Saturday, April 20, 2024

పోలీసుల ఓవర్ యాక్షన్.. మాజీ మంత్రి తుమ్మల అనుచరులపై వీరంగం

ఖమ్మం జిల్లాలో గురువారం రాత్రి అధికార పార్టీ నేతల పట్ల ఖమ్మం రూరల్ పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పద అంశంగా మారింది. ఖమ్మం నగరంలోని 59 వ డివిజన్ కు చెందిన మాజీ కార్పొరేటర్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అనుచరుడు జంగం భాస్కర్ ను ఖమ్మం రూరల్ పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి చెప్పినట్లుగానే ఖమ్మం రూరల్ పోలీసులు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే కందాల అనుచరగణం పలుమార్లు మాజీ మంత్రి తుమ్మల అనుచరగణంపై అనవసర ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కి వ్యతిరేకంగా మాజీ కార్పొరేటర్  జంగం భాస్కర్ ఇటీవల ఏదో పోస్టింగ్ పెట్టారని కారణం చూపుతూ గురువారం రాత్రి  జంగం భాస్కర్ ను రూరల్ ఏసీపీ బస్వా రెడ్డి సారధ్యంలో పోలీసులు అరెస్టు చేశారు.  అరెస్టును నిరసిస్తూ జంగం భాస్కర్ భార్య కుటుంబ సభ్యులతో పాటు నియోజకవర్గంలోని తుమ్మల నాగేశ్వరరావు అనుచరగణం అంతా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఏసిపి బసవ రెడ్డి ఆందోళనను వారించే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినకుండా భాస్కర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో  పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు ఆందోళనకారుల మధ్య వివాదం మరింత తీవ్రస్థాయికి చేరి ఉద్రిక్తతకు తీసింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుల విషయంలో కొంతకాలంగా ఖమ్మం రూరల్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పద అంశంగా మారింది. సోషల్ మీడియా పోస్టింగులు పేరుతో అధికార పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తుండ డాన్ని ప్రజలు ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు. 

భారత రాజ్యాంగం, పోలీసు చట్టాల ప్రకారం వ్యవహరించాల్సిన ఖమ్మం రూరల్ పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ట్లుగా ఇటీవల కాలంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తుండటం విశేషం. అర్ధరాత్రి జరిగిన ఆందోళనతో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement