Thursday, April 25, 2024

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు : టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్

  • రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి తెలుగుదేశం
  • ఒకే రోజు 1330 కమిటీలు క్షేత్ర స్థాయిలో పర్యటన
  • త్వరలో బస్తీ, డివిజన్, మండల, మున్సిపల్, నియోజకవర్గ కమిటీలు
  • ఉవ్వెత్తున కార్యక్రమాలు
  • చంద్రబాబు, లోకేష్, బాలయ్య ప‌ర్య‌ట‌న‌ల‌ను ఖరార్ చేస్తాం
  • కుత్బుల్లాపూర్ సభలో బీఆర్ ఎస్ నుండి టీడీపీలోకి భారీగా వలసలు

కుత్బుల్లాపూర్, ప్రభ న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. ఒకే రోజు 1330 కమిటీలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్వరలో బస్తీ, డివిజన్, మండల, నియోజకవర్గ, రెవెన్యూ డివిజన్, జిల్లా స్థాయి కమిటీలు వేసి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని కుత్బుల్లాపూర్ వేదికగా ప్రకటించారు.

అధికారమే లక్ష్యంగా పనిచేద్దాం…
స్వర్గీయ ఎన్టీఆర్ ఏ లక్ష్యం కోసం టీడీపి పార్టీని స్థాపించారో తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త తిరిగి కార్యోముఖులై తెలంగాణ లో అధికారం కోసం శంఖారావం పూరించాల్సిన అవసరం ఉందన్నారు.

ఉవ్వెత్తున కార్యక్రమాలు
ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని అందుకు తెలంగాణ లో ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం తరహా సభలు నిర్వహించుకుంటూనే జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, బాలయ్య లాంటి అతి ముఖ్యమైన నేతలతో పర్యటనలు ఉంటాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 594 మండలాలు, 10909 గ్రామాల్లో కమిటీలు వేసి గ్రామ గ్రామాన పసుపుజెండా ఎగురిద్దమని తెలియజేశారు.

నా నిర్ణయం సరైందే..
తెలుగుదేశం పార్టీలో చేరి సబ్బండ వర్గాల ఆశయ సాధన కోసం పోరాడాలని నిర్ణయించుకుని టీడీపీలో చేరడం జరిగిందని, ఖమ్మం సభ గ్రాండ్ సక్సెస్ తర్వాత పార్టీ తెలంగాణలో తిరిగి పూర్వ వైభవం దక్కించుకుంటుందని స్పష్టమైందన్నారు. ఇక కార్యకర్తల సమన్వయం- సంక్షేమం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేయడంతో పాటు పార్టీ కార్యకర్తల శ్రేయస్సుకోసం కృషి చేయనున్నామన్నారు.

- Advertisement -

కుత్బుల్లాపూర్ సభలో బీఆర్ఎస్ నుండి టీడీపీలోకి భారీగా వలసలు…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధి నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ బాచుపల్లి లో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో అధికార పార్టీ బీఆర్ఎస్ నుండి టీడీపీలోకి భారీగా వలసలు వచ్చి చేరాయి. పార్టీలో చేరిన వారికి కాసాని టీడీపీ జెండా కప్పి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన వారిలో మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, మాజీ వార్డు సభ్యులు దూసకంటి వెంకటేష్, అశోక్, సాయినగర్ నుండి అల్తాఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాణి, విజయలక్ష్మి పెద్ద ఎత్తున చేరారు.

అధికారం కోసం కలిసికట్టుగా పనిచేద్దాం : లీడర్ నర్సింహారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ ఉపాధ్యక్షుడు
తెలంగాణ లో టీడీపీకి ఎనలేని ఆదరణ ఉంది. పార్టీ కి కార్యకర్తలే పట్టుకొమ్మలు. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా బూత్ స్థాయిలో పటిష్టంగా ఉన్న ఏకైక పార్టీ టీడీపీనే. కానీ అందరి మధ్య సమన్వయ లోపం కనబడుతోంది. దానిని అధిగమించి భవిష్యత్ కార్యచరణతో అధికారమే లక్ష్యంగా పనిచేద్దాం. ఇందుకు నా శక్తీ వంచన లేకుండా కృషి చేస్తా.
కార్యక్రమంలో ధూళిపాళ్ల రాజేశ్, కిరణ్, నాగేశ్వర్ రావు, ప్రసన్నకుమార్, రవి కిరణ్, రామారావు, చిరంజీవి, కరుణాకర్, నాగేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement