Wednesday, May 1, 2024

తిరుపతిలో పాత-కొత్త కలయిక!

తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు  కావడంతో ఇక ప్రచారం ఊపందుకొనుంది. వైసీపీ ఎంపీ దుర్గా ప్రసాదరావు అనారోగ్యంతో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఏప్రిల్ 17న తిరుపతి ఉపఎన్నిక జరగనుంది. వైసీపీ నుంచి గురుమూర్తి, టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి, బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ బరిలో దిగారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ను రంగంలో దించారు. పోటీదారులను పరిశీలిస్తే సీనియర్లు, జూనియర్ల మధ్య హోరాహోరీ పోరుకు తెరలేవనుంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చింతా మోహన్‌ ఇప్పటికే ఇక్కడి నుంచి తొమ్మిది సార్లు పోటీ చేశారు. ఆరుసార్లు విజయం సాధించారు. తాజాగా పదోసారి బరిలోకి దిగారు. 1984, 1989, 1991, 1998, 2004, 2009లో విజయం సాధించగా.. 1999, 2014, 2019లో ఓటమి చెందారు.

ఇక, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి వరసగా ఎనిమిదో సారి పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 1996 నుంచి ఈమె నెల్లూరు, బాపట్ల, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ఏడుసార్లు పోటీ చేశారు. 1999లో నెల్లూరు, 2014లో బాపట్ల, 2019లో తిరుపతిలో ఓటమి చెందగా.. మిగిలిన నాలుగు సార్లు విజయం సాధించారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో టీడీపీ తరఫున మహిళా అభ్యర్థిగా రెండు సార్లు బరిలోకి దిగిన ఘనత పనబాకకే దక్కుతుంది. 19996లో ఇక్కడ ఈ పార్టీ తరఫున జి.రాజశ్రీ పోటీ చేశారు.

మరోవైపు వైసీపీ అభ్యర్థి ఫిజియోథెరపిస్టుగా పని చేస్తున్న పి.గురుమూర్తి ఉన్నారు. ఇక బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభను రంగంలో దించారు. వీరికి ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా ఉప ఎన్నికల బరిలోకి దిగారు.

తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి ఎక్కువసార్లు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. 1952 నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగ్గా 12 సార్లు కాంగ్రెస్‌ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఇందులో చింతా మోహన్‌ అత్యధిక సార్లు ఎంపీగా గెలుపొందారు. టీడీపీ నుంచి ఓ సారి, ఐదుసార్లు కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించారు. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మాడభూషి అనంతశయనం అయ్యంగార్‌ గెలుపొందారు. తిరుపతి స్థానానికి 1962,  1967లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి సి.దాస్‌, 1971, 1977లో తంబురు బాలకృష్ణయ్య, 1980లో పసల పెంచలయ్య, 1984లో టీడీపీ నుంచి డాక్టర్‌ చింతా మోహన్‌ విజయం సాధించారు. తిరిగి 1989, 1991లో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందారు. ఆయనకు 1996లో టిక్కెట్‌ రాలేదు. నెలవల సుబ్రమణ్యానికి టికెట్‌ రాగా ఎన్నికయ్యారు. 1998లో తిరిగి చింతా మోహన్‌కు కాంగ్రెస్‌ టిక్కెట్‌ రాగా విజయం సాధించారు. 1999లో టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థిగా ఎన్‌.వెంకటస్వామి పోటీ చేసి గెలుపొందారు. 2004, 2009లో తిరిగి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన చింతా మోహన్‌ను విజయం వరించింది. ఇక వైసీపీ నుంచి 2014లో వరప్రసాదరావు, 2019 లో బల్లి దుర్గాప్రసాద్‌రావు విజయం సాధించారు. అయితే, దుర్గాప్రసాదరావు అనారోగ్యంతో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. మొత్తం మీద తిరుపతి ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ప్రజా తీర్పు ఎలా ఉంటుంది అనేది మరి కొద్ది రోజుల్లో తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement