Thursday, April 25, 2024

హుజురాబాద్ లో హీటెక్కిన రాజకీయం!

హుజురాబాద్ లో రాజకీయం హీటెక్కింది. ఉప ఎన్నిక నేపథ్యంలో ఈటల వర్సెస్ టీఆర్ఎస్ ఉన్నట్టుగా మారాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాక బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల దూకుడు పెంచారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్ పై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. మరోవైపు జిల్లా మంత్రులు, టీఆర్ఎస్ నేతలు హజురాబాద్ లో మకాం వేశారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను గెలిపిస్తే అసలు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామంటూ ప్రచారం మొదలు పెట్టారు. పార్టీ క్యాడర్ ఈటల వైపు వెళ్లకుండా వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ నేతల పర్యటనలతో హుజురాబాద్ నియోజకవర్గం వేడెక్కింది.

మంత్రులు కొప్పుల ఈశ్వర్ , గంగుల కమలాకర్ లు గత మూడు రోజులుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ ఇద్దరు మంత్రులు వేర్వేరు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు వరాలు కురిపిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలిపోయింది. చాలా మంది ఈటల వెంటే నడుస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ క్యాడర్ చేజారిపోకుండా టీఆర్ఎస్ పార్టీ జాగ్రతలు తీసుకుంటోంది. గురువారం కొప్పుల ఈశ్వర్ జమ్మి కుంటలో కార్యకర్తలతో సమావేశం కాగా, గంగుల కమలాకర్ హుజురాబాద్ లో రేషన్ డీలర్ల సమావేశంలో పాల్గొని వరాల జల్లులు కురిపించారు. పార్టీని నమ్ముకున్న వారికి ఖచ్చితంగా అండగా ఉంటామని మంత్రి కొప్పుల కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. పార్టీని వీడవద్దని హితబోధలు చేశారు.

ఈటల రాజేందర్‌ది ఆత్మగౌరవం కాదని, ఆత్మవంచన అని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మండిపడ్డారు. తన వ్యక్తిగత విషయాలను ప్రజలపై రుద్దుతున్నాడని మండిపడ్డారు. ప్రజలను భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ వ్యాపారం చేసేందుకు సిద్ధమయ్యాడని దుయ్యబట్టారు. పార్టీలో పదవులన్నీ అనుభవించిన ఈటల, టీఆర్‌ఎస్‌ను ఎందుకు వీడాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నిన్నటి దాకా నల్ల చట్టాలు.. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టిన విషయాలను మరిచిపోయావా?అని నిలదీశారు. మతతత్వ పార్టీలో చేరిన ఈటలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. 

హుజురాబాద్ నియోజకవర్గానికి ప్రభుత్వం ప్రత్యేకంగా విడుదల చేసిన రూ.35 కోట్ల నిధుల గురించిన మంత్రి గంగుల ప్రజలకు వివరిస్తున్నారు. హుజురాబాద్ లో అభివృద్ది అంటే ఏంటో తాము చూపిస్తామంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. రేషన్ డీలర్ల సభలో కేంద్రప్రబుత్వం కమీషన్ నిధులు విడుదల చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ అందించిందని గుర్తు చేశారు. రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో ఈటల టీఆర్ఎస్ పార్టీకి చేసిన వెన్నుపోటుపై కూడా ప్రజలకు వివరించే పనిలో ఉన్నారు.

ఈటల రాజేందర్‌కు ఆస్తులపై ఉన్న తాపత్రయం, అభివృద్ధిపై లేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రగతిని ఏనాడూ పట్టించుకోలేదన్నారు. తు సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. త్వరలో రాష్ట్రంలోని 4.5 లక్షల మందికి కొత్త రేషన్‌కార్డులు అందజేస్తామని తెలిపారు. 57 ఏండ్లు ఉండి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరుచేస్తామని చెప్పారు. రాబోయే ఉపఎన్నికలో హుజూరాబాద్‌లో గులాబీ జెండాను ఎగరేస్తామని ధీమా వ్యక్తంచేశారు. రైతుబంధు డబ్బులు ఈ నెల 25 వరకు ప్రతి ఒక్కరి ఖాతాలో జమవుతాయని చెప్పారు.

- Advertisement -

ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తరువాత గురువారం మొదటి సారి హుజురాబాద్ లో అడుగుపెట్టారు. ఆయనకు ప్రజలు, బీజేపీ కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది. నాలుగు రోజు ల పాటు నియోజవర్గంలో విస్తృతంగా పర్యటించేందుకు ఈటల ఏర్పాట్లు చేసుకున్నారు. హూజూరాబాద్‌లో కాషాయ జెండా ఎగరేస్తామని ఈటల అన్నారు. ఉప ఎన్నిక అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, సీనియర్‌ నాయకులందరినీ కలుపుకొని వాడవాడలో తిరుగుతూ పార్టీని బలోపేతం చేస్తానన్నారు. మంత్రులకు ఆత్మగౌరవం ఉందా? అని ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఉప ఎన్నికలో తనను ఓడించేందుకు మండలానికి ఒక మంత్రి, గ్రామాలకు ఎమ్మెల్యేను ఇన్‌చార్జులుగా నియమించడాన్ని చూస్తే ప్రభుత్వంలో భయం స్పష్టంగా కనిపిస్తోందని ఈటల అన్నారు.

2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక రిహార్సల్‌, దిక్సూచిలా ఉంటుందని ఈటల వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్దె దింపుతామన్నారు. నాడు తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్‌ జిల్లా ఎట్లా అండగా నిలిచిందో, ఆ జిల్లాకు హుజూరాబాద్‌ ఎలాగైతే ఊపిరి పోసిందో, నేడు మలి దశ ఉద్యమానికి, ఆత్మగౌరవ పోరాటానికి, రాచరికాన్ని బొందపెట్టడానికి కేంద్ర బిందువుగా మారుతుందని, మళ్లీ పొలికేక వేస్తుందన్నారు. ఆత్మ గౌరవ పోరాటానికి హుజూరాబాద్‌ వేదిక కాబోతున్నదన్నారు. సీఎం కేసీఆర్ అహంకారానికి హుజూరాబాద్‌ ప్రజలు రాబోయే రోజుల్లో ఘోరీ కట్టడం ఖాయమని ఈటల వ్యాఖ్యానించారు. మొత్తం మీద కేసీఆర్ సర్కార్ తాయిలాలు ఓవైపు… ఆత్మగౌవరం అంటూ ఈటల సెంటిమెంట్ మరోవైపుతో ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారు? అన్నది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో హుజురాబాద్ రాజకీయం ఆసక్తి రేపుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement