Thursday, April 25, 2024

Spl Story | రాజకీయ పార్టీలు, స్కామ్​ల పరంపర.. దేశంలో మొదటి కుంభకోణం ఎప్పుడు జరిగింది?

లిక్కర్​ స్కామ్​లో ఢిల్లీ మాజీ సీఎం మనీష్ సిసోడియా తీహార్ జైలుకు వెళ్లారు. ఉద్యోగాల కోసం భూ కుంభకోణంలో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, అతని కుటుంబ సభ్యులను సీబీఐ ప్రశ్నిస్తోంది. అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎం కూడా సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు. ఓ దోపిడీ కేసులో పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం నుంచి ఫౌజా సింగ్ సరారీ మంత్రి పదవి కోల్పోయారు. ఈ మధ్యనే కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే కొడుకు పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ అరెస్టయ్యాడు. అయితే స్వతంత్ర భారతదేశంలో మొదటి స్కామ్ ఏది? ఎప్పుడు జరిగింది? అనే ప్రశ్న చాలామంది నుంచి వినిపిస్తోంది.

– నాగరాజు చంద్రగిరి​, ఆంధ్రప్రభ

భారత దేశాన్ని చాలాకాలంగా ఇండియన్​ నేషనల్​ కాంగ్రెస్ పార్టీ (కాంగ్రెస్​)​, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పరిపాలిస్తున్నాయి. దేశంలో ఈ రెండు పార్టీల ఏలుబడే ఎక్కువ.. ఇతర అలయెన్స్​లో వచ్చిన ప్రభుత్వాలు ఎక్కువకాలం నిలబడలేదు. అయితే.. ఇప్పుడు ఈ రెండు ప్రధాన పార్టీలు త్వరలో జరగబోయే ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని ప్రత్యారోపణలు చేసుకుంటూ.. దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ‘మీది అవినీతి ప్రభుత్వం అంటే.. మీదే అవినీతి ప్రభుత్వం’ అని ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నాయి.

ఇక.. కాంగ్రెస్​ ప్రభుత్వం హయంలో, బీజేపీ ప్రభుత్వ హయాంలో లెక్కకు మించిన కుంభకోణాలు జరిగాయి. 2జీ, దాణా, ఫైనాన్షియల్​, షేర్​ మార్కెట్​ వంటివి చాలానే ఉన్నాయి. ఇందులో ఇప్పుటికిప్పుడైతే ప్రజలు మరిచిపోలేనిది రాఫెల్​ యుద్ధ విమానాల కుంభకోణం. ప్రధాని మోదీ హయాంలో ఈ డీల్​ జరిగింది. ఫ్రాన్స్​ నుంచి భారత్​ యుద్ధ విమానాల కొనుగోలు చేపట్టింది. కాగా.. ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రాఫెల్​ జెట్​ ఫైటర్స్​ కుంభకోణం దేశంలోనే అతిపెద్దది అని కాంగ్రెస్​ పార్టీ ముఖ్య నేత రాహుల్​ గాంధీ ఆరోపణలు చేశారు.

భారత్​లో తొలి కుంభకోణం..

- Advertisement -

కొన్ని రికార్డులు, పాత నివేదికలను పరిశీలిస్తే.. 1948 నాటి జీప్ స్కాం భారతదేశంలో మొదటి పెద్ద అవినీతి కేసుగా ఉంది. బ్రిటన్‌లో అప్పటి భారత హైకమిషనర్‌గా ఉన్న వీకే కృష్ణ మీనన్ ప్రొటోకాల్‌ను దాటవేసి, ఆర్మీ కోసం జీపుల కొనుగోలు చేపట్టారు. ఒక విదేశీ సంస్థతో రూ. 80 లక్షల విలువైన ఒప్పందం కుదుర్చుకున్నారు. 2 వేల పునరుద్ధరించిన జీప్‌లు అత్యవసరంగా అవసరమని.. కొత్త వాహనాలకూ అదే ధరకు ఆర్డర్ ఇచ్చారు. జీప్‌లను డెలివరీ చేయడానికి పెద్దగా తెలియని కంపెనీ యాంటీ-మిస్టాంటెస్‌కు అప్పగించారు. యాంటీ-మిసాంటెస్ అప్పట్లో కేవలం 605 అమెరికన్​ డాలర్ల మూలధనాన్ని మాత్రమే కలిగి ఉందని తెలుస్తోంది.

ఈ డీల్​ కోసం చాలా వరకు డబ్బు ముందుగానే చెల్లించగా.. కేవలం 155 జీపులు మాత్రమే వచ్చాయి. అయితే.. భారత సైన్యం ఈ జీపులను నాణ్యత లేవనే కారణంగా తిరస్కరించింది. ఈ వివాదంలో చిక్కుకున్న వీకే కృష్ణ మీనన్‌ భారత హైకమిషనర్‌ పదవికి రాజీనామా చేశారు. ఈ కేసు విచారణ 1955లో ముగిసింది. ఆ వెంటనే వీకే కృష్ణ మీనన్ జవహర్‌లాల్ నెహ్రూ కేబినెట్‌లో చేరారు. 1956లో నెహ్రూ కేబినెట్‌లో పోర్ట్ ఫోలియో లేకుండా ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. 1957లో రక్షణ మంత్రిగా చేశారు. ఇదండీ భారత దేశంలో మొదటి కుంభకోణం.

లిక్కర్​ స్కామ్​ ఏమిటి?.. దీనికి ఇంపార్టెన్స్​ ఎందుకు?

ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని అంతరంగిక నిర్ణయాలు ఇతరులకు లీకయ్యాయన్నది ఈ స్కామ్​ ప్రధాన ఆరోపణ. ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్​ పాలసీని తీసుకొచ్చింది. ఇది ప్రైవేటు వ్యక్తులకు చేరవేసి, లిక్కర్​ సిండికేట్​కు అప్పగించే యత్నం జరిగిందని, దీనికి 100 నుంచి 150 కోట్ల డీల్​ జరిగిందని సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే.. ఈ కేసును బీజేపీ హై కమాండ్​ ​ కావాలనే తెరమీదికి తీసుకొచ్చిందని, రాజకీయంగా ఇతర పార్టీలను ఇరుకున పెట్టేందుకే ఈ కేసు అంటూ ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. ఇందులో అటు వ్యాపార పరంగా, ఇటు ఢిల్లీ ప్రభుత్వానికి కూడా ఎట్లాంటి నష్టాలు లేవని.. కావాలనే ఈ డీల్​ని పెద్దది చేసి రాజకీయంగా ఇరుకున పెట్టాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని, దీనికోసం స్వచ్ఛంద సంస్థలైన ఈడీ, సీబీఐని వినియోగించుకుంటోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement