Sunday, April 28, 2024

షర్మిల వెనుక పీకే టీం!

తెలంగాణలో పార్టీ స్థాపించేందుకు శరవేగంగా అడుగులు వేస్తున్న వైఎస్ షర్మిల.. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తానని, సీఎం అవుతానని ఇప్పటికే షర్మిల ప్రకటించారు. అయితే, ఆమె గెలుపు ధీమా వెనుక ప్రశాంత్ కిషోర్ టీమ్ ఉందనే ప్రచారం జరుగుతోంది.

దేశంలో ఎన్నికల వ్యూహాకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ ను జగన్ రంగంలోకి దించినట్లుగానే షర్మిల కూడా అన్నను ఫాలో అయ్యారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రశాంత్ కిశోర్ క్షేత్రస్థాయిలో పనిచేయనున్నట్లుగా సమాచారం. ఇందుకోసం ఆయన హైదరాబాద్ లో మకాం వేసినట్లు చెబుతున్నారు. ఆయన స్థాపించిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటి(ఐపీఏసీ) తరుపున కొంత మంది సభ్యుల టీమ్ ఇప్పటికే రంగంలో దిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ బోర్డు షర్మిల ఇంటి వద్ద కనిపించడం బలం చేకూరుస్తోంది.

ఏపీలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం కీలక పాత్ర వహించింది. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ‘ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ఎన్నికల ముందు రెండేళ్లు ఏపీలో వైసీపీ రాజకీయ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించింది. వ్యూహాల నుంచి ప్రచారం వరకు పార్టీ అధినేతతో పాటు శ్రేణులను ముందుండి నడిపించింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత జగన్.. ఎన్నికల ముగిసిన వెంటనే ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లి ప్రశాంత్ కిషోర్ బృందాన్ని అభినందించారు.

ప్రశాంత్ కిషోర్ టీం కొందరు కీలక వ్యక్తులు బృందాన్ని నడిపిస్తూ వైసీపీకి ఘన విజయం కట్టబెట్టారు. వైఎస్సార్సీపీ తరఫున ఐ-ప్యాక్ తమ ప్రచారాన్ని మే-2017లో ప్రారంభించింది. 709 రోజులు తమ ప్రణాళికల్ని అమలు చేసింది. మొత్తం 17 ప్రధాన ప్రచార కార్యక్రమాలను నిర్వహించింది. అందులో 13 ప్రచార కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో నిర్వహించగా.. 4 ప్రచార కార్యక్రమాలు ఆన్‌లైన్‌లో విప్లవం సృష్టించాయి. ఐ-ప్యాక్ తన ప్రచారానికి మొదటి అస్త్రంగా క్షేత్ర స్థాయిలో వైసీపీ బూత్ క్యాడర్‌ని బలోపేతం చేసింది. అదే విధంగా పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తూ వారికి మార్గనిర్దేశం చేసింది. పక్కా ప్రణాళికతో ఆది నుంచి సరైన వ్యూహాన్ని అమలు చేయడం వల్లే పార్టీ ఘన విజయం సాధించింది.

ఇప్పుడు ఇదే ఫార్ములాను షర్మిల కూడా అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. తన పార్టీ గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్ టీం వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. 2019 అసెంబ్లీ ఎన్నిల్లో ఏపీలో వైసీపీ ఒంటరిగా పోటీ చేసి అత్యధిక స్థానాలు గెలిచింది. ఇప్పుడు షర్మిల కూడా ఒంటరిగా పోటీ చేసి తెలంగాణలో అధికారం చేపట్టాలని భావిస్తున్నారు. అందుకే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉండగానే పార్టీతో ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఐ-ప్యాక్ సభ్యులు గ్రౌండ్ లెవల్ లో వర్క్ చేస్తున్నట్లు సమాచారం. పార్టీ విధివిధానాలు, పార్టీ జెండా, అజెండా తదితరాలపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇక, ఎన్నికల ముందు ఐ-ప్యాక్ చేసిన ‘రావాలి జగన్ – కావాలి జగన్’ ప్రచారం పెను సంచలనం సృష్టించింది. ప్రజలకు ఈ నినాదం బాగా కనెక్టయింది. ఏపీలోని ప్రతి గడపకు తాకింది. ఇదే కోవలో షర్మిల కోసం ఐ-ప్యాక్ ఇంకో ప్రధాన ప్రచార కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి అండగా ఉంటూ జగన్‌కు ఐ-ప్యాక్ తిరుగులేని విజయాన్ని కట్టబెట్టింది. దక్షిణ భారత దేశంలో ఒక పార్టీకి ఘన విజయాన్ని అందించి ఒక పొలిటికల్ కన్సల్టెన్సీగా భారత రాజకీయాల్లో తన సత్తా చాటింది. ఇప్పుడు షర్మిలకి అదే తరహా ఫలితం ఇస్తుందో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement