఉద్యోగులకు వరాల ప్రకటన దిశగా ప్రభుత్వం చర్యలు ఆరంభించింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్దిలో కీలక భూమిక పోషిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ప్రాధాన్యతగా ప్రభుత్వం యోచిస్తోంది. ఉద్యోగుల బదలీలు, పదోన్నతులతోపాటు మొదటి వేతన సవరణ(పీఆర్సీ) గడువు ముగియడంతో రెండో పీఆర్సీ ప్రకటనకు ఇద్దమవుతున్నది.

గతంలో ఇలా…
గతంలో 2018లో సీఎం కేసీఆర్‌ ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించారు. శాసనసభను సెప్టెంబర్‌ 6న ముందస్తుగా రద్దు చేశారు. అయితే అంతకుముందే మే 18న ముగ్గురు రిటైర్డ్‌ అధికారులతో పీఆర్సీ ఏర్పాటు చేసి మూడు నెలల కాల పరిమితిని విధించారు. ఈ కమిటీ 2020 డిసెంబర్‌లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కమిషన్‌ కేవలం 7.5 శాతం ఫిట్‌మెంట్‌ సిఫార్సు చేయగా, సీఎం కేసీఆర్‌ అసెంబ్లిd వేదికగా 2021 మార్చి 22న 30శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

గడువు ముగియడంతో…
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో సహా పెన్షనర్లకు ఈ ఏడాదిలోనే పీఆర్సీని ప్రకటించి పెంచిన వేతనాలను అందించేలా సర్కార్‌ కసరత్తు చేస్తోంది. గతేడాది జూన్‌ 30తో మొదటి పీఆర్సీ గడువు ముగియడం, జూలై 1నుంచి 2వ పీఆర్సీ జీతాలివ్వాలనే ఉద్యోగుల ఒత్తిడి నేపథ్యంలో తాజాగా సర్కార్‌ ఒక డీఏను ప్రకటించింది. అయితే మరో విడత కరువు భత్యం త్వరలోనే ప్రకటించి, ఈ ఏడాదిలో ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులకు ముందస్తుగానే పీఆర్సీతో మేలు చేయాలని సర్కార్‌ ఆలోచిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement